Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫిఫా ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ నిలకడగా కీలక మ్యాచుల్లో పరాజయం చవిచూస్తోంది. 1966 తర్వాత మళ్లీ ఫైనల్లో ఆడేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టే కనిపించిన ఇంగ్లాండ్.. క్వార్టర్ఫైనల్లో అనూహ్య ఓటమి చెందింది. బలమైన ఫ్రాన్స్‌పై ఆకట్టుకునే ప్రదర్శన చేసినా మూడు సింహాల కథ క్వార్టర్ఫైనల్లోనే ముగిసింది. 2-1తో గెలుపొందిన ఫ్రాన్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మొరాకో, ఫ్రాన్స్ ఫైనల్లో బెర్త్ కోసం తలపడనున్నాయి.
- పోరాడి ఓడిన ఇంగ్లాండ్
- సెమీస్‌లో ఫ్రాన్స్ ప్రవేశం
- 2022 ఫిఫా ప్రపంచకప్
నవతెలంగాణ-అల్ఖోర్
డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. ఆరేలిన్, ఒలీవర్ జిరూడ్ మెరుపు గోల్స్‌తో 2-1తో ఇంగ్లాండ్‌పై సాధికారిక విజయం నమోదు చేసింది. ఇంగ్లాండ్‌పై విజయంతో ఏడోసారి ఫిఫా ప్రపంచకప్ సెమీఫైనల్లోకి చేరుకుంది ఫ్రాన్స్. ఇక మంచి ప్రదర్శన చేసినా ఇంగ్లాండ్ క్వార్టర్ఫైనల్లో పరాజయం పాలైంది. రికార్డు స్థాయిలో ఏడోసారి క్వార్టర్ఫైనల్లోనే ఫిఫా ప్రపంచకప్ రేసును ముగించింది. ఇంగ్లాండ్ కెప్టెన్, స్టార్ స్ట్రయికర్ హ్యారీకేన్ పెనాల్టీ గోల్‌తో మెరిసినా.. కీలక సమయంలో మరో పెనాల్టీ కిక్‌ను వృథా చేసి మూడు సింహాల ఆశలపై నీళ్లుచల్లాడు.
హలో ఫ్రాన్స్.. చలో సెమీస్ : స్టార్ స్ట్రయికర్ కరీం బెంజమా సేవలు లేకుండానే ఖతార్‌కు చేరుకున్న ఫ్రాన్స్ టైటిల్ నిలబెట్టుకునే ప్రదర్శన కొనసాగిస్తోంది. వరుసగా రెండోసారి సెమీఫైనల్లోకి చేరుకున్న ఫ్రాన్స్ నిజానికి క్వార్టర్స్‌లో ఇంగ్లాండ్ ఆశించిన ఆధిపత్యం చూపించలేకపోయింది. ఇంగ్లాండ్ డిఫెన్స్ బలహీనతలను ఫ్రాన్స్ సొమ్ము చేసుకుంటుందనే అంచనా ఉన్నప్పటికీ.. త్రీ లయన్స్ మంచి ప్రదర్శన చేసింది. సూపర్ ఫామ్‌లో ఉన్న స్ట్రయికర్ కలియన్ ఎంబాపెను గొప్పగా నిలువరించింది. మ్యాచ్‌లో 58 శాతం బంతిని నియంత్రించింది. పాస్ కచ్చితత్వంలోనూ ఫ్రాన్స్ కంటే మెరుగ్గానే నిలిచింది. గోల్ అవకాశాలను సృష్టించుకోవటంలో సైతం ఇంగ్లాండ్ అద్భుతంగా ఆడింది. కానీ, ఫ్రాన్స్ గోల్‌కీపర్ హ్యూగో లోరిస్ కండ్లుచెదిరే డిఫెన్స్‌తో ఇంగ్లాండ్ గోల్ అవకాశాలను చేజార్చుకుంది. గోల్‌కు ఏకంగా 8 సార్లు చేరువైన ఇంగ్లాండ్‌కు హ్యూగో చెక్ పెట్టాడు. ఇక మ్యాచ్ ఆరంభమైన 17వ నిమిషంలోనే ఇంగ్లాండ్ బాక్స్‌లో చెలరేగాడు ఆరేలిన్. పెనాల్టీ బాక్స్‌కు ఆవలగా నిలిచిన ఆరేలిన్ 30 అడుగుల దూరం నుంచి బంతిని గోల్ పోస్ట్‌లోకి తన్నాడు. దీంతో ఫ్రాన్స్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ప్రథమార్థం ముగిసేసరికి ఫ్రాన్స్ ముందంజలో నిలిచింది.
ద్వితీయార్థం ఆరంభంలోనే ఇంగ్లాండ్‌కు మంచి అవకాశం దక్కింది. ఆరేలిన్ బాక్స్ లోపల సకాకు ఫౌల్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్‌కు పెనాల్టీ కిక్ లభించింది. కెప్టెన్ హ్యరీకేన్ ఒడుపుగా బంతిని గోల్‌పోస్ట్‌లోకి తన్నేశాడు. దీంతో స్కోరు 1-1తో సమమైంది. కానీ నిమిషాల వ్యవధిలోనే ఫ్రాన్స్ మళ్లీ ఆధిక్యం సాధించింది. 78వ నిమిషంలో ఒలీవర్ జిరూడ్ ఇంగ్లాండ్ గోల్‌పోస్ట్ ముంగిట నిలిచి మెరుపు వేగంతో హెడర్ కిక్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. 84వ నిమిషంలో ఇంగ్లాండ్‌కు మరో అద్భుత అవకాశం చిక్కింది. ఇంగ్లాండ్ తరఫున అత్యధిక గోల్స్ కొట్టిన రికార్డుకు గోల్ దూరంలో నిలిచిన పెనాల్టీ కిక్ స్పెషలిస్ట్ హ్యారీకేన్ త్రీ లయన్స్ అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాడు. క్రాస్‌బార్ మీదుగా బంతి వెళ్లటంతో ఇంగ్లాండ్ అభిమానుల హృదయాలు బరువెక్కాయి. పెనాల్టీ కిక్ మిస్ చేసిన పశ్చాత్తాపంతో హ్యారీకేన్ సైతం కుంగిపోయినట్టే కనిపించాడు. ఆ తర్వాత బాక్స్‌లోపల జాగ్రత్త వహించిన ఫ్రాన్స్ 90 నిమిషాల పూర్తి ఆట ముగిసే వరకు ఆధిక్యం నిలుపుకుంది. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ సెమీఫైనల్లోకి చేరుకుంది. 1982, 1986 ప్రపంచకప్‌లలో వరుసగా సెమీస్‌కు చేరిన ఫ్రాన్స్..మళ్లీ ఇప్పుడు ఆ ప్రదర్శన పునరావృతం చేసింది. ఆఫ్రికా సంచలనం, అరబ్ ప్రపంచం ఆశల స్వప్నం మొరాకోతో ఫ్రాన్స్ సెమీఫైనల్లో తలపడనుంది.
ఇంత భారంగానా?! : ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్‌ఫైనల్స్‌లో పరాజయం ఇంగ్లాండ్‌కు కొత్త కాదు. గతంలోనూ చాలా పర్యాయాలు (7) సెమీస్‌కు చేరడానికి ముందే చేష్టలుడిగింది. గత ఆరు పరాజయాలకు ఇంగ్లాండ్ ప్రదర్శన, అవకాశాల కల్పనలో డొల్లతనం కారణమై ఉండొచ్చు. కానీ తాజాగా ఫ్రాన్స్ చేతిలో పరాజయం ఆ కోవలోకి రాదు. ఇంగ్లాండ్ అభిమానులు కన్నీటి పర్యంతమైన ఈ ఓటమిలో.. మూడు సింహాలు ముప్పేట దాడి చేశాయి. మ్యాచ్‌కు ముందు కిలియన్ ఎంబాపెపైనే ప్రధానంగా చర్చ నడిచింది. ఎంబాపెకు ఇంగ్లాండ్ సమర్థవంతంగా చెక్ పెట్టింది. బలమైన ఫ్రాన్స్ నుంచి బంతి సైతం లాగేసుకుంది. గోల్ కోసం చేయవలసిన ప్రయత్నాలు చేసేసింది. అయినా, మూడు సింహాలు మురవలేకపోయింది. చీఫ్ కోచ్ సౌత్‌గేట్ నుంచి సైతం పెద్దగా తప్పుపట్టలేని స్థితి. హ్యారీకేన్ పెనాల్టీ కిక్ గోల్‌గా మలిస్తే.. మ్యాచ్ ఫలితం పూర్తి భిన్నంగా ఉండేదేమో. ఫ్రాన్స్ తరఫున వెటరన్ ఆటగాళ్లు గ్రిజ్‌మాన్, జిరూడ్లు బాధ్యత తీసుకున్నారు. మిడిల్లో గ్రిజ్మ్యాన్ బంతిని అదుపు చేశాడు. గ్రిజ్మ్యాన్ నైపుణ్యంతో బాక్స్‌లోపల జిరూడ్ అవకాశాలను సృష్టించుకున్నాడు. ఫలితంగా, రెండు ఫీల్డ్ గోల్స్‌తో ఫ్రాన్స్ ముందంజ వేసింది. ఓడినా.. ఇంగ్లాండ్ సైతం గొప్ప ప్రదర్శన చేసింది.