Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొరాకోపై 2-1తో ఘన విజయం
ఫిఫా 2022 ప్రపంచకప్
దోహా (ఖతార్): ఫిఫా ప్రపంచకప్‌లో క్రోయేషియాదే మూడు మురిపెం. మూడో స్థానం కోసం జరిగిన పోరులో మొరాకోపై క్రోయేషియా 2-1తో ఘన విజయం సాధించింది. ఫిఫా ప్రపంచకప్‌ను మూడో స్థానంతో ముగించింది. ఫిఫా ప్రపంచకప్ సెమీఫైనల్‌కు చేరుకున్న తొలి ఆఫ్రికా, అరబ్ జట్టుగా చరిత్ర సృష్టించిన మొరాకో నాల్గో స్థానంతో ఖతార్ నుంచి నిష్క్రమించింది. ఆట ఆరంభమైన తొలి పది నిమిషాల్లోనే ఇరు జట్లు గోల్ కొట్టడంతో అభిమానుల్లో ఆసక్తి రెట్టింపు అయ్యింది. 7వ నిమిషంలోనే క్రోయేషియా ఆటగాడు జోస్కో వార్డియోల్ గోల్ కొట్టాడు. పెరిసిక్ నుంచి అందించిన పాస్‌ను మొరాకో డిఫెన్స్‌ను ఛేదిస్తూ గోల్‌గా మలిచాడు. రెండు నిమిషాల వ్యవధిలోనే మొరాకో స్కోరు సమం చేసింది. ఎదురుదాడి చేసిన మొరాకో 9వ నిమిషంలో గోల్ కొట్టింది. అచార్ఫ్ డరి సోలో గోల్‌తో 1-1తో మొరాకోను రేసులోకి తీసుకొచ్చాడు. ప్రథమార్థం ముగియడానికి నిమిషాల ముంగిట క్రోయేషియా మరో గోల్‌తో మెరిసింది. 42వ నిమిషంలో లివాజ నుంచి పాస్ అందుకున్న ఒర్సిక్ మెరుపు గోల్ కొట్టాడు. 2-1తో ప్రథమార్థంలో ఆధిక్యం సాధించిన క్రోయేషియా.. ద్వితీయార్థంలో గోల్ ఇవ్వలేదు, కొట్టలేదు. దీంతో 90 నిమిషాల ఆట అనంతరం 2-1తో క్రోయేషియా విజయం సాధించింది. 2018 ఫిఫా ప్రపంచకప్‌ను రెండో స్థానంతో ముగించిన క్రోయేషియా.. నాలుగేండ్ల తర్వాత మూడో స్థానం దక్కించుకుంది. ఫిఫా ప్రపంచకప్‌లో సగటున మ్యాచ్‌లో 31 శాతం బంతిని నియంత్రించిన మొరాకో.. అసమాన విజయాలు సాధించింది. కానీ, ఫ్రాన్స్‌పై 61 శాతం, క్రోయేషియాపై 49 శాతం బంతిని నియంత్రించినా పరాజయం తప్పలేదు.