Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కెరీర్ 1000వ మ్యాచ్. అర్జెంటీనా నాయకుడిగా 100వ సమరం. సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ తనదైన మ్యాజిక్ చూపించాడు. మైలురాయి మ్యాచ్‌లో మరుపురాని గోల్‌తో అర్జెంటీనా ప్రపంచకప్ ఆశలను సజీవంగా నిలిపాడు. ఫిఫా వరల్డ్‌కప్ నాకౌట్ దశలో కెరీర్ తొలి గోల్ నమోదు చేసిన మెస్సీ.. 2-1తో ఆస్ట్రేలియాపై విజయాన్ని అందించాడు. అర్జెంటీనాను ప్రపంచకప్ క్వార్టర్‌ఫైనల్స్‌కు చేర్చాడు. సెమీస్‌లో చోటు కోసం నెదర్లాండ్స్‌తో తలపడేందుకు అర్జెంటీనా రంగం సిద్ధం చేసుకుంది.
- క్వార్టర్‌ఫైనల్లో అర్జెంటీనా
- ఆస్ట్రేలియాపై 2-1తో గెలుపు
2022 ఫిఫా ప్రపంచకప్ నవతెలంగాణ-దోహా (ఖతార్)
ఖతార్‌లో మెస్సీ మ్యాజిక్ కొనసాగుతోంది. కెరీర్ మైలురాయి మ్యాచ్‌లో లియోనల్ మెస్సీ.. అంచనాలను అందుకున్నాడు. సూపర్ గోల్‌తో అర్జెంటీనాను క్వార్టర్‌ఫైనల్‌కు తీసుకెళ్లాడు. ఆస్ట్రేలియాతో ప్రీ క్వార్టర్‌ఫైనల్ పోరులో అర్జెంటీనా 2-1తో ఘన విజయం సాధించింది. ప్రథమార్థంలో ఓ గోల్, ద్వితీయార్థంలో ఓ గోల్ నమోదు చేసిన అర్జెంటీనా.. క్వార్టర్‌ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. గత ఆరు ప్రపంచకప్‌ల్లో ఐదుసార్లు అర్జెంటీనా ప్రీ క్వార్టర్‌ఫైనల్లో విజయం సాధించింది. 2018 ప్రపంచకప్‌లో చాంపియన్ ఫ్రాన్స్ చేతిలో ఓడి, క్వార్టర్స్‌కు ముందే నిష్క్రమించింది. 35వ నిమిషంలో లియోనల్ మెస్సీ మ్యాజిక్ గోల్ కొట్టగా, 57వ నిమిషంలో జులియన్ అల్వారెజ్ మరో గోల్ సాధించాడు. అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ ఎంజో ఫెర్నాండేజ్ సాయంతో ఆస్ట్రేలియా 77వ నిమిషంలో గోల్ నమోదు చేసింది. అగ్ర జట్టు అర్జెంటీనా చేతిలో ఓటమితో ప్రపంచకప్ నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమించింది. ఫిఫా ప్రపంచకప్‌లో కంగారూ జట్టుకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. 2006 ప్రపంచకప్‌లో సైతం ప్రీ క్వార్టర్స్‌కు చేరుకున్న ఆస్ట్రేలియా.. అప్పటి చాంపియన్ ఫ్రాన్స్ చేతిలో ఓటమిపాలైంది. గత నాలుగు ప్రపంచకప్‌లుగా ఆస్ట్రేలియా దక్షిణ అమెరికాకు చెందిన జట్ల చేతిలో భంగపాటుకు గురవుతూనే ఉంది. బ్రెజిల్ (2006), చిలీ (2014), పెరూ (2018), అర్జెంటీనా (2022)లు ఆస్ట్రేలియాపై విజయాలు సాధించాయి. ఇక కీలక క్వార్టర్‌ఫైనల్లో నెదర్లాండ్స్‌తో అర్జెంటీనా తలపడనుంది. 1974, 1978, 2010 ప్రపంచకప్ ఫైనల్స్ చేరినా నెదర్లాండ్స్ రన్నరప్‌గానే నిలిచింది. అర్జెంటీనా 1930, 1978, 1986, 1990, 2014 ప్రపంచకప్ ఫైనల్స్ ఆడగా.. 1978, 1986 ప్రపంచకప్ విజేతగా నిలిచింది.
మెస్సీ ఉత్సాహం : ఆస్ట్రేలియాతో ప్రీ క్వార్టర్స్‌లో అర్జెంటీనాకు ఆశించిన ఆరంభం లభించలేదు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు అర్జెంటీనా ప్లేయర్లను బాగానే ఇరకాటంలో పడేశారు. డిఫెన్స్‌లో గట్టిగా నిలబడిన ఆస్ట్రేలియా.. అర్జెంటీనాను అంత తేలిగ్గా కదలివ్వలేదు. దీంతో అర్జెంటీనా దూకుడు ప్రదర్శించినా ఫలితం లేకపోయింది. 35వ నిమిషంలో లియోనల్ మెస్సీ అభిమానుల నిశ్శబ్దానికి ముగింపు పలికాడు. ఫ్రీ కిక్ వృథా కాగా.. అర్జెంటీనా ఆ అవకాశాన్ని పున సృష్టించింది. అలెక్సిస్ అలిస్టర్ బంతిని నికోలస్‌కు పాస్ చేశాడు. గోల్ పోస్ట్‌కు ముందు బంతిని మెస్సీకి పాస్ చేశాడు నికోలస్. ఇద్దరు ఆస్ట్రేలియా డిఫెండర్లను, గోల్ కీపర్‌ను మాయ చేసిన మెస్సీ.. లెఫ్ట్ కిక్‌తో బంతిని నేరుగా గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. మెస్సీ గోల్‌తో స్టేడియం దద్దరిల్లింది. గోల్‌పోస్ట్ వెనకాలకు వెళ్లిన మెస్సీ.. అభిమానుల ముంగిట వరల్డ్‌కప్ నాకౌట్ దశలో తొలి గోల్ సంతోషాన్ని పంచుకున్నాడు. మెస్సీ మెరుపు గోల్‌తో ప్రథమార్థాన్ని 1-0తో ఆధిక్యంతో ముగించింది అర్జెంటీనా.
అర్జెంటీనా ప్రయత్నాలను ఆస్ట్రేలియా నిలకడగా నిలువరించింది. ద్వితీయార్థంలో మరోసారి గోల్ చేసే అవకాశం ముంగిట నిలిచిన మెస్సీ.. అనూహ్యంగా జారి కిందపడ్డాడు. లేదంటే, మెస్సీ మరో గోల్ కొట్టేవాడే. 57వ నిమిషంలో ఆస్ట్రేలియా గోల్ కీపర్ మాథ్యూ రియాన్ పొరపాటును జులియన్ అల్వరెజ్ గొప్పగా సద్వినియోగం చేసుకున్నాడు. గోల్ ప్రయత్నాన్ని అడ్డుకున్న మాథ్యూ బంతిని తన వద్ద నిలుపుకోలేదు. అది అతడికి కాస్త ముందు జరిగింది. దీంతో అక్కడే ఉన్న అల్వరెజ్ మెరుపు వేగంతో బంతిని గోల్‌పోస్ట్‌లోకి కొట్టాడు. దీంతో అర్జెంటీనా ద్వితీయార్థం ఆరంభంలోనే మరో గోల్ నమోదు చేసింది. 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 77వ నిమిషంలో ఆస్ట్రేలియా సైతం గోల్ ఖాతా తెరిచింది. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన క్రెయిగ్ గుడ్‌విన్ గోల్‌పోస్ట్‌కు 25 అడుగుల దూరం నుంచి కిక్ కొట్టాడు. అర్జెంటీనా డిఫెండర్ ఫెర్నాండేజ్ ఆ బంతిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బంతి దిశను మార్చగా, అది నేరుగా గోల్ పోస్ట్‌లోకి చేరుకుంది. 1-2తో రేసులోకి వచ్చిన ఆస్ట్రేలియా మ్యాచ్ ముగియడానికి క్షణాల ముంగిట మరో అద్భుతమే చేసేందుకు సిద్ధమైంది. ఆసీస్ డిఫెండర్ అజిజ్ బెహిచ్ ఏకంగా నలుగురు అర్జెంటానా ఆటగాళ్లను దాటుకుని గోల్ కోసం దూసుకెళ్లాడు. ఆసీస్ రెండో గోల్ చేసిందనే అందరూ అనుకున్నారు. సరైన సమయంలో బంతిని పట్టుకున్న అర్జెంటీనా గోల్ కీపర్.. మ్యాచ్ అదనపు సమయానికి దారితీయకుండా నిలువరించాడు.