Authorization
Mon Jan 19, 2015 06:51 pm
3 మ్యాచుల వన్డే సిరీస్. బంగ్లాదేశ్ 2-0 ఆధిక్యం. నిజానికి 2-0 ముందంజలో నిలిచేందుకు భారత్‌కూ చక్కటి అవకాశం లభించింది. థ్రిల్లింగ్ మ్యాచుల్లో రెండుసార్లు ఒకే జట్టును విజయం వరించటం విచిత్రమే. స్వదేశంలో గత 14 వన్డే సిరీస్‌ల్లో బంగ్లాదేశ్ ఏకంగా 13 సిరీస్‌లను సాధించింది. భారత్‌పైనా సిరీస్‌ను దక్కించుకున్న బంగ్లా ఇప్పుడు క్లీన్‌స్వీప్‌పై గురిపెట్టింది. అనూహ్య ఓటముల నైరాశ్యంలో ఉన్న టీమ్ ఇండియా ఊరట విజయం కోసం ఎదురుచూస్తోంది. నేడు భారత్, బంగ్లాదేశ్ మూడో వన్డే.
- బంగ్లాతో చివరి వన్డే నేడు
- గాయాలతో భారత్ సతమతం
- ఉదయం 11.30 నుంచి సోనీలో..
నవతెలంగాణ-చిట్టగాంగ్
భారత్‌కు గాయాల దెబ్బ
బంగ్లాదేశ్ పర్యటనలో టీమ్ ఇండియా ఊహించని రీతిలో గాయాల సమస్య ఎదుర్కొంటుంది. ఇప్పటికే ఆరంభ జట్టులో ఏకంగా ఏడు మార్పులు చేసిన భారత్.. చివరి వన్డేకు కెప్టెన్ రోహిత్ శర్మను సైతం కోల్పోయింది. పేసర్లు దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్ గాయాల బారిన పడగా తుది జట్టులో నిలిచేందుకు ఇద్దరు పేసర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగేందుకు పరిస్థితులు ప్రభావం చూపుతున్నాయి. గాయం వేధిస్తున్నా రెండో వన్డేలో గెలుపు కోసం చివరి బంతి వరకు ప్రయత్నించిన రోహిత్ శర్మ.. స్వదేశానికి చేరుకున్నాడు. అతడి స్థానంలో ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా రానున్నాడు. రోహిత్ లేని వేళ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిపై మరింత భారం పడనుంది. గత ఏడు వన్డే ఇన్నింగ్స్‌ల్లో కోహ్లి అత్యధిక స్కోరు 18. టీ20ల్లో గొప్ప ఫామ్ కనబరిచిన విరాట్.. 50 ఓవర్ల ఆటలో తడబడుతున్నాడు. నేడు విరాట్ నుంచి జట్టు మంచి ఇన్నింగ్స్ ఆశిస్తోంది. శిఖర్ ధావన్ సైతం ఫామ్‌లోకి వస్తే టాప్ ఆర్డర్ కష్టాలు తీరతాయి. శ్రేయస్ అయ్యర్ మంచి టచ్‌లో ఉన్నాడు. అతడికి తాత్కాలిక కెప్టెన్ కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్ సహకారం లభిస్తే భారీ స్కోరు సులువు కానుంది. బౌలింగ్ విభాగంలో మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఈ ఏడాది పవర్‌ప్లేలో 15 వికెట్లు పడగొట్టిన మహ్మద్ సిరాజ్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. సిరాజ్‌ను కొత్త బంతితో ఎదుర్కొవటం బంగ్లా టాప్ ఆర్డర్‌కు కఠిన సవాల్ కానుంది. స్పిన్నర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లకు కుల్దీప్ యాదవ్ జత కలువనున్నాడు. 0-2తో సిరీస్‌ను చేజార్చుకున్న భారత్.. నేడు ఊరట విజయం సాధించటంపై దృష్టి సారించింది. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై భారీ స్కోర్లపై బ్యాటర్లు కన్నేశారు.
క్లీన్‌స్వీప్‌పై బంగ్లా గురి
2015లో భారత్‌పై వన్డే సిరీస్ నెగ్గిన బంగ్లా.. 2022లో మళ్లీ ఆ ప్రదర్శన పునరావృతం చేసింది. స్వదేశంలో వరుస వన్డే సిరీస్‌లను గెల్చుకుని సొంతగడ్డపై బలాన్ని చాటుకుంది. రెగ్యులర్ కెప్టెన్ టస్కిన్ అహ్మద్ సేవలు లేకపోయినా.. లిటన్ దాస్ సారథ్యంలో బంగ్లా మెరుపు విజయాలు నమోదు చేసింది. సిరీస్ సాధించినా.. బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్ ఆకట్టుకోలేదు. రెండు వన్డేల్లోనూ భారత బౌలర్లకు టాప్ ఆర్డర్ దాసోహం అయ్యింది. చివర్లో మెహది హసన్ మిరాజ్ అసమాన బ్యాటింగ్ విన్యాసాలు బంగ్లాదేశ్‌కు వన్డే సిరీస్‌ను కట్టబెట్టాయి. ఒత్తిడి లేని బంగ్లాదేశ్ నేడు స్వేచ్ఛగా ఆడటంపై దృష్టి పెట్టనుంది. కెప్టెన్ లిటన్ దాస్, షకిబ్ అల్ హసన్, మహ్మదుల్లా, ముష్ఫీకర్ రహీంలు మెరిస్తే భారీ స్కోరు పెద్ద కష్టం కాదు. అనాముల్ హాక్, నజ్ముల్ శాంటోలు తమదైన ముద్ర వేసేందుకు ఎదురుచూస్తున్నారు. ఎబాడాట్ హోస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్, నసుం అహ్మద్, మిరాజ్‌లతో కూడిన బౌలింగ్ బృందం ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. బ్యాటింగ్ పిచ్‌పై భారత బ్యాటర్లను ఏ మేరకు నిలువరిస్తారనేది ఆసక్తికరం.
పిచ్, వాతావరణం
మీర్పూర్ పిచ్ బౌలర్లకు సహకరించటంలో ఎప్పుడూ ముందుంటుంది. చిట్టగాంగ్‌లో అందుకు భిన్నం. ఇక్కడ బ్యాటింగ్ అనుకూల పిచ్ సిద్ధంగా ఉంది. వన్డేల్లో సహజంగానే భారీ స్కోర్లు నమోదవుతాయి. మూడో వన్డేకు ఫ్లాట్ పిచ్‌ను ఆశించవచ్చు. వాతావరణం సైతం ఆహ్లాదకరంగా ఉండనుంది. ఎటువంటి వర్ష సూచనలు లేవు. టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది.
తుది జట్లు (అంచనా)
భారత్ : శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.
బంగ్లాదేశ్ : లిటన్ దాస్ (కెప్టెన్), అనాముల్ హాక్, నజ్ముల్ హోస్సేన్, షకిబ్ అల్ హసన్, ముష్ఫీకర్ రహీం (వికెట్ కీపర్), మహ్మదుల్లా, అఫిఫ్ హోస్సేన్, మెహిది హసన్ మిరాజ్, నసుం అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఎబాడాట్ హోస్సేన్.