Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిఫా ప్రపంచకప్ తీసుకొచ్చిన సంతోషం
నవతెలంగాణ-దోహా
'రాజకీయంగా మేమంతా (అరబ్ దేశాలు) ఒక్కటి కాదు. కానీ క్రీడల పరంగా మేమంతా ఒక్కటే. ఫుట్‌బాల్‌లోని గమ్మతైన మ్యాజిక్ అదే'.. ప్రీ క్వార్టర్ఫైనల్లో స్పెయిన్‌పై మొరాకో చారిత్రక విజయం అనంతరం ఓ అరబ్ అభిమాని అన్న మాటలివి. మొరాకో ఉత్తర ఆఫ్రికా దేశం. అట్లాంటిక్ మహా సముద్రం, మధ్యధర సముద్రం తీరంలో ఉండే మొరాకో..ఖతార్‌లో చిన్నపాటి సునామీ సృష్టించింది. ప్రీ క్వార్టర్ఫైనల్లో మాజీ చాంపియన్ స్పెయిన్‌పై 3-0 (పెనాల్టీ షూటౌట్)తో ఘన విజయం సాధించింది. ప్రపంచకప్ చరిత్రలో నూతన అధ్యాయం లిఖించింది. స్పెయిన్‌పై మొరాకతో విజయం సాధించిన రాత్రి అరబ్ ప్రపంచం గొప్ప వేడుక చేసుకుంది. అరబ్ దేశాల్లోనే కాదు అరబ్ దేశాల ప్రజలు ఎక్కువగా నివసిస్తోన్న దేశాల్లో సైతం మొరాకో జాతీయ జెండాలు రెపరెపలాడాయి. ఈజిప్ట్ రాజధాని కైరో టవర్ మొరాకో జెండా రంగు పులుముకోగా, గాజాలో వేలాది మంది మొరాకో జాతీయ జెండాలతో ఒక్కచోటకు చేరారు. లండన్‌లోని ఎడ్జ్‌వేర్ రోడ్ మొరాకో ప్లాగ్‌తో నిండిపోయింది. పారిస్, శాన్ ప్రాన్సిస్కో, మిలాన్, బార్సిలోనా నగరాల్లోనూ మొరాకో రంగులతో అభిమానులు వేడుక చేసుకున్నారు. ఎక్కడో ఉత్తర ఆఫ్రికాలో సముద్ర తీరాన ఉన్న మొరాకో ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ఫైనల్స్కు చేరితే.. అరబ్ ప్రపంచం ఎందుకు వేడుక చేసుకుంది?!.
'ఇది అందరి రోజు. మొరాకో మా పొరుగు దేశం. ప్రపంచకప్‌లో మేమంతా ఆ జట్టు తరఫున నిలిచాం. టైటిల్ రేసులో మనం నిలిచే ఉన్న భావన అమోఘం. ప్రజలు అందరు పండుగ చేసుకునే సందర్భం ఇది. మీకు కనబడుతుంది.. మొరాకో నుంచి అరబ్ దేశాల వరకు మేమంతా ఒక్కటిగా ఉన్నాం' అంటూ సోషల్ మీడియా వేదికగా అరబ్ దేశ అభిమానులు మొరాకో విజయ ఆనందాన్ని పంచుకున్నారు. మొరాకో దోహాలో జయభేరి మోగించగా.. ప్రతిధ్వని అరబ్ దేశాలన్నింటా కనిపించింది. మా కల నిజమైందంటూ యావత్ అరబ్ దేశ అభిమానులు పొంగిపోయారు. అరబ్ దేశాల ప్రతినిధిగా మొరాకతో ఫిఫా ప్రపంచకప్ టైటిల్ రేసులో నిలిచింది. శనివారం జరిగే క్వార్టర్ఫైనల్లో పోర్చుగల్‌తో మొరాకో తలపడనుంది.