Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిఫా ప్రపంచకప్ అర్జెంటీనా వశం
- ఫైనల్లో ఫ్రాన్స్‌పై ఉద్విగ విజయం
- పెనాల్టీ షూటౌట్లో 4-2తో ఘన విజయం
ఆరంభం అర్జెంటీనా జోరుతో ఏకపక్షం. ముగింపులో ఎంబాపె మెరుపుల్. అదనపు సమయంలోనూ ఇదే తంతు. మెస్సి మాయతో అర్జెంటీనా ముందంజ వేయగా.. ఎంబాపె మళ్లీ స్కోరు సమం చేశాడు. నరాలు తెగే ఉత్కంఠతో సాగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో లియోనల్ మెస్సి ఎట్టకేలకు ఫిఫా కప్పుకు ముద్దు పెట్టాడు. పెనాల్టీ షూటౌట్‌తో ఫలితం తేలిన ఫైనల్లో అర్జెంటీనా 4-2తో ఉద్విగ విజయం సాధించింది. 90 నిమిషాల అనంతరం 2-2, 120 నిమిషాల అనంతరం 3-3తో అర్జెంటీనా, ఫ్రాన్స్ సమవుజ్జీలుగా నిలిచాయి. మెస్సి రెండు గోల్స్‌తో మాయ చేయగా, ఎంబాపె మూడో గోల్స్‌తో ఫ్రాన్స్ ఆశలను చివరి వరకు నిలిపాడు. అర్జెంటీనా మూడోసారి ప్రపంచకప్ విజేతగా అవతరించింది.
ఓ యోధుడి స్వప్నం సాకారమైంది. లియోనల్ మెస్సి మాయతో అర్జెంటీనా మురిసింది. రెండు గోల్స్‌తో అదరగొట్టిన సాకర్ దిగ్గజం అర్జెంటీనా 36 ఏండ్ల ఫిఫా ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించాడు. ఆరంభ మ్యాచ్‌లో సౌదే అరేబియా చేతిలో అనూహ్య పరాజయం నుంచి జట్టును ముందుండి నడిపించిన లియోనల్ మెస్సి.. అత్యంత నాటకీయంగా సాగిన టైటిల్ పోరులో అర్జెంటీనాకు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టాడు. 1978, 1986 అనంతరం అర్జెంటీనాను 2022 ఫిఫా ప్రపంచకప్ చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన అత్యంత ఉత్కంఠ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌పై మెస్సిసేన పెనాల్టీ షూటౌట్లో 4-2తో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో ఏకంగా రెండు సార్లు వెనుకంజలో నిలిచినా అసమాన ప్రదర్శనతో సమవుజ్జీగా నిలిచిన ఫ్రాన్స్ పెనాల్టీ షూటౌట్లో తేలిపోయింది. ఫ్రాన్స్ స్టార్ స్ట్రయికర్ కిలియన్ ఎంబాపె హ్యాట్రిక్ గోల్స్‌తో సంచలన ప్రదర్శన చేసినా.. లియోనల్ మెస్సి మాయను మరిపించేందుకు ఆ ఘనత సరిపోలేదు!. 90 నిమిషాల ఆట అనంతరం అర్జెంటీనా, ఫ్రాన్స్ 2-2తో, 120 నిమిషాల ఆట అనంతరం 3-3 సమవుజ్జీలుగా నిలిచాయి. దీంతో టైటిల్ విజేతను పెనాల్టీ షూటౌట్ ద్వారా తేల్చారు.
మెస్సి..మెస్సి..మెస్సి! : లుసైల్ స్టేడియం మెస్సి మాయలో పడిపోయింది. కెరీర్లో రెండోసారి ప్రపంచకప్ ఫైనల్ ఆడిన మెస్సి చివరి వరల్డ్‌కప్ మ్యాచ్‌లో వండర్ఫుల్ గోల్స్ కొట్టాడు. ఓ పెనాల్టీ గోల్ సహా అదనపు సమయంలో కండ్లుచెదిరే గోల్‌తో అభిమానులను ఉర్రూతలూగించాడు. మెస్సి గోల్ కొట్టిన ప్రతిసారి అర్జెంటీనా కప్పు కొట్టినట్టే అనిపించింది. ప్రత్యర్థి రేసులోకి దూసుకొచ్చినా మెస్సి చెదరలేదు. నాల్గో ప్రపంచకప్ ఆడుతున్న మెస్సి కెరీర్లో తొలిసారి గ్రూప్ దశ, ప్రీ క్వార్టర్స్, క్వార్టర్స్, సెమీఫైనల్, ఫైనల్లో గోల్స్ కొట్టాడు. ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగా మారియో (6)ను మెస్సి (7) అధిగమించాడు. 1986లో డీగో మారడోనా అర్జెంటీనాను విజయ పథాన నడిపించిన తరహాలోనే 2022లో లియోనల్ మెస్సి ఆ జట్టును విజేతగా నిలిపాడు. అర్జెంటీనా మూడోసారి ప్రపంచకప్ విజేతగా నిలిచినా.. ఇది లియోనల్ మెస్సి ప్రపంచకప్ విజయంగానే చరిత్రలో మిగిలిపోనుంది!.
నవతెలంగాణ-దోహా
లియోనల్ మెస్సి సాధించాడు. అర్జెంటీనా అనుకున్నది సాధించింది. ఫుట్‌బాల్ దిగ్గజం ఎట్టకేలకు అత్యుత్తమ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం దోహాలోని లుసైల్ స్టేడియంలో జరిగిన 2022 ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌పై అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో విజయం సాధించింది. పెనాల్టీ షూటౌట్లో అర్జెంటీనా తరఫున మెస్సి, డిబాల, లియాండ్రో, మోనిటెల్ గోల్స్ కొట్టగా.. ఫ్రాన్స్ తరఫున ఎంబాపె, మువాని మాత్రమే మెరిశారు. షూటౌట్లో 4-2తో అర్జెంటీనా గెలుపొందింది. లియోనల్ మెస్సి (23, 108వ నిమిషం), ఎంజెలో డీ మారియో (36వ నిమిషం) గోల్స్ కొట్టగా.. ఫ్రాన్స్‌కు కిలియన్ ఎంబాపె (80, 81, 118వ నిమిషం) హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. ఎనిమిది గోల్స్‌తో మెరిసిన ఎంబాపె గోల్డెన్ బూట్ సాధించగా, మెస్సి గోల్డెన్ బాల్ అందుకున్నాడు. గోల్డెన్ గ్లౌవ్స్ మార్టినెజ్ (అర్జెంటీనా), ఉత్తమ యువ ఆటగాడిగా ఫెర్నాండేజ్ (అర్జెంటీనా) నిలిచింది.
మెస్సి మ్యాజిక్
ప్రథమార్థంలో ఫ్రాన్స్ బంతిపై నియంత్రణ కోల్పోయి ఏం చేయాలో తోచని దుస్థితికి చేరుకుంది. 23వ నిమిషంలో కార్నర్ నుంచి బంతితో బాక్స్‌లోకి వచ్చిన ఎంజెలో డీ మారియోను ఉస్మాన్ డెంబెలె అడ్డగించి పెనాల్టీకి కారణమయ్యాడు. డి మారియో సాధించిన పెనాల్టీ కిక్‌ను కెప్టెన్ లియోనల్ మెస్సి గొప్పగా వినియోగించుకున్నాడు. చిన్నపాటి రనౌప్తో బంతిని చేరుకున్న మెస్సి.. ఫ్రాన్స్ గోల్‌కీపర్ లోరిస్ కదలికలను పరిశీలించి లెఫ్ట్ కిక్‌తో తన్నాడు. కుడివైపు కార్నర్‌కు డైవ్ చేసిన లోరిస్.. ఎడమ వైపు కార్నర్లో మెస్సికి గోల్ సమర్పించుకున్నాడు. ఈ గోల్‌తో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన అర్జెంటానా దూకుడుకు మరింత పదును పెట్టింది. 36వ నిమిషంలో ఆ జట్టు అద్వితీయ గోల్‌తో మెరిసింది. సమిష్టిగా బంతిని ఫ్రాన్స్ బాక్స్లోపలకు తీసుకొచ్చిన అర్జెంటీనా గోల్ కిక్ అవకాశం ఎంజెలో డీ మారియోకు అందించింది. ఫ్రాన్స్ డిఫెండర్లను తప్పిస్తూ లియోనల్ మెస్సి బంతిని అలెక్సిస్ మాక్ అలిస్టర్‌కు పాస్ చేశాడు. ఇక్కడే అలిస్టర్ మ్యాజిక్ చేశాడు. గోల్ పోస్ట్‌పై కిక్కు తనకు అవకాశం ఉన్నప్పటికీ బంతిని కుడి వైపున దూసుకొస్తున్న ఎంజెలో డీ మారియోకు అప్పగించాడు. ఫ్రాన్స్ గోల్‌కీపర్ లోరిస్‌ను బోల్తా కొట్టిస్తూ డి మారియో మెరుపు గోల్ నమోదు చేశాడు. అర్జెంటీనాను 2-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. తొలి అర్థ భాగం ఆటను మరో ఏడు నిమిషాలు పొడగించినా.. అక్కడా అర్జెంటీనా ఆధిపత్యం చెలాయించింది. ప్రథమార్థాన్ని స్పష్టమైన విన్నర్‌గా ముగించింది.
ఎంబాపె సంచలనం
ద్వితీయార్థం ఆటలోనూ ఫ్రాన్స్ పెద్దగా మెరుగవ్వలేదు. కానీ ఆ జట్టు రెండు నిమిషాల్లో రెండు గోల్స్‌తో అదరగొట్టింది. 80వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను మార్టినెజ్‌ను దాటుకుంటూ బంతిని గోల్ పోస్ట్‌లోకి తన్నాడు. 81వ నిమిషంలో మిడిల్ నుంచి బంతి అందుకున్న ఎంబాపె.. బాక్స్ బయట నుంచి కుడి కాలు కిక్‌తో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించాడు. దీంతో 79వ నిమిషంలో 0-2 వెనుకంజలో నిలిచిన ఫ్రాన్స్.. 81వ నిమిషంలో 2-2తో స్కోరు సమం చేసింది. 90 నిమిషాల ఆట అనంతరం స్కోర్లు సమం కావటంతో మ్యాచ్ 30 నిమిషాల అదనపు సమయానికి దారితీసింది.
మెస్సి, ఎంబాపె అదుర్స్
30 నిమిషాల అదనపు సమయంలో ఇరు జట్ల స్టార్ స్ట్రయికర్లు అదరగొట్టారు. 108వ నిమిషంలో లియోనల్ మెస్సి సూపర్ గోల్‌తో అర్జెంటీనాను మరోసారి 3-2తో ఆధిక్యంలోకి నడిపించాడు. ఇక మరికొన్ని నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా అర్జెంటీనా ఆటగాడి చేతికి బంతి తగలటంతో ఫ్రాన్స్‌కు పెనాల్టీ కిక్ లభించింది. కిలియన్ ఎంబాపె మరోసారి బంతిని కుడివైపు కార్నర్‌కు తన్నేసి స్కోరు సమం చేశాడు. దీంతో మ్యాచ్ మరోసారి 3-3తో సమమైంది.