Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి టెస్టులో ఇంగ్లాండ్ అసమాన విజయం
పాకిస్థాన్, ఇంగ్లాండ్ తొలి టెస్టు. జీవం లేని రావల్పిండి పిచ్. పరుగుల వరద, వికెట్ల కరువు. సుమారుగా 1800 పరుగులు, 37 వికెట్లు, ఐదు రోజుల ఆట ముగిసేందుకు మరో ఐదు, పది నిమిషాలే మిగిలింది. ఓ వైపు వెలుతురు తగ్గుముఖం పడుతున్నా, ఇంగ్లాండ్‌లో గెలుపు కాంక్ష మాత్రం రెట్టింపు పెరిగింది. సాహసోపేత డిక్లరేషన్‌తో పాకిస్థాన్‌ను 268 పరుగులకే కుప్పకూల్చిన ఇంగ్లాండ్ చారిత్రక టెస్టు విజయం ఖాతాలో వేసుకుంది.
రావల్పిండి (పాకిస్థాన్) : ఇంగ్లాండ్ అద్భుతం చేసింది. ఫలితం కనిపించిన టెస్టులో అద్వితీయ విజయాన్ని సాధించింది. రెండో ఇన్నింగ్స్‌ను డిక్లరేషన్ ప్రకటించి పాకిస్థాన్‌కు 343 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ నాల్గో రోజు సాయంత్రం రావల్పిండిలో వేడి పుట్టించాడు. చివరి రోజు సెషన్ సాగుతున్న కొద్ది టెస్టు రక్తికట్టింది. 7.3 ఓవర్ల వ్యవధిలో 4 కీలక వికెట్లు కూల్చిన ఇంగ్లాండ్ రావల్పిండిలో చారిత్రక విజయానికి చేరువైంది. మరో పది నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా సుమారు పది ఓవర్ల పాటు వికెట్ కాచుకున్న పాక్.. చివరికి ఇంగ్లాండ్‌కు సలాం కొట్టకతప్పలేదు. జేమ్స్ అండర్సన్ (4/56), ఒలీ రాబిన్సన్ (4/50) నిప్పులు చెరగటంతో ఛేదనలో పాకిస్థాన్ (రెండో ఇన్నింగ్స్) 268 పరుగులకు కుప్పకూలింది. సయిద్ షకీల్ (76, 159 బంతుల్లో 12 ఫోర్లు) అర్థ సెంచరీతో కదం తొక్కినా.. సహచర బ్యాటర్లలో ఎవరూ అండగా నిలువలేదు. ఇమామ్ ఉల్ హాక్ (48), అజార్ అలీ (40), మహ్మద్ రిజ్వాన్ (46), సల్మాన్ (30) మెరిసినా వికెట్ నిలుపుకోలేదు. ఇంగ్లాండ్ సంచలన డిక్లరేషన్‌తో 343 పరుగుల ఊరించే లక్ష్యం పాకిస్థాన్‌కు మొగ్గు అనిపించింది. కానీ గెలుపు కోసం ఆడే క్రమంలో ఓడినా లెక్క చేయమనే ఇంగ్లాండ్ పంథా ఆ జట్టును అద్భుతం చేసేలా చేసింది. కోచ్ మెక్‌కలమ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ ద్వయం టెస్టు క్రికెట్ స్టయిల్‌నే కాదు రూల్స్, రికార్డులు సైతం తిరగరాస్తున్నారు!. ఇంగ్లాండ్ పేసర్ ఒలీ రాబిన్సన్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో సాధించింది.
స్కోరు వివరాలు :
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 657/10
పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ : 579/10
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ : 264/7 డిక్లేర్డ్
పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్ : 268/10