Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా?' అన్నట్టు మ్యాచ్‌లో ఆధిపత్యం చూపించామన్నది కాదు గోల్ చేశామా లేదా?.. అని జపాన్ జయకేతనం ఎగురువేసింది. స్పెయిన్‌తో మ్యాచ్‌లో 17 శాతమే బంతిని నియంత్రణలో ఉంచుకున్న జపాన్, కేవలం 228 పాస్‌లే ఇవ్వగలిగింది. అయినా, 83 శాతం బంతి నియంత్రణ, 91 శాతం కచ్చితత్వంతో 1058 పాస్‌లు ఇచ్చిన స్పెయిన్‌పై సింహగర్జన చేసింది. 2-1తో మెరుపు విజయం సాధించి, గ్రూప్-ఈ అగ్రస్థానంతో ప్రీ క్వార్టర్స్‌ఫైనల్స్ బెర్త్ సొంతం చేసుకుంది. జపాన్ చేతిలో ఓడినా స్పెయిన్ సైతం నాకౌట్‌కు అర్హత సాధించింది.
- స్పెయిన్‌పై 2-1తో మెరుపు విజయం
- గ్రూప్-ఈ అగ్రస్థానంతో నాకౌట్ బెర్త్
నవతెలంగాణ-దోహా (ఖతార్)
సాకర్‌లో ఆసియా సింహానాదం జపాన్ చరిత్ర సృష్టించింది. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి వరుస టోర్నీల్లో నాకౌట్ దశకు అర్హత సాధించింది. 2002 ఫిఫా ప్రపంచకప్‌లో గ్రూప్ దశను అగ్రస్థానంతో ముగించిన జపాన్ తాజాగా ఖతార్‌లోనూ గ్రూప్-ఈ విజేతగా నిలిచింది. గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లో స్పెయిన్‌పై 2-1తో జపాన్ ఘన విజయం సాధించింది. ఓ ప్రపంచకప్‌లో ప్రథమార్థంలో వెనుకంజలో నిలిచినా ద్వితీయార్థంలో పుంజుకుని రెండు మ్యాచుల్లో విజయాలు సాధించిన జట్టుగా జపాన్ నిలిచింది. 1938లో బ్రెజిల్, 1970లో జర్మనీ మాత్రమే ఈ ఘనత సాధించాయి. స్పెయిన్‌కు అల్వరా మొరాట ఏకైక గోల్ అందించాడు. జపాన్ తరఫున రిట్సు డోన్, అవో టనాకలు గెలుపు గోల్స్ నమోదు చేశారు. ఇక నాకౌట్ దశలో క్వార్టర్స్ బెర్త్ కోసం 2018 వరల్డ్‌కప్ రన్నరప్ క్రోయేషియాతో జపాన్ తలపడనుండగా, మొరాకాతో స్పెయిన్ తాడోపేడో తేల్చుకోనుంది.
ఆరంభం స్పెయిన్‌దే : జపాన్‌తో మ్యాచ్‌ను స్పెయిన్ ఫేవరేట్‌గా ఆరంభించింది. అంచనాలకు తగినట్టుగానే జపాన్‌పై ఆధిపత్యం చూపించింది. 83 శాతం బంతిని నియంత్రణలో నిలుపుకున్న స్పెయిన్ ఆటగాళ్లు.. జపాన్ ఆటగాళ్లకు బంతిని దక్కనివ్వలేదు. పాస్‌లు అందించటంలో జపాన్ వెనుకంజలో నిలిచింది. 67 శాతం కచ్చితత్వంతో 228 పాస్‌లే చేసుకుంది. ఇదే సమయంలో స్పెయిన్ 91 శాతం కచ్చితత్వంతో 1058 పాస్‌లు చేసింది. మ్యాచ్ ఆరంభం నుంచే ఎదురుదాడి చేసిన స్పెయిన్ అసాంతం జపాన్ గోల్‌పోస్ట్ వద్దే కాచుకుంది. 11వ నిమిషంలో అల్వరో మొరాట మెరుపు గోల్‌తో స్పెయిన్‌ను ఆధిక్యంలో నిలిపాడు. తొలి అర్థ భాగం ఆట ముగిసే సమయానికి జపాన్ నుంచి ఎటువంటి గోల్ ప్రయత్నాలు లేవు. 1-0తో ప్రథమార్థంలో స్పెయిన్ ఆధిపత్యం చూపించింది.
జపాన్ గర్జన : రెండో అర్థభాగం ఆట ఆరంభంలోనే జపాన్ మెరుపు గోల్స్‌తో స్పెయిన్‌కు షాక్ ఇచ్చింది. అందివచ్చిన అవకాశాలనే చక్కగా సద్వినియోగం చేసుకున్న జపాన్ నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ కొట్టింది. 48వ నిమిషంలో రిట్సు డోన్ గోల్ కొట్టాడు. ఇక 51వ నిమిషంలో విఫల గోల్ ప్రయత్నాన్ని వాడుకుని అవో టనాక ఊహించని గోల్‌తో మెరిశాడు. దీంతో జపాన్ 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. స్కోరు సమం చేసేందుకు స్పెయిన్ చేయని ప్రయత్నం లేదు. మ్యాచ్ చివర్లో కాస్త నాటకీయత ఏర్పడినా.. జపాన్ పట్టు విడువలేదు. దీంతో 1982 తర్వాత స్పెయిన్ తొలిసారి ఫిఫా ప్రపంచకప్ గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లో పరాజయం పాలైంది.