Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్జెంటీనా, క్రోయేషియా సెమీస్ నేడు
- రాత్రి 12.30 నుంచి ఆరంభం
- ఫిఫా ప్రపంచకప్
ఫిఫా ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. టైటిల్ రేసులో 32 జట్ల నుంచి నాలుగు జట్లు మాత్రమే నిలిచాయి. రెండుసార్లు
చాంపియన్ అర్జెంటీనాతో 2018 రన్నరప్ క్రోయేషియా సెమీఫైనల్లో తలపడేందుకు సిద్ధమైంది. ప్రపంచకప్ సెమీఫైనల్లో ఓటమెరుగని అర్జెంటీనా ఫైనల్లో తొలి అడుగు వేయటం లాంఛనమేనా? క్రోయేషియా మరోసారి పెనాల్టీ షూటౌట్‌తో దక్షిణ అమెరికా అభిమానులకు షాక్ ఇస్తుందా? ఆసక్తికరం.
నవతెలంగాణ-దోహా
ఖతార్‌లో ఫిఫా ప్రపంచకప్ ఆది నుంచి సంచలనాలకు కేంద్రమే. ఖతార్‌కు ఫిఫా ప్రపంచకప్ ఆతిథ్య హక్కులు కట్టబెట్టడంతో మొదలైన సంచలనాల మోత.. క్వార్టర్‌ఫైనల్స్ వరకు కొనసాగుతూ వచ్చింది. క్రోయేషియా, మొరాకోలు ఎవరూ ఊహించని సెమీఫైనలి స్ట్లు. అర్జెంటీనా, ఫ్రాన్స్ అందరూ అంచనా వేసిన సెమీఫైనల్ జట్లు. సంచలన ఫలితాలు క్వార్టర్ఫైనల్స్తోనే ముగిసినట్టా? సెమీఫైన ల్లోనూ అదే పునరావృతం అవుతుందా? చూడాలి. తొలి సెమీఫైనల్లో భాగంగా నేడు (రాత్రి 12.30) అర్జెంటీనా, క్రోయేషియా తలపడనున్నాయి. 2018 రన్నరప్‌గా నిలిచిన క్రోయేషియా.. వరుస ప్రపంచకప్‌లో ఫైనల్స్‌కు చేరిన నాల్గో యూరోపియన్ జట్టుగా నిలిచేం దుకు ఉర్రూతలూగుతోంది. ఇటలీ (1934, 1938), నెదర్లాండ్స్ (1974, 1978), జర్మనీ (1982, 1986, 1990) వరుస ప్రపంచకప్‌లో సెమీఫైనల్స్‌కు చేరుకున్న యూరోపియన్ జట్ల సరసన నిలిచేందుకు క్రోయేషియా ఎదురు చూస్తోంది. ఇక ఫిఫా ప్రపంచకప్ సెమీఫైనల్ దశలో ఓటమెరుగని జట్టు అర్జెంటీనా. ఇప్పటివరకు ఐదు సెమీఫైనల్స్ ఆడిన అర్జెంటీనా అన్నింటా విజయాలు నమోదు చేసింది. సూపర్‌స్టార్ లియోనల్ మెస్సి మేనియాలో అర్జెంటీనా మరో టైటిల్ పోరుకు చేరటం లాంఛనమే అనిపిస్తోంది. ప్రపంచకప్‌లో అర్జెం టీనా, క్రోయేషియా తలపడటం ఇది మూడోసారి కానుంది. 1998 ప్రపంచకప్‌లో అర్జెంటీనా 1-0తో, 2018 ప్రపంచకప్‌లో క్రోయే షియా 3-0తో విజయాలు సాధిం చాయి. నాకౌట్ దశలో తలపడ నుండటం మాత్రం ఇదే ప్రథమం.
మెస్సికి ఎదురుందా?!
ప్రపంచ ఫుట్‌బాల్‌లో మకుటం లేని మహరాజు లియోనల్ మెస్సి. కెరీర్ 1000 మ్యాచుల్లో అతడు సాధించిన గణాంకాలు మాత్రమే కాదు మైదానంలో అతడు చేసిన విన్యాసాలు అందుకు నిదర్శనం. డీగో మారడోనా తరహాలో ఫిఫా ప్రపంచకప్ విజయం మెస్సి ఖాతాలో లేదని కొందరు వాదిస్తున్నారు. ఆ వాదనకు చెక్ పెట్టేందుకు మెస్సి ముంగిట మరో సువర్ణావకాశం. సహచరులు మంచి ఫామ్‌లో ఉండటం, తనూ మెరుపు వేగంతో దూసుకెళ్లటం మెస్సికి అనుకూలతలు. ప్రత్యర్థి ఆటగాళ్లు మెస్సిని టార్గెట్ చేసి నిలువరించినా.. చాకచక్యంగా గోల్ అవకాశాలను సృష్టిస్తూ జట్టును ముందుకు నడిపించటం ఇటీవల కాలంలో మెస్సి శైలిగా మారింది. నెదర్లాండ్స్‌తో క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా తొలి గోల్ కోసం లియోనల్ మెస్సి అందించిన పాస్ ప్రపంచకప్‌లోనే చెప్పుకోదగిన సన్నివేశం. అర్జెంటీనా ఫుల్ బ్యాక్స్ గాంజాలో మోనిటెల్, మార్కోస్ అకునాలు నేడు సెమీస్‌కు అందుబాటులో ఉండటం లేదు. ప్రీ క్వార్టర్స్‌లో ఎల్లో కార్డ్, డచ్‌పై ఎల్లో కార్డ్ ఫలితంగా ఫిఫా నిబంధనల ప్రకారం ఫైనల్ పోరుకు దూరమయ్యారు. గోల్‌కీపర్ ఎమిలియానో మార్టినెజ్ క్వార్టర్స్‌లో హీరోగా నిలిచాడు. క్రోయేషియాపై పెనాల్టీలను నిలువరించటం మార్టినెజ్‌కు కఠిన పరీక్ష కానుంది. బంతిని డ్రిబ్లింగ్ చేసుకుంటూ, ప్రత్యర్థి ఆటగాళ్లను తప్పిస్తూ, మెరుపు వేగంతో దూసుకెళ్లే లియోనల్ మెస్సీ నేడు అర్జెంటీనాను సెమీఫైనల్ ఫేవరేట్‌గా నిలుపుతున్నాడు.
క్రోయేషియా కొట్టగలదా?!
2018 రన్నరప్ క్రోయేషియా. ఖతార్‌లో క్రోయేషియా ఇంత దూరం వస్తుందని సాకర్ పండి తులు ఎవరూ అంచనా వేయలేదు. క్వార్టర్ఫైనల్లో బ్రెజిల్‌పై ఆ జట్టు సాధిం చిన విజయాన్ని క్రోయే షియా అభిమానులు సైతం ఊహించలేదేమో!. 37 ఏండ్ల వయసులో లూకా మోద్రిచ్ మైదానంలో మాయ చేస్తున్నాడు. నాలు గేండ్ల క్రితం రష్యాలో అర్జెంటీనాపై భారీ విజయం నమోదు చేసిన క్రోయే షియా నేడు అదే ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. అయితే, క్రోయేషియా డిఫెన్స్ లైన్ అత్యంత క్రమశిక్షణ పాటి స్తేనే లియోనల్ మెస్సి మాయ నుంచి తప్పించు కోగలరు. మెరుపు వేగంతో గోల్ చేయగల సమర్థుడు మెస్సి. అతడిని కవ్వించినా, అతడి పట్ల ఏమరుపాటుగా ఉన్నా.. క్షణాల్లో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. 90 నిమిషాల ఆటలో క్రోయేషియాను ఫేవరేట్ అనలేం. కానీ సెమీస్ ఫలితం పెనాల్టీ షూటౌట్లో తేల్చాల్చి వస్తే అప్పుడు క్రోయేషియా అవకాశాలను ఎవరూ కొట్టిపారేయలేరు. ఆ జట్టు గోల్‌కీపర్ డొమినిక్ లైవాకోవిక్ బ్రెజిల్ ఎటాకర్లను గొప్పగా నిలువరించాడు. కిక్‌లను అంచనా వేసిన డొమినిక్ క్రోయేషియాను సెమీఫైనల్లో నిలబెట్టాడు. క్రోయేషియాను తక్కువ అంచనా వేసిన ప్రతిసారి ఆ జట్టు అద్భుతాలు చేస్తూనే ఉంది. కానీ లియోనల్ మెస్సి కెరీర్ చివర్లో మొక్కవోని పట్టుదలతో ఫిఫా ప్రపంచకప్ దీక్షలో ఉన్నాడు. అతడిని దాటి ఫైనల్స్‌కు చేరుకోవటం క్రోయేషియాకు అనుకున్నంత సులువు కాదు.