Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిఫా ప్రపంచకప్ 2022
- 3-0తో సెనెగల్పై ధనాధన్
- క్వార్టర్స్‌లో అడుగేసిన ఇంగ్లాండ్
- ఫ్రాన్స్‌తో అమీతుమీకి రంగం సిద్ధం
ప్రపంచకప్‌ను ఛేదిస్తున్న ఇంగ్లాండ్ ఆ దిశగా ఓ అడుగు ముందుకేసింది. కెప్టెన్ హ్యారీ కేన్ ప్రపంచకప్‌లో తొలి గోల్ నమోదు చేయగా, మిడ్‌ఫీల్డర్ జ్యూడ్ బెల్లింగ్‌హామ్ అద్భుత ప్రదర్శనతో త్రీ లయన్స్ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. సెనెగల్పై 3-0తో తిరుగులేని విజయం సాధించిన ఇంగ్లాండ్.. సెమీస్‌లో చోటు కోసం డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌తో సమరానికి సిద్ధం కానుంది. ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్స్‌కు చేరటం ఇంగ్లాండ్‌కు ఇది పదోసారి కావటం విశేషం.
నవతెలంగాణ-దోహా (ఖతార్)
ఫిఫా ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ క్వార్టర్ఫైనల్స్కు చేరుకుంది. ప్రీ క్వార్టర్ఫైనల్లో సెనెగెల్పై ఎదురులేని విజయం నమోదు చేసిన ఇంగ్లాండ్.. టైటిల్ రేసులో త్రీ లయన్స్ సత్తా ఏంటో నిరూపించింది. జోర్డాన్ హెండర్సన్ (39వ నిమిషం), హ్యారీ కేన్ (45+3 నిమిషం), బుకాయో సకా (57వ నిమిషం)లు ఇంగ్లాండ్‌కు గోల్స్ సాధించిపెట్టారు. సెనెగల్ గోల్ కోసం గట్టిగా ప్రయత్నించినా.. ఇంగ్లాండ్ రక్షణ శ్రేణిని ఛేదించలేకపోయింది. గోల్స్ పరంగా సెనెగల్‌కు ప్రపంచకప్‌లో ఇదే భారీ ఓటమి. వరల్డ్‌కప్ మ్యాచ్‌లో సెనెగల్ ఎన్నడూ మూడు గోల్స్ కోల్పోలేదు. గతంలో ఉరుగ్వే (2002)తో గ్రూప్ మ్యాచ్‌లో 3-3తో డ్రా చేసుకోవటమే ఆ జట్టుకు డిఫెన్స్ పరంగా చెత్త ప్రదర్శన. చీఫ్ కోచ్ గారెత్ సౌత్‌గేట్ 2018, 2022 వరుస ప్రపంచకప్‌లలో ఇంగ్లాండ్‌ను క్వార్టర్ఫైనల్స్కు చేర్చి విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చాడు!.
బెల్లింగ్‌హామ్ షో : సెనెగల్‌తో ప్రీ క్వార్టర్స్‌ను ఇంగ్లాండ్ ఫేవరేట్‌గా మొదలెట్టింది. కానీ ఆరంభంలో 30 నిమిషాల ఆట అందుకు పూర్తి విరుద్ధంగా సాగింది. ఇంగ్లాండ్ డిఫెండర్ల పొరపాట్లను సొమ్ముచేసుకున్న సెనెగల్ ఏకంగా గోల్ కోసమే ఎదురుదాడి చేసింది. డిఫెండర్ హ్యారీ మాగూరే బలహీనతను సెనెగల్ ఎటాకర్లు ఎత్తిచూపారు. 22వ నిమిషంలో గోల్ కోసం సెనెగల్ అద్భుత ప్రదర్శన చేసింది. ఇంగ్లాండ్ గోల్‌కీపర్ జోర్డాన్ పిక్‌ఫోర్డ్ అడ్డుకున్నాడు. 31వ నిమిషంలో మరోసారి సెనెగల్ గోల్ కొట్టేలా కనిపించింది. కానీ మళ్లీ ఇంగ్లాండ్‌కు అదృష్టం కలిసొచ్చింది. మ్యాచ్‌లో బంతిని 62 శాతం నియంత్రణలో ఉంచుకున్న ఇంగ్లాండ్.. మిడ్ ఫీల్డర్ జ్యూడ్ బెల్లింగ్‌హామ్ షోతో మ్యాచ్‌లోకి దూసుకొచ్చింది. మిడ్‌ఫీల్డ్‌లో బెల్లింగ్‌హామ్ బంతిని నియంత్రణలో ఉంచుకోవటంతో సెనెగల్ ఆట కట్టినట్టు అయ్యింది. దీంతో ఇంగ్లాండ్ ఎటాకర్లు స్వేచ్ఛగా గోల్ ప్రయత్నాలు చేశారు. 39వ నిమిషంలో పర్ఫెక్ట్ క్రాస్ పాస్‌ను అందించిన బెల్లింగ్‌హామ్.. జోర్డాన్ హెండర్సన్ గోల్‌కు మార్గం సుగమం చేశాడు. ఇక ప్రథమార్థం అదనపు సమయంలో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ కేన్ గోల్‌ను సైతం బెల్లింగ్‌హామ్ సెట్ చేశాడు. సెనెగల్ ఆటగాళ్లను తప్పిస్తూ గోల్ అవకాశం సృష్టించిన బెల్లింగ్‌హామ్ తెలివిగా బంతిని ఫిల్ ఫోడెన్ను పాస్ చేశాడు. ఫోడెన్ బంతిని హ్యారీ కేన్‌కు చేర్చగా.. అతడు చేయాల్సిన పని పర్ఫెక్ట్గా ముగించాడు. దీంతో ప్రథమార్థంలో ఇంగ్లాండ్ 2-0తో తిరుగులేని ఆధిక్యం సాధించింది.
రెండో అర్థ భాగంలోనూ ఇంగ్లాండ్ జోరు తగ్గలేదు. ద్వితీయార్థం 12వ నిమిషంలోనే ఇంగ్లాండ్ మూడో గోల్ సాధించింది. 57వ నిమిషంలో ఫిల్ ఫోడెన్ సున్నితమైన పాస్‌ను అందించగా.. బుకాయో సకా కండ్లుచెదిరే గోల్ కొట్టాడు. సెనెగల్ ప్రయత్నాలను ఇంగ్లాండ్ సమర్థవంతంగా నిలువరించగా త్రీ లయన్స్ 3-0తో ఘన విజయం సాధించింది. ఇక గోల్‌కీపర్ పిక్ఫోర్డ్పై తరచుగా విమర్శలు వినిపించినా.. చీఫ్ కోచ్ సౌత్గౌట్ అతడిపై పూర్తి నమ్మకం ఉంచాడు. ర్యాష్‌ఫోర్డ్ వేల్స్‌పై రెండు గోల్స్ కొట్టినా.. సకా, ఫోడెన్లను బరిలో నిలిపిన సౌత్గౌట్ ఆశించిన ఫలితాన్ని రాబట్టుకున్నాడు.