Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐదుసార్లు ప్రపంచకప్ చాంపియన్, టైటిల్ ఫేవరేట్ బ్రెజిల్ వేట మొదలైంది. డిఫెన్స్‌లో పెట్టని గోడ సెర్బియాను చిత్తు చేసిన బ్రెజిల్.. టైటిల్ రేసులో ప్రత్యర్థులకు బలమైన సంకేతాలు పంపించింది. బరిలో నిలిచిన తొలి మ్యాచ్‌లోనే టోర్నీలోనే అత్యుత్తమ అనదగిన గోల్ నమోదు చేసిన బ్రెజిల్.. ప్రపంచ సాకర్ ప్రియులను వినోదంలో ముంచెత్తింది. 2-0తో సెర్బియాపై గెలుపొందిన బ్రెజిల్ గ్రూప్-జిలో అగ్రస్థానం కైవసం చేసుకుంది.
- 2-0తో సెర్బియాపై ఘన విజయం
- కండ్లుచెదిరే గోల్ కొట్టిన రిచర్లిసన్
- 2022 ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్
నవతెలంగాణ-లుసైల్ (ఖతార్)
2022 ఫిఫా ప్రపంచకప్. సాకర్ సమరం ఆరంభమై వారం రోజులైనా అవలేదు. అప్పుడే ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంది. అన్నింటికి మించి.. బ్రెజిల్, సెర్బియా మ్యాచ్‌లో ఆవిష్కితమైన అద్భుతం ఏండ్ల పాటు ఫుట్‌బాల్ అభిమానుల కండ్లముందే కదలాడుతుందని చెప్పటం అతిశయోక్తి కాదు. బ్రెజిల్ స్టార్ స్ట్రయికర్ రిచర్లిసన్ ఖతార్‌లో ఖతర్నాక్ గోల్ కొట్టాడు. ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులే కాదు సాకర్ విశ్లేషకులు సైతం ఇప్పుడు ఈ గోల్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆట 73వ నిమిషంలో వినిసిస్ జూనియర్ నుంచి పాస్ అందుకున్న రిచర్లిసన్.. నిజానికి పాస్‌పై నియంత్రణ సాధించలేదు. పట్టు చిక్కని పాస్‌ను సైతం సద్వినియోగం చేసుకునేందుకు.. ఏరియల్ వ్యూలో గాల్లోకి సమాంతరంగా ఎగిరిన రిచర్లిస్.. కుడి కాలు కిక్‌తో సెర్బియా గోల్ పోస్ట్‌పై ఊహకందని దాడి చేశాడు. రిచర్లిస్ కండ్లుచెదిరే విన్యాసంతో గోల్ సాధించటంతో ప్రత్యర్థి సెర్బియా ఆటగాళ్లు సైతం ఆశ్చర్యపోయారు. ఫిఫా ప్రపంచకప్ గ్రూప్-జి మ్యాచ్‌లో సెర్బియాపై బ్రెజిల్ 2-0తో విజయం సాధించింది. రిచర్లిసన్ 62, 73వ నిమిషాల్లో డబుల్ గోల్ సాధించాడు. సెర్బియాపై విజయంతో విలువైన మూడు పాయింట్లు ఖాతాలో వేసుకుంది బ్రెజిల్. అత్యంత బలమైన ఎటాకింగ్, డిఫెన్స్ విభాగాలతో కూడిన బ్రెజిల్ తన ఆరంభ మ్యాచ్‌లో అదిరే విజయంతో టైటిల్ రేసులో ప్రత్యర్థులకు పదునైన హెచ్చరిక పంపించింది!.
బ్రెజిల్ షో
స్టార్స్‌తో కూడిన జట్టు. ఐదు సార్లు చాంపియన్. ఎక్కడ, ఎప్పుడు బరిలో నిలిచినా ఫేవరేట్ ఆ జట్టే. గ్రూప్-జి మ్యాచ్‌లో సైతం బ్రెజిల్ ఫేవరేట్‌గానే బరిలోకి దిగింది. సెర్బియాపై అన్ని రకాలుగా ఆధిపత్యం చెలాయించింది. సెర్బియా గోల్‌పోస్ట్‌పై బ్రెజిల్ ఏకంగా 23 సార్లు చేయటం విశేషం. అందులో 9 సార్లు గోల్‌కు చేరువగా వెళ్లింది. ఇక సెర్బియా కేవలం ఐదు సార్లు గోల్‌పోస్ట్‌పై దాడి చేయగా.. అందులో ఒక్కటి కూడా లక్ష్యం దిశగా వెళ్లలేదు. బంతిని 60 శాతం నియంత్రణలో నిలుపుకున్న బ్రెజిల్ ఆటగాళ్లు కచ్చితమైన పాస్‌లతో సెర్బియాతో ఆడుకున్నారు. అయితే, డిఫెన్స్‌లో బలంగా కనిపించిన సెర్బియా ప్రథమార్థంలో బ్రెజిల్‌కు గోల్ నిరాకరించింది. బ్రెజిల్ చూపిన దూకుడుకు రెండు కంటే ఎక్కువ గోల్సే నమోదు కావాలి. కానీ సెర్బియా డిఫెన్స్ గొప్పగా నిలువరించింది.
62వ నిమిషంలో బ్రెజిల్‌కు తొలి గోల్ అందించాడు రిచర్లిసన్. బ్రెజిల్‌ను 1-0తో ఆధిక్యంలో నిలిపిన 11 నిమిషాల వ్యవధిలోనే... రిచర్లిసన్ ప్రపంచకప్ చరిత్రలోనే నిలిచిపోయే గోల్ కొట్టాడు. సెర్బియా పెనాల్టీ ఏరియాకు కాస్త ముందున్న రిచర్లిసన్.. వినిసస్ జూనియర్ నుంచి పాస్ అందుకున్నాడు. రిచర్లిసన్కు కుడి, ఎడమ వైపు ఇద్దరు సెర్బియా డిఫెండర్లు ఉన్నారు. పాస్‌పై రిచర్లిసన్కు పెద్దగా నియంత్రణ లేదు. దీంతో అక్కడ గోల్ అవకాశమే లేదని అనిపించింది. కానీ ఒక్కసారిగా గ్రౌండ్‌కు సమాంతరంగా బాడీని సమన్వయం చేసుకున్న రిచర్లిసన్.. కుడి కాలు కిక్‌తో అద్వితీయ గోల్ కొట్టాడు. ఈ గోల్‌తో సాకర్ ప్రపంచం ఊగిపోయింది. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు, అభిమానులు సైతం ఔరా.. ఏమా గోల్ అంటూ ఆస్వాదించారు!. ఆట ఆఖరు వరకు మరో గోల్ కోసం బ్రెజిల్ ఎదురుదాడి చేసింది. బలమైన జట్టుకు రెండు గోల్స్ మాత్రమే ఇచ్చిన సెర్బియా సైతం విమర్శకుల మెప్పు పొందే ప్రదర్శన చేసింది. బ్రెజిల్ స్టార్ ఆటగాడు నెరుమార్ జూనియర్ ప్రపంచకప్‌లో మెరుపు పాస్‌లు, విన్యాసాలతో అభిమానులను అలరించాడు.