Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 0-1తో కామెరూన్ చేతిలో ఓటమి
- గ్రూప్‌లో అగ్రస్థానంతోనే నాకౌట్‌కు సాంబా
- ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ 2022
వెళ్తూ వెళ్తూ కామెరూన్ సంచలనమే సృష్టించింది. ఫిఫా ప్రపంచకప్ అగ్రజట్టు, ఐదుసార్లు చాంపియన్ బ్రెజిల్‌కు దిమ్మతిరిగే షాక్. గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లో పసికూన కామెరూన్ చేతిలో బ్రెజిల్ 0-1తో అనూహ్య పరాజయం చవిచూసింది. విన్సెంట్ అబూబాకర్ గోల్‌తో ప్రపంచకప్‌లో బ్రెజిల్‌పై గెలుపొందిన తొలి ఆఫ్రికా జట్టుగా కామెరూన్ చరిత్ర సృష్టించింది.
నవతెలంగాణ-దోహా (ఖతార్)
2022 ఫిఫా ప్రపంచకప్‌లో సంచలనాల మోత మోగుతోంది. ఆరంభం నుంచీ అనూహ్య ఫలితాలతో రసవత్తరంగా సాగుతున్న సాకర్ సమరం.. గ్రూప్ దశ సైతం ఊహించని ట్విస్ట్‌తో ముగిసింది. గ్రూప్-జి చివరి మ్యాచ్‌లో కామెరూన్‌పై బ్రెజిల్ పూర్తి స్థాయి ఆధిపత్యం ప్రదర్శించింది. కానీ చివరి క్షణాల్లో గోల్ నమోదు చేసిన కామెరూన్ 1-0తో సంచలన విజయం సాధించింది. ఫిఫా ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఏ ఆఫ్రికా జట్టు బ్రెజిల్‌ను ఓడించలేదు. ఆఫ్రికా జట్లతో చివరి ఏడు మ్యాచుల్లో బ్రెజిల్ ఏకంగా 20 గోల్స్ కొట్టింది. బ్రెజిల్‌పై ప్రపంచకప్‌లో గోల్ కొట్టిన మూడో ఆఫ్రికా ఆటగాడిగా విన్సెంట్ అబూబాకర్ రికార్డు నెలకొల్పాడు. బ్రెజిల్‌పై సంచలన విజయం సాధించినా.. కామెరూన్ ప్రస్థానం గ్రూప్-జిలోనే ముగిసింది. గ్రూప్-జిలో బ్రెజిల్ అగ్రస్థానం సాధించగా, స్విట్జర్లాండ్ మరో నాకౌట్ బెర్త్‌ను సొంతం చేసుకుంది.
ఖతర్నాక్ కామెరూన్ : కామెరూన్ గోల్‌పోస్ట్‌పై 21 సార్లు దాడి. లక్ష్యం దిశగా ఏడు కిక్‌లు. బంతిపై 65 శాతం నియంత్రణ. 87 శాతంతో కచ్చితమైన పాస్‌లు. బ్రెజిల్ ఆధిపత్యాన్ని చాటేందుకు గణాంకాల్లో ఇన్ని కొలమానాలు. కానీ ఒకే ఒక్క గోల్‌తో కామెరూన్ ఖతార్నక్ షో చేసింది. 90 నిమిషాల పూర్తి ఆట అనంతరం ఇంజూరీ టైమ్‌లో కామెరూన్ చారిత్రక గోల్ నమోదు చేసింది. 92వ నిమిషంలో విన్సెంట్ అబూబాకర్ హెడర్ గోల్‌తో బ్రెజిల్‌ను షాక్‌కు గురి చేశాడు. బ్రెజిల్ సహజంగానే దూకుడుగా ఆడినా తొలి అర్థ భాగంలో గోల్ కొట్టలేదు. ద్వితీయార్థంలోనూ బ్రెజిల్ చేసిన ప్రయత్నాలను కామెరూన్ గోల్‌కీపర్ డెవిస్ గొప్పగా నిలువరించాడు. రికార్డు స్థాయిలో 16వ సారి ప్రపంచకప్ గ్రూప్ దశను అగ్రస్థానంతో ముగించింది బ్రెజిల్. 1982 నుంచి తొలి రౌండ్ గ్రూప్‌లో బ్రెజిల్ అగ్రస్థానం సాధించటం విశేషం. ప్రీ క్వార్టర్‌ఫైనల్లో దక్షిణ కొరియాతో బ్రెజిల్ తలపడనుంది.