Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎడతెగని వర్షంతో తొలి టీ20 టాస్ పడకుండానే రద్దు అవటంతో మొదలైన భారత జట్టు న్యూజిలాండ్ పర్యటన.. వర్షం అంతరాయంతో ఫలితం తేలకుండా ముగిసిన మూడో వన్డేతో ముగిసింది. చివరి రెండు వన్డేలు వర్షం కారణంగా రద్దు కావటంతో.. తొలి వన్డేలో గెలుపొందిన న్యూజిలాండ్ 1-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
- ఫలితం తేలని మూడో వన్డే
- 1-0తో సిరీస్ కివీస్ వశం
నవతెలంగాణ-క్రైస్ట్‌చర్చ్
వరుణుడు నిలకడగా మైదానంలో తిష్ట వేసిన వైట్‌బాల్ ఫార్మాట్ సమరంలో.. పొట్టి సిరీస్ టీమ్ ఇండియా సొంతం కాగా, వన్డే సిరీస్ న్యూజిలాండ్ వశ పర్చుకుంది. వర్షం కారణంగా రెండు, మూడో వన్డేలు ఫలితం తేలకుండా ముగిశాయి. దీంతో తొలి వన్డేలో విజయం సాధించిన న్యూజిలాండ్ 1-0తో వన్డే సిరీస్ ట్రోఫీని కైవసం చేసుకుంది. క్రైస్ట్‌చర్చ్ వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 219 పరుగులకు కుప్పకూలింది. వాషింగ్టన్ సుందర్ (51, 64 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ అయ్యర్ (49, 59 బంతుల్లో 8 ఫోర్లు) భారత్‌ను ఆదుకున్నారు. ఛేదనలో న్యూజిలాండ్ 18 ఓవర్లలో 104/1 వద్ద ఉండగా వర్షం ఆటంకం కలిగించింది. మ్యాచ్‌ను ముందుకు సాగనివ్వలేదు. తొలి వన్డేలో అజేయ శతకం బాదిన కివీస్ బ్యాటర్ టామ్ లేథమ్ 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డు అందుకున్నాడు.
బ్యాటర్లు విఫలం : హాగ్లే ఓవల్‌లో సైతం భారత బ్యాటర్ల వైఫల్యం కొనసాగింది. కెప్టెన్ ధావన్ (28), ఓపెనర్ గిల్ (13) సహా రిషబ్ పంత్ (10), సూర్యకుమార్ యాదవ్ (6), దీపక్ హుడా (12) విఫలమయ్యారు. టాప్ ఆర్డర్‌లో శ్రేయస్ అయ్యర్ (49), లోయర్ ఆర్డర్‌లో వాషింగ్టన్ సుందర్ (51) విలువైన ఇన్నింగ్స్‌లతో ఆదుకున్నారు. ఈ ఇద్దరు రాణించటంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 47.3 ఓవర్లలో 219 పరుగులు చేసింది. కివీస్ పేసర్లు మిల్నె (3/57), మిచెల్ (3/25), సౌథీ (2/36) నిప్పులు చెరిగారు.
అలెన్ మెరిసె : ఛేదనలో ఫిన్ అలెన్ (57, 54 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) అదరగొట్టాడు. తొలి వన్డేలో విఫలమైన అలెన్ క్రైస్ట్‌చర్చ్‌లో ఖతర్నాక్ అర్థ సెంచరీ నమోదు చేశాడు. డెవాన్ కాన్వే (38 నాటౌట్)తో కలిసి తొలి వికెట్‌కు 97 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశాడు. ఓపెనర్లు కదం తొక్కగా కివీస్ లక్ష్యం దిశగా వేగంగా సాగింది. కానీ 18 ఓవర్ల ఆట అనంతరం వర్షం అంతరాయం కలిగించింది. మ్యాచ్ మళ్లీ సాధ్యపడలేదు.
డక్‌వర్త్ ఎందుకు లేదంటే? : సహజంగా రెండో ఇన్నింగ్స్ మొదలైన మ్యాచుల్లో వర్షం ఆటంకం కలిగిస్తే ఫలితాన్ని డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో తేల్చుతారు. మూడో వన్డేలో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం సైతం ఫలితం తేలలేదు. ఈ నిబంధన ప్రకారం విజేతను నిర్ణయించేందుకు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్టు కనీసం 20 ఓవర్లు ఆడాలి. కివీస్ 18 ఓవర్ల ఆట మాత్రమే ఆడింది. డక్‌వర్త్ ప్రకారం కివీస్ 50 పరుగుల ముందంజలో నిలిచింది. కానీ 18 ఓవర్ల ఆట మాత్రమే సాగటంతో మూడో వన్డే ఫలితం తేలకుండా ముగిసింది.
స్కోరు వివరాలు :
భారత్ ఇన్నింగ్స్ : ధావన్ (బి) మిల్నె 28, గిల్ (సి) శాంట్నర్ (బి) మిల్నె 13, శ్రేయస్ (సి) కాన్వే (బి) ఫెర్గుసన్ 49, పంత్ (సి) ఫిలిప్స్ (బి) మిచెల్ 10, సూర్య (సి) సౌథీ (బి) మిల్నె 6, హుడా (సి) లేథమ్ (బి) సౌథీ 12, సుందర్ (సి) లేథమ్ (బి) సౌథీ 51, చాహర్ (సి) సౌథీ (బి) మిచెల్ 12, చాహల్ (సి) సౌథీ (బి) శాంట్నర్ 8, అర్షదీప్ (ఎల్బీ) మిచెల్ 9, ఉమ్రాన్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 21, మొత్తం : (47.3 ఓవర్లలో ఆలౌట్) 219.
వికెట్ల పతనం : 1-39, 2-55,3-85, 4-110, 5-121, 6-149, 7-170, 8-201, 9-213, 10-219.
బౌలింగ్ : సౌథీ 8.3-1-36-2, హెన్రీ 10-2-20-0, మిల్నె 10-0-57-3, ఫెర్గుసన్ 10-0-49-1, మిచెల్ 7-0-25-3, శాంట్నర్ 2-0-15-1.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : అలెన్ (సి) సూర్య (బి) ఉమ్రాన్ 57, కాన్వే నాటౌట్ 38, విలియమ్సన్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 9, మొత్తం : (18 ఓవర్లలో 1 వికెట్) 104.
వికెట్ల పతనం : 1-97.
బౌలింగ్ : దీపక్ చాహర్ 5-0-30-0, అర్షదీప్ 5-1-21-0, ఉమ్రాన్ 5-0-31-1, సుందర్ 3-0-16-0.