Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆరంభ మ్యాచ్‌లోనే అనూహ్య షాక్‌తో ప్రపంచకప్ రేసును మొదలుపెట్టిన అర్జెంటీనా.. గ్రూప్ దశను అద్భుతంగా ముగించింది. సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ ముందుండి నడిపించగా అర్జెంటీనా ప్రీ క్వార్టర్‌ఫైనల్లో కాలుమోపింది. పోలాండ్‌పై 2-0తో గెలుపొందిన అర్జెంటీనా గ్రూప్-సిలో అగ్రస్థానంతో నాకౌట్‌కు చేరుకుంది. మెస్సీ జట్టు చేతిలో ఓడినా.. మెరుగైన గోల్ వ్యత్యాసంతో పోలాండ్ సైతం ప్రీ క్వార్టర్‌ఫైనల్లోకి చేరుకుంది. సౌదీ అరేబియా, మెక్సికో గ్రూప్ దశ నుంచే నిష్క్రమించాయి.
- 2022 ఫిఫా ప్రపంచకప్
- ప్రీ క్వార్టర్స్‌లో మెస్సీసేన అడుగు
- 2-0తో పోలాండ్‌పై ఘన విజయం
- గోల్ వ్యత్యాసంతో పోలాండ్ ముందంజ
నవతెలంగాణ-దోహా (ఖతార్)
నాకౌట్‌కు చేరుకునే దశలో కీలక మ్యాచ్‌లో అర్జెంటీనా అదరగొట్టింది. స్టార్ స్ట్రయికర్ లియోనల్ మెస్సీ మరోసారి అర్జెంటీనా విజయానికి తారకమంత్రంగా నిలిచాడు. గ్రూప్-సిలో పొలాండ్‌తో మ్యాచ్‌లో అర్జెంటీనా 2-0తో ఘన విజయం సాధించింది. అలెక్సిస్ మాక్ అలిస్టర్, జులియన్ అల్వారాజ్‌లు అర్జెంటీనాకు గోల్స్ కొట్టారు. బలమైన అర్జెంటీనాతో సమరంలో తేలిపోయిన పోలెండ్.. భారీ తేడాతో పరాజయం పాలవకుండా గొప్ప నియంత్రణ చూపించింది. అర్జెంటీనాతో చేతిలో ఓడినా.. మెరుగైన గోల్ వ్యత్యాసంతో పోలాండ్ గ్రూప్ దశను దాటింది. పొలాండ్‌తో సమానంగా నాలుగు పాయింట్లు సాధించిన మెక్సికో.. గోల్ వ్యత్యాసం ప్రకారం నాకౌట్ దశకు అర్హత సాధించలేదు. ఇక ప్రీ క్వార్టర్‌ఫైనల్లో ఆస్ట్రేలియాతో అర్జెంటీనాతో అమీతుమీ తేల్చుకోనుండా, ఫ్రాన్స్‌తో పొలాండ్ పోటీపడనుంది.
అర్జెంటీనా అదరహో..! : తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో భంగపడిన అర్జెంటీనా.. ఆ తర్వాత రెండు మ్యాచుల్లో సత్తా చాటింది. టైటిల్ ఫేవరేట్ స్థాయి ఏంటో ఆటతీరుతోనే చూపించింది. లియోనల్ మెస్సీ ఈ రెండు విజయాల్లో తారకమంత్రంగా పని చేశాడు. అర్జెంటీనా ఆరంభం నుంచీ గోల్ కోసం దూకుడుగా ఆడింది. ఏకంగా 23 సార్లు పోలాండ్ గోల్‌పోస్ట్‌పై దాడి చేసింది. లియోనల్ మెస్సీ గోల్ ప్రయత్నాలను పోలాండ్ గోల్ కీపర్ గొప్పగా నిలువరించాడు. తొలి అర్థ భాగంతో పాటు రెండో అర్థ భాగం ఆటలోనూ మెస్సీ గోల్ కిక్‌లను గోల్ కీపర్ అడ్డుకున్నాడు. అర్జెంటీనా దూకుడుగా ఆడినా ప్రథమార్థంలో గోల్ నమోదు కాలేదు. 0-0తో గోల్ లేకుండా ముగిసింది. ద్వితీయార్థం ఆరంభ క్షణాల్లోనే అర్జెంటీనా గోల్ ఖాతా తెరిచింది. డిఫెండర్ మోలినా నుంచి 46వ నిమిషంలో పాస్ అందుకున్న అలెక్సిస్ మాక్ అలిస్టర్ అద్భుత గోల్ కొట్టాడు. దీంతో అర్జెంటీనా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 67వ నిమిషంలో అర్జెంటీనా మరో గోల్ కొట్టింది. ఎంజో ఫెర్నాండేజ్ నుంచి పాస్ అందుకున్న జులియన్ అల్వారాజ్ అర్జెంటీనాను 2-0తో ఎదురులేని స్థానంలో నిలిపాడు. ఆట ఆఖరు క్షణాల్లో సైతం అర్జెంటీనా గోల్ ప్రయత్నాలు ఆపలేదు. మరో గోల్ కోల్పోతే నాకౌట్ బెర్త్ చేజారే పరిస్థితుల్లో.. పోలాండ్ డిఫెన్స్ గొప్ప తెగువ చూపించింది. అర్జెంటీనా ఎటాకర్లు పొలాండ్ డిఫెన్స్‌ను ఛేదించినా మరిన్ని గోల్స్ నమోదు కాకుండా జాగ్రత్త వహించింది.
ఇక సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలచలేకపోయాడు. తొలి అర్థభాగం ఆట 39వ నిమిషంలో పొలాండ్ గోల్‌పోస్ట్ ముందున్న మెస్సీని గోల్ కీపర్ చేతితో తాకాడు. దీంతో వీఏఆర్ సమీక్షతో రిఫరీ అర్జెంటీనాకు పెనాల్టీ కిక్ ప్రకటించాడు. మెక్సికోపై రైట్ కిక్‌తో పెనాల్టీతో గోల్ కొట్టిన మెస్సీ.. పొలాండ్‌పై లెఫ్ట్ కిక్‌తో గోల్ అవకాశం చేజార్చుకున్నాడు. 74 శాతం బంతిని నియంత్రణలో ఉంచుకున్న అర్జెంటీనా..92 శాతం పాస్ కచ్చితత్వంతో చెలరేగింది. పొలాండ్ ఎటువంటి గోల్ ప్రయత్నాలు చేయలేదనే చెప్పాలి. 99 శాతం డిఫెన్స్‌కే పరిమితమైన పొలాండ్.. నాలుగు సార్లు గోల్ కోసం ప్రయత్నించింది. కానీ వాటిలో ఒక్క కిక్ కూడా టార్గెట్ దిశగా దూసుకెళ్లలేదు.