Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రావ్లీ, డకెట్, పోప్, బ్రూక్ సెంచరీలు
- ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 506/4
రావల్పిండి (పాకిస్థాన్) : పాకిస్థాన్‌పై ఇంగ్లాండ్ 'బాజ్‌బాల్' బాంబ్ పేలింది. టెస్టు క్రికెట్‌లో ధనాధన్ మోత మోగించిన ఇంగ్లాండ్ బ్యాటర్లు పాకిస్థాన్‌తో తొలి టెస్టు తొలి రోజు పరుగుల వరద పారించారు. దీంతో ఇంగ్లాండ్ తొలి రోజు 75 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 506 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్లు జాక్ క్రావ్లీ (122), బెన్ డకెట్ (107) మెరుపు సెంచరీలతో తొలి వికెట్‌కు 233 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. ఒలీ పోప్ (108), హ్యారీ బ్రూక్ (101 బ్యాటింగ్) సైతం శతక మోత మోగించారు. అవుటైన బ్యాటర్లలో జో రూట్ (23) ఒక్కడే స్వల్ప స్కోరు సాధించాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ (34 నాటౌట్, 15 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి బ్రూక్ అజేయంగా క్రీజులో ఉన్నాడు. అనారోగ్యంతో తుది జట్టును నిలుపలేని స్థితిలో ఉన్న ఇంగ్లాండ్.. రావల్పిండిలో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకుని టెస్టు క్రికెట్‌లో 112 ఏండ్ల రికార్డును బద్దలు కొట్టింది. 1910 ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా టెస్టులో తొలి రోజు నమోదైన 494 పరుగులే ఇప్పటివరకు అత్యధిక స్కోరుగా ఉండేది. ఇంగ్లాండ్ ఆ రికార్డును తిరగరాసింది.
ఇదిలా ఉండగా, టెస్టు క్రికెట్‌లో ధనాధన్ షో టీమ్ ఇండియా 2006లోనే ప్రదర్శించిందని సోషల్ మీడియాలో అభిమానులు ట్వీట్లు పెడుతున్నారు. 2006 అలియంజ్ కప్ పాకిస్థాన్‌తో తొలి టెస్టు తొలి రోజు భారత ఓపెనర్లు వీరెందర్ సెహ్వాగ్ (248 నాటౌట్), రాహుల్ ద్రవిడ్ (128 నాటౌట్) అజేయంగా తొలి వికెట్‌కు 404 పరుగులు జోడించారు. తాజాగా ఇంగ్లాండ్ బ్యాటర్ల మెరుపులతో 2006 నాటి ద్రవిడ్, సెహ్వాగ్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.