Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'గోల్స్ కొట్టడం మొదలెడితే, మాకంటే ఎక్కువ ఎవరూ కొట్టలేరు' అంటూ సాంబా సూపర్ ప్రదర్శన చేసింది. ఐదుసార్లు చాంపియన్, టైటిల్ ఫేవరేట్ బ్రెజిల్ ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రథమార్థంలోనే నాలుగు గోల్స్‌తో దుమ్మురేపిన బ్రెజిల్.. దక్షిణ కొరియాను చిత్తు చేసింది. ఈ ప్రపంచకప్‌లో తొలి 45 నిమిషాల్లోనే 4 గోల్స్ కొట్టిన ఏకైక జట్టుగా బ్రెజిల్ నిలిచింది. 2018 ఫిఫా ప్రపంచకప్ రన్నరప్ క్రోయేషియాతో క్వార్టర్ఫైనల్లో బ్రెజిల్ తలపడనుంది.
- 4-1తో దక్షిణ కొరియాపై గెలుపు
- క్వార్టర్ఫైనల్లో బ్రెజిల్ అడుగు
- ఫిఫా ప్రపంచకప్
నవతెలంగాణ-దోహా
ప్రత్యర్థిపై ఎదురుదాడి చేస్తూ, ఆధిపత్యం సాధించే శైలి సాకర్ ఆడటంలో దక్షిణ అమెరికా జట్లు దిట్ట. ఇక ఈ జట్లలో బ్రెజిల్‌ది అగ్రస్థానం. ఆ విషయం మరోసారి నిరూపించింది సాంబా. ఫిఫా ప్రపంచకప్ ప్రీ క్వార్టర్ఫైనల్లో దక్షిణ కొరియాను ఉక్కిరిబిక్కిరి చేసిన బ్రెజిల్.. జిగేల్ విజయాన్ని అందుకుంది. 1988 వరల్డ్‌కప్ (చిలీపై 4-1) తర్వాత నాకౌట్ దశలో తొలిసారి నాలుగు గోల్స్ కొట్టిన బ్రెజిల్ 4-1 విజయంతో క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లింది. వినిసియస్ జూనియర్ (7వ నిమిషం), నెరుమార్ (13వ నిమిషం), రిచర్లిసన్ (29వ నిమిషం), లుకాస్ పకెటా (36వ నిమిషం) బ్రెజిల్‌కు గోల్స్ నమోదు చేశారు. 76వ నిమిషంలో పెయిక్ సెయింగ్ హో దక్షిణ కొరియాకు ఊరట గోల్ అందించాడు. ఎదురులేని ఎటాకింగ్, తిరుగులేని డిఫెన్స్‌తో బ్రెజిల్ ధనాధన్ ప్రదర్శన చేసింది. బ్రెజిల్ స్టార్ నెరుమార్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. క్వార్టర్ఫైనల్లో క్రోయేషియాతో బ్రెజిల్ తలపడనుంది.
ధనాధన్ మోత : ప్రీ క్వార్టర్స్ మ్యాచ్‌లో దక్షిణ కొరియాను బ్రెజిల్ చిత్తు చేసింది. బంతి నియంత్రణలో బ్రెజిల్ (53 శాతం)తో సమానంగా పోరాడిన దక్షిణ కొరియా (47 శాతం).. గోల్స్ విషయంలో పూర్తిగా తేలిపోయింది. ఎదురుదాడితో పాటు డిఫెన్స్‌లోనూ ఈ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన బ్రెజిల్ క్వార్టర్ఫైనల్స్కు ముందు విలువైన ఆత్మవిశ్వాసం సాధించింది. మ్యాచ్ ఆరంభంలోనే వినిసియస్ జూనియర్ బ్రెజిల్‌కు గోల్ అందించాడు. 7వ నిమిషంలో లెఫ్ట్ కార్నర్ నుంచి ఇరు జట్ల ఆటగాళ్లను తప్పిస్తూ నెరుమార్ అందించిన పాస్‌ను వినిసియస్ గోల్‌గా మలిచాడు. దక్షిణ కొరియా గోల్‌కీపర్, ఇద్దరు డిఫెండర్లు అడ్డు నిలిచినా.. ముగ్గురినీ బోల్తా కొట్టిస్తూ బంతిని గోల్‌పోస్ట్‌లోకి తన్నేశాడు. 13వ నిమిషంలో రిచర్లిసన్కు లభించిన పెనాల్టీ కిక్‌ను నెరుమార్ గోల్‌గా మలిచాడు. దక్షిణ కొరియా గోల్కీపర్ను మాయ చేసిన నెరుమార్ అలవోకగా బంతిని గోల్‌గా మలిచాడు. దీంతో బ్రెజిల్ తరఫున నెరుమార్ 76వ గోల్ కొట్టాడు. దిగ్గజం పీలేకు కేవలం ఒక్క గోల్ వెనుకంజలోనే నిలిచాడు. ఇక దక్షిణ కొరియాపై బ్రెజిల్ చేసిన గోల్స్‌లో.. మూడో గోల్ ప్రత్యేకం. ఈ గోల్ బ్రెజిల్ మినహా మరో జట్టు చేయలేదేమో అనటం అతిశయోక్తి కాదు. బంతిని తొలుత మార్కిన్హోస్కు పాస్ చేసిన రిచర్లిసన్.. అటు నుంచి గోల్‌పోస్ట్ ముందుకు దూసుకెళ్లాడు. మార్కిన్హోస్ బంతిని థియాగో సిల్వకు పాస్ చేశాడు. అప్పటికే కొరియా గోల్ పోస్ట్ ముందున్న రిచర్లిసన్కు సిల్వ బంతిని అందించాడు. ప్లాన్ ప్రకారం బంతి తిరిగి తన దగ్గరకు చేరటంతో రిచర్లిసన్ బంతిని నేరుగా గోల్‌పోస్ట్‌లోకి నెట్టాడు. ఈ గోల్‌తో స్టేడియం అంతా మార్మోమోగింది. బ్రెజిల్ చీఫ్ కోచ్ సైతం గంతులేస్తూ సంబురాన్ని పంచుకున్నాడు. బ్రెజిల్ జట్టంతా ఒకచోటకు చేరి గోల్‌ను సెలబ్రేట్ చేసుకుంది. ఇక 36వ నిమిషంలో లుకాస్ మరో గోల్ నమోదు చేసి ప్రథమార్థాన్నికి ముందే బ్రెజిల్‌ను 4-0 ఆధిక్యంలో నిలిపాడు. మరో 45 నిమిషాల ఆట మిగిలి ఉండగానే బ్రెజిల్ క్వార్టర్‌ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ప్రథమార్థం ఇంజూరీ సమయంలో నెరుమార్ చేసిన మెరుపు గోల్ ప్రయత్నాన్ని దక్షిణ కొరియా గోల్‌కీపర్ నిలువరించాడు.
ఇక ద్వితీయార్థంలో సైతం బ్రెజిల్ దూకుడుగా ఆడింది. కానీ ఆట రెండో అర్థభాగంలో దక్షిణ కొరియా గోల్ చేసింది. 76వ నిమిషంలో పెనాల్టీ ఏరియాకు దూరంగా బంతిని అందుకున్న సియోంగ్ హో నేరుగా బంతిని గోల్‌పోస్ట్‌లోకి తన్నాడు. బ్రెజిల్ డిఫెండర్లను గాల్లోనే తప్పిస్తూ అద్భుతంగా గోల్ చేశాడు. దక్షిణ కొరియా ఆటగాళ్లు సైతం గోల్‌పోస్ట్‌పై గట్టిగా దాడి చేసినా.. బ్రెజిల్ గోల్‌కీపర్ గొప్పగా నిలువరించాడు.