Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సొంతగడ్డపై వరుసగా 13 వన్డేల్లో విజయాలు సాధించిన జోరుమీదున్న న్యూజిలాండ్ నేడు హామిల్టన్ విజయంతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు కివీస్ చేతిలో వరుసగా ఐదు వన్డే పరాజయాలకు తెరదించుతూ, సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకునేందుకు టీమ్ ఇండియా సమరానికి సై అంటోంది. భారత్, న్యూజిలాండ్ రెండో వన్డే పోరు నేడు.
- భారత్‌కు నేడు చావోరేవో
- కివీస్‌తో రెండో వన్డే నేడు
- ఉదయం 7 నుంచి ప్రైమ్‌లో..
నవతెలంగాణ- హామిల్టన్
దూకుడు చూపిస్తారా?! :
వైట్‌బాల్ ఫార్మాట్లో భారత్ నిలకడగా తడబడుతోంది. ఎదురుదాడి, దూకుడుగా ఆడటంలో తేలిపోతుంది. కివీస్‌తో తొలి వన్డేలోనూ అదే జరిగింది. తాజాగా సిరీస్ చేజార్చుకునే ప్రమాదంలో ఉండగా రెండో వన్డేలోనైనా టీమ్ ఇండియా దూకుడు అస్త్రాన్ని ప్రయోగించాల్సిన అవసరం ఏర్పడింది. హామిల్టన్ సెడార్ పార్క్ మంచి బ్యాటింగ్ పిచ్. ఇక్కడ 350 స్కోర్లు సులువుగా కొట్టవచ్చు. టాప్ ఆర్డర్లో శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ అర్థ సెంచరీలతో ఫామ్‌లో ఉన్నారు. కానీ ముగ్గురి ఎవరూ ధనాధన్ ఆడలేదు. నేడు సెడాన్పార్క్లో సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడాల్సిన సమయం ఆసన్నమైంది. మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్‌లకు తోడు సంజు శాంసన్ మెరిస్తే.. భారత్ భారీ స్కోరు చేయగలదు.
బౌలింగ్‌లో వైవిధ్యం కోసం తుది జట్టులో మార్పులు ఉండే చాన్స్ ఉంది. దీపక్ హుడాను జట్టులోకి తీసుకునేందుకు.. సూర్య, సంజులలో ఒకరిని బెంచ్‌కు పరిమితం చేసే ఆలోచన ఉంది. దీపక్ చాహర్ కోసం శార్దుల్‌ను బెంచ్‌కు పరిమితం చేయవచ్చు. స్పిన్నర్ చాహల్ ఈ ఏడాది వన్డేల్లో 21 వికెట్లు కూల్చాడు. ఎకానమీ, సగటు సైతం గొప్పగా ఉంది. కానీ తొలి వన్డేలో పది ఓవర్లలో మాయ చేయలేకపోయాడు. వికెట్ల వేటలో స్పిన్నర్ల వైఫల్యం ఫలితంపై ప్రభావం చూపించింది. వాషింగ్టన్ సుందర్, చాహల్ జోడీ వికెట్ల వేటలో మెరవాల్సి ఉంది. ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్‌లకు తోడుగా నేడు దీపక్ చాహర్ పేస్‌తో మ్యాజిక్ చేయనున్నాడు!.
విలియమ్సన్పైనే ఫోకస్
ఐసీసీ వన్డే సూపర్ లీగ్‌లో అతి తక్కువ మ్యాచులు ఆడిన జట్టు న్యూజిలాండ్. 2019 వన్డే వరల్డ్‌కప్ అనంతరం కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఏడు మ్యాచులు మాత్రమే ఆడాడు. కోవిడ్ మహమ్మారి, మోచేతి గాయంతో విలియమ్సన్ ఎక్కువ మ్యాచులు ఆడలేకపోయాడు. ఈ ఏడు ఇన్నింగ్స్‌ల్లో విలియమ్సన్ ఒక్కసారే 50 ప్లస్ ఇన్నింగ్స్ ఆడాడు. భారత్‌పై తొలి వన్డేలో శతకం సాధించే అవకాశం ఉన్నప్పటికీ.. జోరుమీదున్న టామ్ లేథమ్‌కు స్ట్రయిక్ ఇచ్చాడు. సెంచరీకి ఆరు పరుగుల దూరంలో నిలిచాడు. క్రీడాస్ఫూర్తి, జట్టు తత్వంతో విలియమ్సన్ సహచరులకు ఆదర్శంగా నిలిచాడు. అజేయ అర్థ సెంచరీతో ఫామ్‌లోకి వచ్చిన విలియమ్సన్ నేడు శతక ఇన్నింగ్స్ ఆశిస్తున్నాడు. టాప్ ఆర్డర్లో ఫిన్ అలెన్, డెవాన్ కాన్వేలు ఫామ్‌లోకి రావాల్సి ఉంది. డార్లీ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్‌లు భారత్‌పై జోరు చూపించటం లేదు. ఫిట్నెస్ సాధించిన జేమ్స్ నీషమ్ నేరుగా తుది జట్టులోకి రానున్నాడు. బౌలింగ్‌లోనూ న్యూజిలాండ్ మెరుగ్గానే కనిపిస్తోంది. లాకీ ఫెర్గుసన్, మాట్ హెన్రీ, టిమ్ సౌథీలు భారత్‌కు పరీక్ష పెట్టనున్నారు. స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ తొలి వన్డేలో ఆకట్టుకున్నాడు.
ఇక హామిల్టన్‌లో భారత్ రెండు వన్డేలు ఆడింది. 2019 వన్డేలో టీమ్ ఇండియా 92 పరుగులే చేయగా, 2020 వన్డేలో 347 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. స్వల్ప స్కోరు చేసినా, భారీ స్కోరు నమోదు చేసినా.. రెండు పర్యాయాలు పరాజయం తప్పలేదు.
పిచ్, వాతావరణం
2020 నుంచి సెడాన్ పార్క్‌లో మూడు వన్డేలు మాత్రమే జరిగాయి. రెండు మ్యాచుల్లో తొలి ఇన్నింగ్స్‌ల్లో 330 పైచిలుకు స్కోర్లు నమోదయ్యాయి. ఇక్కడ భారత్ చేసిన 347 పరుగుల స్కోరును కివీస్ అలవోకగా ఛేదించింది. నేడు వన్డేలోనూ భారీ స్కోర్లకు ఆస్కారం ఉంది. ఇక రెండో వన్డేకు హామిల్టన్‌లో వర్షం ముప్పు పొంచి ఉంది. మధ్యాహ్నాం, సాయంత్రం వేళల్లో వర్షం సూచనలు ఎక్కువగా ఉన్నాయి.
తుది జట్లు (అంచనా)
న్యూజిలాండ్ : ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్ లేథమ్ (వికెట్ కీపర్), డార్లీ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గుసన్.
భారత్ : శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్, యుజ్వెంద్ర చాహల్.