Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢాకా టెస్టులో భారత్ మెరుపు విజయం
- 2-0తో టెస్టు సిరీస్ టీమ్ ఇండియా వశం
- బంగ్లాదేశ్‌కు తప్పని క్లీన్‌స్వీప్ పరాభవం
లక్ష్యం 145 పరుగులు. చేయాల్సింది మరో 100 పరుగులు. చేతిలో 6 వికెట్లు. ఉదయం సెషన్లో బంగ్లా స్పిన్ మాయతో 74/7తో ఓటమి కోరల్లో భారత్. ఈ దుస్థితిలో భారత్‌ను బయటపడేసే బ్యాటరే లేడనపించింది!. అశ్విన్ (42 నాటౌట్), అయ్యర్ (26 నాటౌట్) 71 పరుగుల విలువైన భాగస్వామ్యంతో అదరగొట్టారు. స్పిన్‌ను ఎలా ఆడాలో, ఎలా ఆపాలో చూపించిన అశ్విన్, అయ్యర్ జోడీ ఓటమి కోరల్లో నిలిచిన భారత్‌కు మెరుపు విజయాన్ని కట్టబెట్టారు. 3 వికెట్ల తేడాతో రెండో టెస్టులో గెలుపొందిన భారత్.. 2-0తో టెస్టు సిరీస్‌ను క్వీన్‌స్వీప్ చేసింది.
నవతెలంగాణ-ఢాకా
రవిచంద్రన్ అశ్విన్ (42 నాటౌట్, 62 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ అయ్యర్ (29 నాటౌట్, 46 బంతుల్లో 4 ఫోర్లు) అసమాన ప్రదర్శనతో బంగ్లాదేశ్‌పై రెండో టెస్టులో భారత్ 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 145 పరుగుల ఛేదనలో 74 పరుగులకే 7 వికెట్లు చేజార్చుకున్న భారత్ పరాజయం ప్రమాదంలో పడింది. ఈ పరిస్థితుల్లో భారత్ ఓటమి తప్పించుకోవటం అసాధ్యమే అనిపించింది. అశ్విన్, అయ్యర్ జోడీ ఎనిమిదో వికెట్‌కు అజేయంగా 71 పరుగులు జోడించింది. ఆతిథ్య బంగ్లాదేశ్‌కు క్లీన్‌స్వీప్ పరాభవం మిగిల్చింది. బంగ్లాదేశ్ స్పిన్నర్ మెహిది హసన్ మిరాజ్ (5/63) ఐదు వికెట్ల మాయ చేసినా.. అశ్విన్, అయ్యర్‌పై పైచేయి సాధించటంలో విఫలమయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలువగా, చతేశ్వర్ పుజారా 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డు అందుకున్నాడు. రెండు టెస్టుల సిరీస్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకుంది. వన్డే సిరీస్‌ను బంగ్లాదేశ్ 2-1తో గెలుపొందగా, టెస్టు సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంతో బంగ్లాదేశ్ పర్యటనను భారత్ విజయవంతంగా ముగించింది.
ఓటమి భయం! :
ఓవర్‌నైట్ స్కోరు 45/4తో నాల్గో రోజు ఛేదనకు వచ్చిన టీమ్ ఇండియాకు తొలి గంట కలిసిరాలేదు. అక్షర్ పటేల్ (34, 69 బంతుల్లో 4 ఫోర్లు), జైదేవ్ ఉనద్కత్ (13, 16 బంతుల్లో 1 సిక్స్)తో పాటు ధనాధన్ హిట్టర్ రిషబ్ పంత్ (9) డ్రింక్స్ విరామం లోపే పెవిలియన్‌కు చేరారు. నైట్‌వాచ్‌మన్ జైదేవ్ ఉనద్కత్‌ను షకిబ్ అవుట్ చేయగా.. ఫామ్‌లో ఉన్న బ్యాటర్ రిషబ్ పంత్ (9) వికెట్‌తో మెహిది హసన్ మిరాజ్ బంగ్లాదేశ్ శిబిరంలో ముందస్తు సంబురాలకు తెరతీశాడు. నిలదొక్కుకున్న అక్షర్ పటేల్ సైతం మెహిది హసన్‌కు దొరికిపోయాడు. 74 పరుగులకే 7 వికెట్లు చేజార్చుకున్న టీమ్ ఇండియా ఓటమి కోరల్లో నిలిచింది. టెస్టు క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ ఎన్నడూ భారత్‌పై ఐదు రోజుల ఆటలో విజయం సాధించలేదు. సొంతగడ్డపై బంగ్లాదేశ్ తొలిసారి భారత్‌పై టెస్టు విజయానికి అత్యంత చేరువగా నిలిచింది.
అశ్విన్, అయ్యర్ అదుర్స్ :
ఉదయం సెషన్ డ్రింక్స్ విరామానికి ముందు బంగ్లాదేశ్ జోరు చూపించగా.. డ్రింక్స్ విరామం అనంతరం భారత్ దూసుకెళ్లింది. శ్రేయస్ అయ్యర్ (29 నాటౌట్), రవిచంద్రన్ అశ్విన్ (42 నాటౌట్) అసమాన పోరాట పటిమ చూపించారు. స్పిన్ వలలో సహచర బ్యాటర్లు చిక్కుకోగా.. స్పిన్‌పై ఆత్మరక్షణ, ఎదురుదాడి ఎలా చేయాలో ఈ జోడీ చూపించింది. ప్రమాదకర బంగ్లా స్పిన్నర్లను గౌరవిస్తూనే వేగంగా పరుగులు పిండుకుంది. అశ్విన్ 4 బౌండరీలు, ఓ సిక్సర్‌తో మెరువగా.. అయ్యర్ నాలుగు బౌండరీలతో కదం తొక్కాడు. ఈ జోడీ వేగంగా పరుగులు చేయటంలో స్వల్ప లక్ష్యం అలా కరిగిపోయింది. 8వ వికెట్‌కు అజేయంగా 71 పరుగులు జోడించి బంగ్లాదేశ్ ఆశలను ఆవిరి చేసింది. ఐదు వికెట్ల మాయగాడు మెహిది హసన్ మిరాజ్ ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో ధనాధన్ దంచికొట్టిన అశ్విన్ లంచ్‌కు ముందే లాంఛనం ముగించాడు.
స్కోరు వివరాలు :
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ : 227/10
భారత్ తొలి ఇన్నింగ్స్ : 314/10
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ : 231/10
భారత్ రెండో ఇన్నింగ్స్ : గిల్ (స్టంప్డ్) నురుల్ హసన్ (బి) మెహిది హసన్ 7, కెఎల్ రాహుల్ (సి) నురుల్ హసన్ (బి) షకిబ్ 2, పుజారా (స్టంప్డ్) నురుల్ హసన్ (బి) మెహిది హసన్ 6, అక్షర్ (బి) మెహిది హసన్ 34, కోహ్లి (సి) మోమినుల్ (బి) మెహిది హసన్ 1, జైదేవ్ (ఎల్బీ) షకిబ్ 13, పంత్ (ఎల్బీ) మెహిది హసన్ 9, అయ్యర్ నాటౌట్ 29, అశ్విన్ నాటౌట్ 42, ఎక్స్‌ట్రాలు : 2, మొత్తం :(47 ఓవర్లలో 7 వికెట్లకు) 145.
వికెట్ల పతనం : 1-3, 2-12, 3-29, 4-37, 5-56, 6-71, 7-74.
బౌలింగ్ : షకిబ్ అల్ హసన్ 14-0-50-2, తైజుల్ ఇస్లాం 11-4-14-0, మెహిది హసన్ 19-4-63-5, టస్కిన్ అహ్మద్ 1-0-4-0, ఖలీద్ అహ్మద్ 1-0-12-0.