Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీనివాస్ దాస్ మంతటి
బ్యాటర్లు అందరు పెవిలియన్‌కు చేరారు. బంగ్లాదేశ్ చారిత్రక టెస్టు విజయం ముంగిట నిలిచింది. స్పిన్ అస్త్రంతో ప్రత్యర్థి మాయ చేస్తోంది. ఇటువంటి కఠిన సమయంలో తోడుగా రవిచంద్రన్ అశ్విన్. 28వ ఓవర్లో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌కు రాగా.. ఆశలన్నీ అయ్యర్‌పైనే నిలిపిన డ్రెస్సింగ్‌రూమ్ ఓటమి భయంతో వణికిపోయింది. క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఇవేవీ బ్యాటింగ్‌పై ప్రభావం చూపించకుండా జాగ్రత్త వహించాడు. మైదానంలో అత్యంత ప్రశాంతంగా ఉన్న వ్యక్తిగా కనిపించాడు శ్రేయస్. షకిబ్, తైజుల్, మిరాజ్ త్రయం స్పిన్ మాయ చేస్తుండగా.. బంతిని చూడటం, లెంగ్త్‌ను అంచనా వేయటం, రైట్ ఫార్వర్డ్ లేదా రైట్ బ్యాక్ దిశగా ఆడటం. పిచ్‌పై బంతి ఎంత టర్న్ తీసుకున్నా అయ్యర్ పరుగుల కోసమే ప్రతి బంతిని ఆడాడు. కానీ పరుగులు చేయాలనే తపనలో ఎక్కడా అవసరం లేని రిస్క్ తీసుకోలేదు. స్పిన్‌పై అత్యద్భుత ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్ ఢాకా టెస్టులో భారత్‌ను విజేతగా నిలిపాడు.
పరుగుల పరంగా అశ్విన్ (42) కంటే అయ్యర్ (29) పరుగులే చేశాడు. కానీ మ్యాచ్ గతిని నిర్దేశించిన ఇన్నింగ్స్ శ్రేయస్ అయ్యర్‌దే. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై అయ్యర్ శైలి ఒక పాఠం. బంతిని ఎదుర్కొనేందుకు అయ్యర్ పిచ్ దిశగా కిందకు ఉంటాడు. బంతి ఊహించని టర్న్ తీసుకునే వరకు ఎదురు చూస్తాడు. ఒకవేళ ఊహించని టర్న్ తీసుకుంటే తక్షణమే స్పందించేందుకు సిద్ధంగా ఉంటాడు. షార్ట్ లెంగ్త్ బంతులు ఎదురైతే శిక్షించేందుకు సైతం సదా సిద్దంగా ఉంటాడు. ఛేదనలో అయ్యర్ 46 బంతులు ఎదుర్కొన్నాడు. ఇందులో కేవలం 4 బంతులకు మాత్రమే అయ్యర్ కాస్త ఇబ్బంది పడ్డాడు. మిగతా 42 బంతులను అయ్యర్ అంచనా వేసి అనుకున్న రీతిలో ఆడాడు. ఇదే సమయంలో అశ్విన్ ఎదుర్కొన్న 62 బంతుల్లో 12 బంతులకు తడబాటుకు గురయ్యాడు. కాన్పూర్‌లో అరంగేట్ర టెస్టు నుంచీ స్పిన్‌పై అయ్యర్ తిరుగులేని రికార్డు సాధించాడు. పేస్ బౌలింగ్‌పై 42.48 సగటు కలిగిన శ్రేయస్.. స్పిన్ బౌలింగ్‌పై 68.67 సగటు సాధించాడు. దేశవాళీ క్రికెట్లో 4000కు పైగా ఫస్ట్‌క్లాస్ పరుగులు చేసిన శ్రేయస్ రంజీ ట్రోఫీలో ఎక్కువగా స్పిన్‌ను ఎదుర్కొన్నాడు. రంజీ ట్రోఫీలో విశేష అనుభవం టెస్టు క్రికెట్లో అయ్యర్ విజయవంతం కావడానికి దోహదం చేస్తుంది. విదేశీ గడ్డపై ఇంకా టెస్టు ఆడని శ్రేయస్.. అరంగేట్రం తర్వాత పంత్‌తో కలిసి స్పిన్‌పై ఎదురుదాడి చేసిన ఆటగాళ్లలో ముందంజలో కొనసాగుతున్నాడు.