Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫిఫా 2022 ప్రపంచకప్‌లో టైటిల్ రేసులో ఎనిమిది జట్లు. అందరి లక్ష్యం డిసెంబర్ 18న వరల్డ్‌కప్ సొంతం చేసుకోవటమే. లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, నెరుమార్తో పాటు కిలియన్ ఎంబాపె, హ్యారీకేన్, లూకా మోద్రిచ్లు సైతం ప్రపంచకప్ కప్పు వేటలో నిలిచారు. ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్‌ఫైనల్స్
నేటి నుంచి ఆరంభం.
- నేటి నుంచి క్వార్టర్స్ మ్యాచులు
- ఫిఫా ప్రపంచకప్ 2022
నవతెలంగాణ క్రీడావిభాగం
ఫిఫా ప్రపంచకప్ తుది దశకు చేరుకుంది. గ్రూప్ దశలో జర్మనీ, బెల్జియం వంటి దిగ్గజాలు నిష్క్రమించగా.. ప్రీ క్వార్టర్స్‌లో స్పెయిన్ నిష్క్రమణతో సుదీర్ఘ విరామం అనంతరం ఈ జట్లు లేకుండా ఫిఫా క్వార్టర్‌ఫైనల్స్ షురూ కానున్నాయి. క్వార్టర్స్ బరిలో నిలిచిన ఎనిమిది జట్లలో ఆరు జట్లు మాజీ చాంపియన్లు లేదా ఫైనలిస్ట్‌లు. ఈ ఆరు జట్లు ఏకంగా 10 సార్లు ప్రపంచకప్‌ను సాధించాయి. అర్జెంటీనా, బ్రెజిల్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్‌లతో పాటు మొరాకతో రూపంలో ఈ సారి సర్ప్రైజ్ సైతం సిద్ధంగా ఉంది. నేడు తొలి క్వార్టర్స్‌లో ఐదుసార్లు చాంపియన్ బ్రెజిల్‌తో క్రోయేషియా తలపడనుండగా, మరో క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్‌తో రెండు సార్లు చాంపియన్ అర్జెంటీనా తాడోపేడో తేల్చుకోనుంది. శనివారం క్వార్టర్‌ఫైనల్స్‌లో మొరాకతో పోర్చుగల్ తలపడనుండగా.. చివరగా డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌తో మాజీ చాంపియన్ ఇంగ్లాండ్ చావోరేవో తేల్చుకోనుంది.
మెస్సీ వర్సెస్ రొనాల్డో ఫైనల్? : ఆదివారం, డిసెంబర్ 18. దోహా లుసైల్ స్టేడియంలో తుది సమరం. సాకర్ చూసిన ఇద్దరు అత్యుత్తమ ఆటగాళ్లు కప్పు కోసం పోటీపడితే? ఉత్తమ ఆటగాళ్ల ఆధిపత్య పోరు చూస్తూ ప్రపంచం ఊగిపోదా?!. లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలు తమ చివరి ప్రపంచకప్ ఆడుతున్నారు!. ఈ ప్రపంచకప్‌లో మెస్సీ కెరీర్ 1000వ గోల్ కొట్టగా, రొనాల్డో ఐదు ప్రపంచకప్‌లలో గోల్ కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. 2021లో మెస్సీ కోపా అమెరికా నెగ్గగా, 2016 యూరో కప్‌ను రొనాల్డో సాధించాడు. ఇప్పుడు ఇద్దరి కల, లక్ష్యం ప్రపంచకప్. అర్జెంటీనా ఆశలను మెస్సీ మోస్తుండగా, పోర్చుగల్ శిబిరంలో రొనాల్డో ఊహించని పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. మెస్సీ, రొనాల్డో ఫైనల్లో తలపడితే ఆల్ టైమ్ గ్రేట్ ఎవరనే వాదనకు సైతం తెరపడనుంది!.
ఆంగ్లో, ఫ్రెంచ్ ఢ : ప్రపంచకప్‌లో ఫ్రాన్స్, ఇంగ్లాండ్ పోరు కోసం ఎదురుచూస్తున్నారు. కిలియన్ ఎంబాపె ఐదు గోల్స్‌తో ప్రత్యర్థులకు ప్రమాద హెచ్చరికలు పంపించాడు. హ్యారీకేన్ ఇంగ్లాండ్ సైతం బలంగానే కనిపిస్తోంది. డిఫెండింగ్ చాంపియన్ ప్రాన్స్‌ను ఓడించటం అంత సులువు కాదు. కానీ ఇంగ్లాండ్ గత నాలుగేండ్లలో గొప్పగా పుంజుకుంది. ఇక యూరో 2012 తర్వాత ఫ్రాన్స్, ఇంగ్లాండ్ మెగా ఈవెంట్లలో తలపడలేదు. చివరగా 1982 వరల్డ్‌కప్‌లోనే ఢకొీన్నారు. పదేండ్లలో తొలిసారి, అదీ ఫిఫా నాకౌట్లో తలపడుతున్న ఇంగ్లాండ్, ఫ్రాన్స్ క్వార్టర్స్ పోరును మినీ ఫైనల్స్‌గా చూస్తున్నాయి!.
దక్షిణ అమెరికా ధమాకా! : ఫిఫా అంతిమ సమరానికి ముందే, అభిమానులకు కిక్కిచ్చే మ్యాచ్ సిద్దమవుతోంది!. ఐదుసార్లు చాంప్ బ్రెజిల్, రెండు సార్లు అర్జెంటీనా ఒకే పార్శ్యంలో ఉన్నాయి. క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్, క్రోయేషియాలను దాటేస్తే సెమీఫైనల్లో ముఖాముఖికి సిద్దం కావాల్సిందే. ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు నాలుగు సార్లు తలపడినా.. 1990 తర్వాత ఎదురుపడలేదు. సాకర్ పవర్ హౌస్‌లు, అగ్రజట్లు సెమీఫైనల్లోనే అభిమానులకు మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వినోదం అందించటం లాంఛనంగా కనిపిస్తోంది. బ్రెజిల్ తరఫున నెరుమార్, అర్జెంటీనా సారథి మెస్సీలు ఇరు జట్లకు కీలకం.
క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్, మొరాకో సహా 2018 రన్నరప్ క్రోయేషియాలు ఉన్నాయి. ఈ మూడు జట్లను ఏమాత్రం తక్కువ అంచనా వేయలేం. సెమీస్‌కు చేరిన తొలి ఆఫ్రికా జట్టుగా నిలిచేందుకు మొరాకో ఉరకలేస్తోంది. ప్రపంచకప్‌లో ఓటమెరుగని మొరాకో, గత ఏడు మ్యాచుల్లో ప్రత్యర్థులకు ఒక్క గోలే కోల్పోయింది. నెదర్లాండ్స్, క్రోయేషియాలు సైతం ఆసక్తి రేపుతున్నాయి. అయితే ఈ రెండు జట్లు అర్జెంటీనా, బ్రెజిల్‌ను ఎదుర్కొవాల్సి ఉండటంతో మొగ్గు దక్షిణ అమెరికా జట్లవైపు వెళ్లింది!.