Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వన్డేల్లో న్యూజిలాండ్ ఆధిపత్యం చూపించింది. చిన్న బౌండరీల మైదానంలో 307 పరుగుల లక్ష్యాన్ని ఊదేసింది. టామ్ లేథమ్ (145 నాటౌట్) అజేయ శతకానికి కెప్టెన్ కేన్ విలియమ్సన్ (94 నాటౌట్) సమయోచిత ఇన్నింగ్స్ తోడైంది. తొలి వన్డేలో భారత్‌ను ఓడించిన న్యూజిలాండ్ సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. సిరీస్‌లో కీలక రెండో వన్డే ఆదివారం హామిల్టన్‌లో జరుగనుంది.
- ఛేదనలో లేథమ్, కేన్ దూకుడు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ గెలుపు
నవతెలంగాణ-ఆక్లాండ్
టామ్ లేథమ్ (145 నాటౌట్, 104 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ శతకంతో చెలరేగగా, కెప్టెన్ కేన్ విలియమ్సన్ (94 నాటౌట్, 98 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) తనదైన ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. 307 పరుగుల ఛేదనలో మూడో వికెట్‌కు అజేయంగా 229 పరుగులు జోడించిన లేథమ్, విలియమ్సన్ తొలి వన్డేలో న్యూజిలాండ్ విజయానికి బాటలు వేశారు. తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో భారత్‌పై కివీస్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 306 పరుగులు సాధించింది. శ్రేయస్ అయ్యర్ (80, 76 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), శిఖర్ ధావన్ (72, 77 బంతుల్లో 13 ఫోర్లు), శుభ్‌మన్ గిల్ (50, 65 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో రాణించారు. అజేయ శతకం బాదిన టామ్ లేథమ్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు.
లేథమ్, కేన్ కేక : 307 పరుగుల ఛేదనలో కివీస్‌కు మెరుపు ఆరంభమేమీ లభించలేదు. ఓపెనర్లు ఫిన్ అలెన్ (22), డెవాన్ కాన్వే (24) సహా డార్లీ మిచెల్ (11)ను భారత్ ఆరంభంలోనే సాగనంపింది. 80 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ కాస్త ఒత్తిడిలో పడింది. ఈ పరిస్థితుల్లో జతకట్టిన కెప్టెన్ కేన్ విలియమ్సన్, టామ్ లేథమ్ జోడీ.. మ్యాచ్‌ను శాసించింది. నెమ్మదిగా ఆరంభించిన లేథమ్.. అర్థ సెంచరీ అనంతరం దూకుడు అందు కున్నాడు. విలియమ్సన్ మరో ఎండ్‌లో సమయోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టు కున్నాడు. ఓ ఎండ్‌లో లేథమ్ ఎదురుదాడి చేయగా, కేన్ స్ట్రయిక్రొటేషన్లో విజయవంత మయ్యాడు. ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 51 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన లేథమ్.. శతకాన్ని 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 బంతుల్లోనే సాధించాడు. ఇక విలియమ్సన్ నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 54 బంతుల్లో సంప్రదాయ శైలిలో అర్థ సెంచరీ నమోదు చేశాడు. చివర్లో శతకం సాధించే అవకాశం ఉన్నప్పటికీ.. జోరుమీదున్న లేథమ్‌కు స్ట్రయిక్ ఇవ్వటానికి కేన్ మొగ్గుచూపాడు. శతకానికి ఆరు పరుగుల దూరంలో అజేయంగా నిలిచాడు. 47.1 ఓవర్లలోనే లాంఛనం ముగించిన కివీస్.. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ముగ్గురు మెరిసినా..! : టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ వచ్చింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (72), శుభ్‌మన్ గిల్ (50) భారత్‌కు అదిరే ఆరంభాన్ని అందించారు. అర్థ సెంచరీలతో మెరిసిన ఓపెనర్లు తొలి వికెట్‌కు 124 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించారు. మిడిల్ ఆర్డర్లో విధ్వంసక బ్యాటర్లు ఉండటంతో భారత్ భారీ స్కోరుకు పునాది వేసుకుందని అనిపించింది. కానీ ఒకే స్కోరు వద్ద ఓపెనర్లు వికెట్లు కోల్పోయారు. శ్రేయస్ అయ్యర్ (80) ఈ ఫార్మాట్లో ఫామ్ కొనసాగించాడు. కీలక ఇన్నింగ్స్‌తో భారత్ జోరు నిలిపాడు. కానీ రిషబ్ పంత్ (14), సూర్యకుమార్ యాదవ్ (4) నిరాశపర్చటం డెత్ ఓవర్ల స్కోరుపై ప్రభావం చూపించింది. సంజు శాంసన్ (36), వాషింగ్టన్ సుందర్ (37) మెరుపులతో భారత్ 300 స్కోరు మార్క్ చేరుకుంది. చిన్న బౌండరీల మైదానంలో భారత బ్యాటర్లు ఆశించిన దూకుడు చూపించలేదు.
స్కోరు వివరాలు....
భారత్ ఇన్నింగ్స్ : ధావన్ (సి) అలెన్ (బి) సౌథీ 72, గిల్ (సి) కాన్వే (బి) ఫెర్గుసన్ 50, శ్రేయస్ (సి) కాన్వే (బి) సౌథీ 80, పంత్ (బి) ఫెర్గుసన్ 15, సూర్య (సి) అలెన్ (బి) ఫెర్గుసన్ 4, సంజు శాంసన్ (సి) ఫిలిప్స్ (బి) మిల్నె 36, వాషింగ్టన్ నాటౌట్ 37, శార్దుల్ (సి) లేథమ్ (బి) సౌథీ 1, ఎక్స్‌ట్రాలు : 11, మొత్తం : (50 ఓవర్లలో 7 వికెట్లకు) 306.
వికెట్ల పతనం : 1-124, 2-124, 3-156, 4-160, 5-254, 6-300, 7-306.
బౌలింగ్ : సౌథీ 10-73-3, హెన్రీ 10-1-48-0, ఫెర్గుసన్ 10-1-59-3, శాంట్నర్ 10-0-56-0, మిల్నె 10-0-67-1.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : అలెన్ (సి) పంత్ (బి) శార్దుల్ 22, కాన్వే (సి) పంత్ (బి) మాలిక్ 24, విలియమ్సన్ నాటౌట్ 94, మిచెల్ (సి) హుడా (బి) మాలిక్ 11, లేథమ్ నాటౌట్ 145, ఎక్స్‌ట్రాలు : 13, మొత్తం : (47.1 ఓవర్లలో 3 వికెట్లకు) 309.
వికెట్ల పతనం : 1-35, 2-68, 3-88.
బౌలింగ్ : అర్షదీప్ 8.1-0-68-0, శార్దుల్ 9-1-63-1, వాషింగ్టన్ 10-0-42-0, ఉమ్రాన్ మాలిక్ 10-066-2, చాహల్ 10-0-67-0.