Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్రిస్టియానో రొనాల్డో జట్టు నాకౌట్‌లో ప్రవేశించనుంది. గ్రూప్-హెచ్‌లో వరుసగా రెండో విజయం నమోదు చేసిన పోర్చుగల్ మరో మ్యాచ్ ఉండగానే ప్రీ క్వార్టర్స్ బెర్త్ కైవసం చేసుకుంది. ఉరుగ్వేతో మ్యాచ్‌లో 2-0తో గెలుపొందిన పోర్చుగల్ ఎటువంటి సమీకరణాలతో సంబంధం లేకుండా దర్జాగా నాకౌట్‌కు చేరుకుంది.
- 2-0తో ఉరుగ్వేపై ఘన విజయం
- నాకౌట్‌లో అడుగేసిన రొనాల్డో జట్టు
- 2022 ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్
నవతెలంగాణ-లుసైల్ (ఖతార్)
అగ్రజట్లు అర్జెంటీనా, జర్మనీ, బెల్జియం తరహాలో ఎటువంటి నాటకీయతకు తావులేకుండా పోర్చుగల్ దర్జాగా నాకౌట్ దశకు చేరుకుంది. గ్రూప్ దశ రెండో మ్యాచ్‌లో ఉరుగ్వేపై 2-0తో మెరుపు విజయం నమోదు చేసిన పోర్చుగల్ ప్రీ క్వార్టర్‌ఫైనల్ బెర్త్ సొంతం చేసుకుంది. గ్రూప్‌లో వరుసగా రెండో విజయంతో ఆరు పాయింట్లు ఖాతాలో వేసుకున్న పోర్చుగల్ గ్రూప్-హెచ్‌లో అగ్రస్థానం కైవసం చేసుకుంది. బ్రూనో ఫెర్నాండేజ్ 54, 92వ నిమిషంలో గోల్స్ కొట్టి పోర్చుగల్‌ను నాకౌట్‌కు చేర్చాడు.
గోల్ ఆఫ్ హెయిర్?! : ఉరుగ్వేపై పోర్చుగల్ 2-0తో గెలుపొందింది. రొనాల్డో అభిమానులు ఆనంద పరవశంలో మునిగి తేలారు. కానీ 54వ నిమిషంలో పోర్చుగల్ సాధించిన తొలి గోల్ ఎవరి ఖాతాలో పడాలనే అంశంలో సందిగ్థత నెలకొంది. 40 గజాల దూరం నుంచి బ్రూనో ఫెర్నాండేజ్ గోల్ పోస్ట్‌పై దాడి చేస్తూ కిక్ ఇచ్చాడు. ఉరుగ్వే గోల్‌పోస్ట్ ముందే కాచుకుని ఉన్న క్రిస్టియానో రొనాల్డో హెడర్ గోల్‌కు ప్రయత్నించాడు. అయితే, బంతి రొనాల్డో తలకు తగలలేదు. కానీ రొనాల్డో జుట్టుకు తగులుతూ గోల్ పోస్ట్‌లోకి పడింది. దీంతో ఈ గోల్‌ను ఎవరి ఖాతాలో వేయాలనే అంశం కాస్త చర్చకు దారితీసింది. అభిమానులు రొనాల్డో గోల్‌ను గోల్ ఆఫ్ హెయిర్‌గా పిలుస్తున్నారు. రిఫరీ మాత్రం గోల్‌ను అధికారికంగా బ్రూనో ఫెర్నాండేజ్ ఖాతాలో వేశాడు. అయితే, గోల్ తనే చేసినట్టు భావించిన క్రిస్టియానో రొనాల్డో మైదానంలో సంబురాలు చేసుకోవటం విశేషం. ప్రథమార్థంలో ఇరు జట్లు గోల్ చేయటంలో విఫలమయ్యాయి. 0-0తో ప్రథమార్థం గోల్ లేకుండా ముగిసింది. ద్వితీయార్థం ఆరంభంలో బ్రూనో ఫెర్నాండేజ్ తొలి గోల్ అందించాడు. 90 నిమిషాల ఆట అనంతరం అదనపు సమయంలో బ్రూనో మళ్లీ మెరిశాడు. 92వ నిమిషంలో ఉరుగ్వే డిఫెండర్ బంతిని చేతితో తాకాడు. దీంతో రిఫరీ వీఏఆర్ సమీక్షతో పోర్చుగల్‌కు పెనాల్టీ ప్రకటించాడు. బ్రూనో ఫెర్నాండేజ్ నేర్పుగా ఉరుగ్వే గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టించాడు. పోర్చుగల్ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. బ్రూనో ఫెర్నాండేజ్ డబుల్ గోల్‌తో పోర్చుగల్ ఘన విజయం సాధించింది.
ఉరుగ్వే అవుట్?! : గ్రూప్-హెచ్ నాకౌట్ సమీకరణం ఆసక్తికరంగా మారింది. ఉరుగ్వే గ్రూప్ దశ నుంచే నిష్క్రమించే ప్రమాదంలో పడింది. గ్రూప్ దశలో చివరి మ్యాచ్‌లో దక్షిణ కొరియాపై పోర్చుగల్ ఓ పాయింట్ సాధించినా (డ్రా) అగ్రస్థానం కైవసం చేసుకుంటుంది. రెండో స్థానంలో నాకౌట్‌కు చేరుకునేందుకు చివరి మ్యాచ్‌లో ఘనాపై ఉరుగ్వే గెలిచి తీరాలి. దీంతో చివరి మ్యాచ్ సమీకరణం ఉరుగ్వేకు ప్రాణ సంకటంగా మారింది. పోర్చుగల్‌తో మ్యాచ్‌లో ఉరుగ్వే సంప్రదాయ పద్దతి అవలంభించింది. 54వ నిమిషంలో గోల్ కోల్పోయిన తర్వాతే దూకుడు పెంచింది. లూయిస్ స్వారెజ్‌ను ఉరుగ్వే మెరుగ్గా వాడుకోలేదు. పోర్చుగల్ ఎటాకర్లు ఏకంగా 15 సార్లు గోల్ కోసం ప్రయత్నించగా, ఉరుగ్వే ఎటాకర్లు 11 సార్లు ప్రయత్నించారు. 60 శాతం బంతిని పోర్చుగల్ నియంత్రణలో నిలుపుకుంది. పాస్ కచ్చితత్వంలోనూ పోర్చుగల్ (83 శాతం) కంటే ఉరుగ్వే (73 శాతం) మెరుగ్గా లేదు. ప్రస్తుతం రెండు మ్యాచుల్లో ఓ డ్రా, ఓ ఓటమితో ఓ పాయింట్ సాధించిన ఉరుగ్వే గ్రూప్-హెచ్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఓ విజయంతో ఘనా రెండో స్థానంలో కొనసాగుతోంది. చివరి మ్యాచ్‌లో ఘనాపై నెగ్గితేనే ఉరుగ్వే నాకౌట్‌కు చేరుకోగలదు, లేదంటే ఘనా రెండో స్థానంతో ప్రీ క్వార్టర్స్ బెర్త్ సొంతం చేసుకోగలదు.