Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్రూప్-బి నుంచి నాకౌట్ బెర్తులు తేలిపోయాయి. టైటిల్ ఫేవరేట్ ఇంగ్లాండ్‌తో పాటు అమెరికా సైతం ప్రీ క్వార్టర్ఫైనల్లో కాలుమోపింది. గ్రూప్ దశ చివరి మ్యాచుల్లో వేల్స్‌పై ఇంగ్లాండ్ గోల్స్ మోత మోగించగా, ఇరాన్‌పై అమెరికా విజయం సాధించింది. మార్కస్ ర్యాష్‌ఫోర్డ్ డబుల్ గోల్‌తో ఇంగ్లాండ్‌ను గెలిపించగా, పులిసిక్ మెరుపు గోల్‌తో అమెరికాకు సాధికారిక విజయాన్ని కట్టబెట్టాడు.
- గ్రూప్-బి నుంచి నాకౌట్లో ప్రవేశం
- ఇరాన్, వేల్స్‌లకు తప్పని నిష్క్రమణ
- 2022 ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్
నవతెలంగాణ-దోహా (ఖతార్)
ఫిఫా ప్రపంచకప్ టైటిల్ ఫేవరేట్‌గా ఖతార్‌కు చేరుకున్న మూడు సింహాలు (ఇంగ్లాండ్) గ్రూప్ దశ రెండో మ్యాచ్‌ను డ్రా చేసుకుని కాస్త జోరు తగ్గింది. కానీ చివరి మ్యాచ్‌లో సహజశైలిలో రెచ్చిపోయి విశ్వరూపం ప్రదర్శించిన ఇంగ్లాండ్ 3-0తో సోదర జట్టు వేల్స్‌పై ఏకపక్ష విజయం సాధించింది. మార్కస్ ర్యాష్‌ఫోర్డ్ రెండు గోల్స్‌తో అదరగొట్టగా..ఫిల్ ఫోడెన్ ఓ గోల్‌తో మెరిశాడు. వేల్స్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఇంగ్లాండ్ ఎదురులేని విజయంతో నాకౌట్‌కు చేరుకుంది. మార్కస్ ర్యాష్‌ఫోర్డ్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. ప్రీ క్వార్టర్ఫైనల్లో సెనెగల్‌తో ఇంగ్లాండ్ తలపడనుంది.
ఇంగ్లాండ్ ఆధిపత్యం : వేల్స్‌పై ఇంగ్లాండ్ పంజా విసిరింది. అన్ని విధాలుగా వేల్స్‌పై ఆధిపత్యం ప్రదర్శించింది. వేల్స్ గోల్‌పోస్ట్‌పై విరామం లేకుండా భీకర దాడులు చేసింది. ఏకంగా 18 సార్లు గోల్ కోసం ఇంగ్లాండ్ ప్రయత్నించింది. నాలుగు సార్లు వేల్స్ గోల్ కీపర్ గోల్‌ను నిలువరించాడు. మూడు సార్లు ఇంగ్లాండ్ విజయవంతంగా వేల్స్ డిఫెన్స్ ఛేదించి గోల్స్ కొట్టింది. ఇంగ్లాండ్ దూకుడుగా ఆడినా ప్రథమార్థంలో గోల్ నమోదు కాలేదు. 0-0తో తొలి అర్థ భాగం ముగిసింది. ద్వితీయార్థం ఆరంభంలోనే ఇంగ్లాండ్ గోల్ ఖాతా తెరిచింది. ఫ్రీ కిక్ అవకాశాన్ని గొప్పగా సద్వినియోగం చేసుకున్న మార్కస్ ర్యాష్‌ఫోర్డ్ వేల్స్ డిఫెన్స్ గోడను దాటుకుంటూ అద్భుత గోల్ కొట్టాడు. ఫిల్ ఫోడెన్ నిమిషాల వ్యవధిలోనే మరో గోల్‌తో ఇంగ్లాండ్ ఆధిక్యం 2-0కు పెంచాడు. పెనాల్టీ ఏరియా నుంచి హ్యారీకేన్ అందించిన పాస్‌ను నేర్పుగా గోల్‌పోస్ట్‌కు పంపించిన ఫిల్ ఫోడెన్ 51వ నిమిషంలో గోల్ నమోదు చేశాడు. ఇక జోరుమీదున్న మార్కస్ ర్యాష్‌ఫోర్డ్.. 68వ నిమిషంలో మళ్లీ మెరిశాడు. ఫిలిప్స్ అందించిన పాస్‌తో మరో మెరుపు గోల్ కొట్టాడు. దీంతో ఇంగ్లాండ్ ఆధిక్యం 3-0తో మరింత పెరిగింది. గ్రూప్ దశ దాటేందుకు గంపెడాశలతో ఖతార్‌కు చేరుకున్న వేల్స్‌కు సోదర జట్టు విజృంభణతో నైరాశ్యం తప్పలేదు. 2022 ఫిఫా ప్రపంచకప్‌ను వేల్స్ గ్రూప్ దశలోనే ముగించింది.