Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విచారణ చేపట్టనున్న ఫిఫా
దోహా (ఖతార్) : టైటిల్ ఫేవరేట్, రెండుసార్లు చాంపియన్ అర్జెంటీనాపై ఫిఫా క్రమశిక్షణ ఉల్లంఘన అభియోగాలు మోపింది. నెదర్లాండ్స్, అర్జెంటీనా క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో చోటుచేసుకున్న బాహాబాహీ సన్నివేశాలను ఫిఫా సీరియస్‌గా పరిగణించింది. 90 నిమిషాల పూర్తి ఆట ముగిసే సమయానికి ముందు నెదర్లాండ్స్‌కు ఫ్రీ కిక్ ఇవ్వడాన్ని అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ తీవ్రంగా వ్యతిరేకించాడు. మ్యాచ్ రిఫరీపై ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు. ఆరెంజ్ ఆర్మీ ఆటగాళ్లు సైతం భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోలేకపోయారు. దీంతో అర్జెంటీనా, నెదర్లాండ్స్ క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో ఏకంగా 18 ఎల్లో కార్డులు అందించాల్సి వచ్చింది. ప్రపంచకప్ మ్యాచ్‌లో ఎల్లో కార్డుల పరంగా ఇదో రికార్డు. డచ్ ఆటగాడు డెంజల్ రెండు ఎల్లో కార్డులతో మైదానానికి సైతం దూరమయ్యాడు. ఫిఫా నిబంధనలు ఆర్టికల్ 12 (ఆటగాళ్లు, సిబ్బంది దురుసు ప్రవర్తన), ఆర్టికల్ 16 (ఆర్డర్ అండ్ సెక్యూరిటీ) ప్రకారం అర్జెంటీనాపై అభియోగాలు మోపింది. క్రమశిక్షణ కమిటీ ఈ అభియోగాలపై విచారణ జరిపి అందుకు అనుగుణంగా చర్యలు, శిక్షలు విధించనుంది. నెదర్లాండ్స్ జట్టుపై సైతం ఆర్టికల్ 12 ప్రకారం క్రమశిక్షణ కమిటీ విచారణ జరుపనుందని ఫిఫా అధికారులు వెల్లడించారు.