Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంగ్లాదేశ్ అరుదైన రికార్డుపై కన్నేసింది. సొంతగడ్డపై భారత్‌ను వరుస వన్డే సిరీస్‌లో ఓడించిన ఘనత కోసం బంగ్లా పులులు ఎదురుచూస్తున్నాయి. నేడు రెండో వన్డేలో ఆతిథ్య జట్టు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. రసవత్తర మలుపులు తిరిగిన తొలి వన్డేలో విజయానికి దూరమైన భారత్ సిరీస్ పోరును నిర్ణయాత్మక మ్యాచ్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది.
- భారత్, బంగ్లాదేశ్ రెండో వన్డే పోరు నేడు.
- బ్యాటర్ల ఫామ్‌పై ఆందోళన
- బంగ్లాతో రెండో వన్డే నేడు
- ఉదయం 11.30 నుంచి సోనీలో..
నవతెలంగాణ-మీర్పూర్ :
బ్యాటర్లు పుంజుకుంటారా? :
తొలి వన్డేలో భారత్ అనూహ్య పరాజయం చవిచూసింది. పదో వికెట్‌కు 51 పరుగులు సమర్పించుకుని ఓటమి చెందింది. పదో వికెట్ పడగొట్టేందుకు లభించిన అవకాశాలను జారవిడిచింది. మెరుగైన బౌలింగ్ దాడితో 186 పరుగులను సైతం గెలుపు స్కోరుగా మలిచింది. అయితే, భారత్ ప్రధాన సమస్య బ్యాటింగ్. వైవిధ్యంతో మాయ చేసిన షకిబ్, హోస్సేన్ భారత బ్యాటర్లు వెనుకంజ వేసేలా చేశారు. నలుగురు ఆల్రౌండర్లలో బరిలోకి దిగినా.. 50 ఓవర్ల పాటు ఆడలేకపోయింది. మరో స్పెషలిస్ట్ బ్యాటర్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కిషన్, త్రిపాఠి, పటీదార్ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వ పగ్గాలు అందుకున్న తర్వాత బ్యాట్‌తో విజృంభించలేదు. జట్టు కష్టాల్లో ఉన్న వేళ నాయకుడి నుంచి ధనాధన్ ఇన్నింగ్స్ ఆశించటం సరైనదే. శిఖర్ ధావన్ ఫామ్‌లో ఉన్నప్పటికీ తొలి వన్డేలో మెరువలేదు. జోరుమీదున్న విరాట్ కోహ్లి సైతం తడబడ్డాడు. బంగ్లా గడ్డపై వన్డేల్లో వెయ్యి పరుగులకు మరో 21 పరుగుల దూరంలో నిలిచిన కోహ్లి.. నేడు శతకంపై కన్నేసి బరిలోకి దిగుతున్నాడు. కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్‌లు జోరు కొనసాగిస్తే చివర్లో భారత్‌కు పెద్దగా బెంగ అక్కర్లేదు. అక్షర్ పటేల్ ఫిట్నెస్ సాధిస్తే షాబాజ్ స్థానంలో జట్టులోకి రానున్నాడు. మహ్మద్ సిరాజ్ మరోసారి బౌలింగ్ బృందానికి నాయకత్వం వహించనున్నాడు.
సిరీస్‌పై కన్నేసి..! :
2015 వన్డే సిరీస్‌ను బంగ్లాదేశ్ గెల్చుకుంది. ఆ తర్వాత బంగ్లాలో భారత్ వన్డే పర్యటనకు రావటం ఇదే తొలిసారి. తొలి వన్డేలో ఉత్కంఠ విజయం సాధించిన బంగ్లాదేశ్ నేడు నెగ్గితే వరుసగా రెండు వన్డే సిరీస్‌లు సొంతం చేసుకున్నట్టు అవనుంది. నాయకుడిగా తొలి మ్యాచ్‌లోనే సహచర మన్ననలు పొందిన లిటన్ దాస్ బ్యాట్‌తోనూ ఈ ఏడాది అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడికి షకిబ్ అల్ హసన్, ముష్ఫీకర్ రహీం, మహ్మదుల్లా తోడైతే బంగ్లాదేశ్‌కు బ్యాటింగ్ కష్టాలు ఉండవు. మంచు ప్రభావంలో బౌలింగ్ చేసినా భారత బౌలర్లు గొప్పగా రాణించారు. మిడిల్ ఓవర్లలో బంగ్లాదేశ్‌కు బౌండరీ కొట్టే అవకాశమే ఇవ్వలేదు. భారత బౌలర్లపై పరుగులు సాధించే ప్రణాళికను బంగ్లా బ్యాటర్లు సరిచూసుకోవాలి. షకిబ్ అల్ హసన్, ఎబాడట్ హోస్సేన్‌లు భారత్‌ను ఇరకాటంలో పడేశారు. పిచ్ పరిస్థితులపై మంచి అవగాహన కలిగిన ఈ ఇద్దరు నేడు బంగ్లాకు కీలకం కానున్నారు. విన్నింగ్ కాంబినేషన్‌ను మార్పు చేసేందుకు ఆతిథ్య జట్టు పెద్దగా ఆసక్తి చూపబోదు.
పిచ్, వాతావరణం : ఈ పిచ్‌పై స్పిన్ మరోసారి కీలక భూమిక పోషించనుంది. పేసర్లకు బౌన్స్, పేస్ అనిశ్చితి కనిపించనుంది. పిచ్ నుంచి పెద్దగా సహకారం ఉండకపోవచ్చు. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం చూపనుంది. టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునేందుకు మొగ్గుచూపవచ్చు.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్సేన్.
బంగ్లాదేశ్ : నజ్ముల్ శాంటో, లిటన్ దాస్ (కెప్టెన్), అనాముల్ హాక్, షకిబ్ అల్ హసన్, ముష్ఫీకర్ రహీం (వికెట్ కీపర్), మహ్మదుల్లా, అఫిఫ్ హోస్సేన్, మెహిది హసన్ మిరాజ్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఎబాడాట్ హోస్సేన్.