Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోచ్‌తో రొనాల్డోకు విభేదాలు
దోహా (ఖతార్) : పోర్చుగల్ మెరుపు ప్రదర్శనతో ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ఫైనల్స్కు చేరుకుంది. ప్రీ క్వార్టర్స్‌లో స్విట్జర్లాండ్‌పై 6-1తో తిరుగులేని విజయం సాధించిన పోర్చుగల్ క్వార్టర్స్ బెర్త్ కైవసం చేసుకుంది. క్వార్టర్ఫైనల్లో మొరాకతో సమరానికి రంగం సిద్ధం చేసుకున్న పోర్చుగల్.. అటు క్వార్టర్స్ మ్యాచ్‌పైనా, ఇటు ప్రీ క్వార్టర్స్ గెలుపుపైనా దృష్టి పెట్టే పరిస్థితుల్లో కనిపించటం లేదు. ఫుట్‌బాల్ ఆల్ టైమ్ గ్రేట్స్లలో ఒకడిగా క్రిస్టియానో రొనాల్డోను పరిగణిస్తారు. అయితే, స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌కు ఆరంభ ఎలెవన్‌లో రొనాల్డోకు చీఫ్ కోచ్ ఫెర్నాండో శాంటోస్ చోటు ఇవ్వలేదు. అతడికి బదులుగా గొంకాలో రామోస్‌ను జట్టులోకి తీసుకున్నాడు. రామోస్ మెరుపు ప్రదర్శనతో హ్యాట్రిక్ గోల్స్ కొట్టి సంచలనం సృష్టించాడు. అంతకముందు దక్షిణ కొరియాతో గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లో రొనాల్డోను కోచ్ చివర్లో సబ్‌స్టిట్యూట్ చేశాడు. మైదానం నుంచి వెనక్కి పిలువటంతో రొనాల్డో తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత మ్యాచ్‌కు ఏకంగా ఆరంభ ఎలెవన్ నుంచే ఎత్తేశాడు కోచ్ శాంటోస్. పోర్చుగల్ తరఫున 195 మ్యాచులు ఆడిన రొనాల్డో అత్యధికంగా 118 గోల్స్ నమోదు చేశాడు. ఐదుసార్లు బల్లాన్ డీ అవార్డు విజేత రొనాల్డో.. ప్రపంచకప్‌లో పోర్చుగల్ తొలి మ్యాచ్‌కు ముందు మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌తో తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఓ ఇంటర్య్వూలో సంచలన విషయాలు బయటపెట్టిన రొనాల్డో అనంతర పరిణామాలతో మాంచెస్టర్‌తో పరస్పర అంగీకారంతో కాంట్రాక్టును ముందేగానే ముగించాడు.
ప్రీ క్వార్టర్ఫైనల్లో పోర్చుగల్ విజయం అనంతరం.. సాకర్ ప్రపంచం అత్యంత భిన్నంగా కనిపించింది. పోర్చుగల్ జట్టులో రొనాల్డో ఇమడటం లేదని.. అతడిని ఆరంభ ఎలెవన్‌లో కాకుండా ద్వితీయార్థంలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దింపటంతోనే పోర్చుగల్‌కు అధిక ప్రయోజనమనే అభిప్రాయం వెలిబుచ్చారు. ఆరంభ ఎలెవన్‌లో చోటు దక్కకపోవటాన్ని అవమానంగా భావించిన క్రిస్టియానో రొనాల్డో ప్రపంచకప్ జట్టును వీడతాననే హెచ్చరికలు చేశాడనే వార్తలు వినిపించాయి. ఓ పోర్చుగల్ పత్రిక ప్రచురించిన కథనానికి ఫోర్చుగల్ ఫుట్‌బాల్ సమాఖ్య స్పందించింది. రొనాల్డో ఎటువంటి హెచ్చరికలు చేయలేదు, అతడు జట్టుతో పాటు కలిసిపోయి సాధన చేస్తున్నాడని ఓ ప్రకటనలో తెలిపింది. ఇక మొరాకోతో మ్యాచ్ కోసం సబ్స్టిట్యూట్లతో పాటు కాకుండా ఆరంభ ఎలెవన్ ఆటగాళ్లతోనే రొనాల్డో సాధన చేయటం గమనార్హం. పోర్చుగల్, మొరాకో క్వార్టర్‌ఫైనల్ శనివారం జరుగనుంది.