Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూజిలాండ్ పర్యటన అఖరు అంకానికి చేరుకుంది. టీ20 సిరీస్ రెండు మ్యాచుల పోరుగా మారగా, తాజాగా వన్డే సిరీస్‌ను సైతం రెండు మ్యాచుల సమరంగా మారింది. వన్డే సిరీస్ కోల్పోకుండా ఉండేందుకు భారత్ నేడు చివరి వన్డేలో గెలిచి తీరాలి. 1-0 ఆధిక్యంలో ఉన్న కివీస్ నేడు మ్యాచ్‌లో ఓడినా, ఫలితం తేలకపోయినా సిరీస్‌ను కోల్పోయే పరిస్థితి లేదు. దీంతో నేడు ఒత్తిడంతా టీమ్‌ఇండియాపైనే. భారత్,న్యూజిలాండ్ మూడో వన్డే నేడు.
- ధావన్‌సేనకు ఇక చావోరేవో
- భారత్, కివీస్ చివరి వన్డే నేడు
- ఉదయం 7 నుంచి ప్రైమ్‌లో..
నవతెలంగాణ-క్రైస్ట్‌చర్చ్
ఆ ఇద్దరిలో ఎవరు? :
హామిల్టన్ వన్డేలో సంజు శాంసన్ స్థానంలో దీపక్ హుడాను తీసుకోగానే.. సోషల్ మీడియాలో ఆ టాపిక్ వైరల్‌గా మారింది. సంజు శాంసన్‌ను పక్కనపెట్టడంపై అభిమానులు, విశ్లేషకులు మండిపడ్డారు. సెడాన్ పార్క్‌లో ఆరో బౌలర్ కోసం దీపక్ హుడాను ఎంచుకున్నారు. కానీ, హాగ్లే ఓవల్‌లో ఆర్ బౌలర్ అవసరం భారత్‌కు అంతగా ఉండదు. దీంతో సంజు శాంసన్‌ను తిరిగి తీసుకుంటారా? దీపక్ హుడాను కొనసాగిస్తారా? అనేది ఆసక్తికరం. టాప్ ఆర్డర్‌లో బ్యాటర్ల శైలి మరోసారి తెరపైకి రానుంది. ధావన్, గిల్ ఆశించిన వేగంతో పవర్‌ప్లేలో పరుగులు చేయటం లేదు. ఇక కివీస్ పర్యటనలో ఉనికి చాటుకోవటంలో పంత్ విఫలమయ్యాడు. నేడు చివరి వన్డేలోనైనా పంత్ పటాఫట్ ఇన్నింగ్స్ ఆడతాడేమో చూడాలి. ఇక వన్డే ఫార్మాట్‌లో సూర్యకుమార్ యాదవ్ మార్క్ ఇన్నింగ్స్ ఆడలేదు. హామిల్టన్‌లో సూర్య మెరుపు వేగంతో ఆరంభించినా వర్షం అంతరాయం కలిగించింది. నేడు క్రైస్ట్‌చర్చ్‌లో మెగా ఇన్నింగ్స్ కోసం సూర్య ఎదురుచూస్తున్నాడు. ఇక స్పీడ్‌గన్ ఉమ్రాన్ మాలిక్‌కు హాగ్లే ఓవల్ సరైన పిచ్. ఇక్కడ మాలిక్‌ను ఎదుర్కొవటం కివీస్ బ్యాటర్లకు అంత సులువు కాబోదు. దీపక్ చాహర్, అర్షదీప్ సింగ్‌లు మాలిక్‌తో కలిసి పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు కివీస్ పర్యటనలో అవకాశమే చిక్కలేదు. చివరి మ్యాచ్‌లోనైనా కుల్దీప్‌కు చోటు ఇస్తారేమో చూడాలి. స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కొనసాగనున్నాడు.
జోరుమీదున్న కివీస్ :
వన్డే ఫార్మాట్‌లో న్యూజిలాండ్ జోరుమీదుంది. 2023 వన్డే వరల్డ్‌కప్ దిశగా కివీస్ అప్పుడే ప్రణాళిక ఆరంభించింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్, డార్లీ మిచెల్, టామ్ లేథమ్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఫిన్ అలెన్, గ్లెన్ ఫిలిప్స్, మైకల్ బ్రాస్‌వెల్‌లు ఈ ఫార్మాట్‌లో తక్కువ ర్యాంక్ జట్లతో ఆడారు. అగ్రజట్లతో ఆడిన అనుభవం తక్కువ. భారత్‌తో మ్యాచుల్లో ఫిన్ అలెన్ అనుభవ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వన్డేలో ఫిన్ అలెన్ స్వేచ్ఛగా ఆడేందుకు కెప్టెన్ కేన్ చాన్స్ ఇవ్వనున్నాడు. పేసర్ మైకల్ బ్రాస్‌వెల్ సైతం నేడు బరిలోకి దిగనున్నాడు. మాట్ హెన్రీ, లాకీ ఫెర్గుసన్, టిమ్ సౌథీలు దూకుడు మీదున్నారు. మిచెల్ శాంట్నర్ ఏకైక స్పిన్నర్‌గా తుది జట్టులో నిలువనున్నాడు. తొలి వన్డేలో ఫామ్ అందుకున్న కేన్ విలియమ్సన్ నేడు పూర్తి మ్యాచ్ సాధ్యపడితే.. శతక దాహం తీర్చుకునేందుకు ఎదురు చూస్తున్నాడు.
పిచ్, వాతావరణం : క్రైస్ట్‌చర్చ్‌లో బుధవారం వర్షం సూచనలు ఉన్నాయి. హామిల్టన్ మాదిరిగానే, ఇక్కడా కుదించిన ఓవర్ల మ్యాచ్ లేదా మ్యాచ్ పూర్తిగా రద్దుకు అవకాశం ఉంది. విరామం అనంతరం జరుగుతున్న వన్డే మ్యాచ్‌కు హాగ్లే ఓవల్‌లో ఇప్పటికే పూర్తి టికెట్లు అమ్ముడయ్యాయి. క్రైస్ట్‌చర్చ్ పిచ్ స్పీడ్‌స్టర్లకు, బ్యాటర్లకు సమానంగా అనుకూలించనుంది. స్పిన్నర్లకు ఈ పిచ్‌పై కాస్త కష్టమే కానుంది. ఇక్కడ గత చివరి మూడు వన్డేల్లో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్టునే విజయం వరించింది. టాస్ నెగ్గిన జట్టు బౌలింగ్ ఎంచుకోనుంది.
తుది జట్లు (అంచనా) :
న్యూజిలాండ్ : ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డార్లీ మిచెల్, టామ్ లేథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, మైకల్ బ్రాస్‌వెల్/ఆడం మిల్నె, మాట్ హెన్రీ, టిమ్ సౌథీ, లాకీ ఫెర్గుసన్.
భారత్ : శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్/దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్, యుజ్వెంద్ర చాహల్/కుల్దీప్ యాదవ్.