Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం భారీ పతనం. ఓ వైపు జపాన్ వరుసగా రెండోసారి నాకౌట్ దశకు అర్హత సాధించి కొత్త ఉత్సాహం సంతరించుకోగా.. నాలుగు సార్లు చాంపియన్ జర్మనీ వరుసగా రెండోసారి గ్రూప్ దశ నుంచే ఇంటి బాట పట్టింది. చివరగా 2014 ఫిఫా ప్రపంచకప్ నెగ్గిన జర్మనీ.. ఆ తర్వాత 2018, 2022 ప్రపంచకప్‌ల్లో గ్రూప్ దశ దాటలేదు. 2014 వరకు వరుసగా 16 ప్రపంచకప్‌ల్లో నాకౌట్‌కు చేరుకున్న జర్మనీ.. ఆ తర్వాత అనూహ్య పతనం దిశగా పయనిస్తోంది. కోస్టారియాపై 4-2తో భారీ విజయం సాధించినా గ్రూప్-హెచ్‌లో మూడో స్థానానికి పరిమితమై, ప్రపంచకప్ నుంచి వైదొలిగింది.
- కోస్టారియాపై 4-2తో ఊరట విజయం
- నాకౌట్‌కు అర్హత సాధించని మాజీ చాంప్
నవతెలంగాణ-దోహా (ఖతార్)
జర్మనీ నిష్క్రమించింది. జర్మనీ వరుసగా రెండో ఫిఫా ప్రపంచకప్‌లో గ్రూప్ దశను దాటలేకపోయింది. చివరి మ్యాచ్‌లో కోస్టారియాపై 4-2తో ఘన విజయం సాధించినా.. గ్రూప్-ఈ నుంచి నాకౌట్ బెర్త్ దక్కించుకునేందుకు ఆ ప్రదర్శన సరిపోలేదు. కోస్టారికాపై గెలుపుతో పాటు జపాన్‌పై స్పెయిన్ విజయం సాధిస్తేనే జర్మనీ నాకౌట్‌కు చేరుకునే పరిస్థితి నెలకొంది. జపాన్, స్పెయిన్ మ్యాచ్‌లో ప్రథమార్థంలో స్పెయిన్ 1-0 ఆధిక్యంలో నిలువగా.. ఆ సమయంలో జర్మనీ నాకౌట్ అవకాశాలు సజీవంగా కనిపించాయి. కానీ జపాన్ మెరుపు విజయంతో.. జర్మనీ 4-2తో నెగ్గినా ఇంటి బాట పట్టక తప్పలేదు. కోస్టారికా నుంచి తజేడ, నేయుర్ (సెల్ఫ్ గోల్) గోల్స్ కొట్టారు. సెర్జ్ గాబ్రి, కారు హవెర్ట్జ్, నిక్లాస్ ఫుల్‌కృగ్‌లు గోల్స్ నమోదు చేశారు. స్పెయిన్, జర్మనీ నాలుగు పాయింట్లతో సమవుజ్జీలుగా నిలిచినా.. మెరుగైన గోల్ వ్యత్యాసంతో స్పెయిన్ ముందంజ వేసింది.
ఊరట విజయం : గ్రూప్-ఈ చివరి మ్యాచ్‌లో కోస్టారికాపై జర్మనీ గోల్స్ వర్షం కురిపించింది. ఆ జట్టుపై అన్ని విధాలుగా ఆధిపత్యం చెలాయించింది. ఆటలో 69 శాతం బంతిని నియంత్రణలో ఉంచుకున్న జర్మనీ.. 89 శాతం కచ్చితమైన పాస్‌లతో మెరిసింది. జర్మనీ ఎటాకర్లు కోస్టారికాపై భీకర దాడి చేశారు. ఏకంగా 32 సార్లు కోస్టారికా గోల్‌పోస్ట్‌పై ఎదురుదాడి చేశారు. అందులో 11 కిక్‌లు టార్గెట్ దిశగా దూసుకెళ్లాయి. ఆట పదో నిమిషంలోనే జర్మనీ గోల్ చేసి ముందంజ వేసింది. సెర్జ్ గాబ్రి గోల్ కొట్టినా సెలబ్రేట్ చేసుకోలేదు. తొలి అర్థ భాగం ఆట ముగిసే సమయానికి జర్మనీ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్థం ఆరంభంలోనే కోస్టారియా ఆటగాడు యల్‌స్టిన్ తజేడా జర్మనీకి షాక్ ఇచ్చాడు. 58వ నిమిషంలో గోల్ ప్రయత్నాన్ని నిలువరించిన జర్మనీ గోల్ కీపర్ బంతిని చేతుల్లో నిలుపుకోలేకపోయాడు. వేగంగా దూసుకొచ్చిన తజేడా ఆ బంతిని నేరు గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. దీంతో స్కోర్లు 1-1తో సమం అయ్యాయి. ఇక 70వ నిమిషంలో జర్మనీ సెల్ఫ్ గోల్‌తో ఆధిక్యం కోస్టారికాకు కోల్పోయింది. మాన్యూల్ నెయుర్ పొరపాటున బంతిని సొంత గోల్‌పోస్ట్‌లోకి కొట్టాడు. ఈ గోల్‌తో కోస్టారికా 2-1తో ముందంజలో నిలిచింది. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన కారు హవెర్ట్జ్ 73వ నిమిషంలో స్కోరు సమం చేశాడు. ఇన్‌సైడ్ బాక్స్‌లో ఎదురుచూసిన హవెర్ట్జ్ బంతిని నేర్పుగా గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. 85వ నిమిషంలో కారు హవెర్ట్జ్ మరో గోల్ కొట్టాడు. 89వ నిమిషంలో నిక్లాస్ మెరుపు గోల్‌తో జర్మనీ ఆధిక్యాన్ని 4-2కు పెంచాడు.
కోస్టారికాపై తిరుగులేని విజయం సాధించిన జర్మనీ.. మరో మ్యాచ్‌లో స్పెయిన్‌పై జపాన్ విజయంతో నాకౌట్ బెర్త్‌కు దూరమైంది. గ్రూప్ దశ తొలి మ్యాచ్‌లో జపాన్ చేతిలో అనూహ్య పరాజయం చవిచూసిన జర్మనీ.. ఆ ఓటమికి భారీ మూల్యం చెల్లించుకుంది. వరుసగా రెండు ప్రపంచకప్‌ల్లో గ్రూప్ దశ దాటకపోవటంతో స్వదేశంలో అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. 2024 యూరో కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న జర్మనీ ఆ లోగా సమస్యలను చక్కదిద్దుకునే వీలుంది.
ఇక నాకౌట్ సమరం
2022 ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ గ్రూప్ దశ పోటీలు శుక్రవారంతో ముగియనున్నాయి. భారత కాలమానం ప్రకారం అర్థరాత్రి అనంతరం సెర్బియా, స్విట్జర్లాండ్..కామెరూన్, బ్రెజిల్ మ్యాచులతో గ్రూప్ దశ మ్యాచ్‌లకు తెరపడనుంది. నేటి నుంచి నాకౌట్ పోరుకు తెరలేవనుంది. తొలి ప్రీ క్వార్టర్‌ఫైనల్లో నెదర్లాండ్స్‌తో యుఎస్‌ఏ తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 8.30 గంటలకు ఆరంభం కానుంది. రెండో ప్రీ క్వార్టర్‌ఫైనల్లో అగ్రజట్టు అర్జెంటీనాతో ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ నేడు రాత్రి 12.30 గంటలకు ఆరంభం అవనుంది.