Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైనల్లో అనామికపై సాధికారిక విజయం
- 6వ ఎలైట్ మహిళల జాతీయ చాంపియన్‌షిప్స్
నవతెలంగాణ-భోపాల్ : ప్రపంచ చాంపియన్, తెలంగాణ సూపర్‌స్టార్ నిఖత్ జరీన్ మరో పసిడి పతకంపై పంచ్ విసిరింది. జాతీయ చాంపియన్‌గా టైటిల్‌ను నిలబెట్టుకుంది. భోపాల్‌లోని తాంతియా తోపే స్టేడియంలో జరిగిన 6వ ఎలైట్ మహిళల జాతీయ చాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించింది. వరల్డ్ చాంపియన్, పసిడి ఫేవరేట్ నిఖత్ జరీన్ దేశీయ రింగ్‌లో ఇటీవల కాలంలో ప్రత్యర్థులపై తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. కానీ సోమవారం నాడు జరిగిన పసిడి పోరు అంచనాలకు భిన్నంగా సాగింది. మహిళల 50 కేజీల విభాగం ఫైనల్లో రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్ఎస్పీబీ) బాక్సర్ అనామిక నుంచి నిఖత్ జరీన్ గట్టి పోటీ ఎదుర్కొంది. అనామిక సవాల్ విసిరినా స్పష్టమైన పంచ్‌లు సంధించిన నిఖత్ జరీన్ 4-1తో బంగారు పతకం సొంతం చేసుకుంది. టోక్యో ఒలింపిక్స్ మెడలిస్ట్ లవ్లీనా బొర్గొహైన్ మహిళల 75 కేజీల విభాగం ఫైనల్లో సర్వీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ) బాక్సర్ అరుంధతి చౌదరిపై 5-0తో ఏకపక్ష విజయం సాధించింది. ఎలైట్ మహిళల జాతీయ చాంపియన్‌షిప్స్‌లో రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు సత్తా చాటింది. ఏకంగా పది పతకాలతో టీమ్ చాంపియన్‌షిప్ కైవసం చేసుకుంది. కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ విజేతలకు పతకాలు ప్రదానం చేశారు.
మంత్రుల అభినందనలు : ఎలైట్ మహిళల జాతీయ చాంపియన్‌షిప్స్‌లో బంగారు పతకం సాధించిన తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్‌కు రాష్ట్ర మంత్రులు అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం తరఫున జాతీయ చాంపియన్‌షిప్స్ పోటీల్లో తలపడిన నిఖత్ జరీన్ పసిడి పతకంతో అంచనాలు నిలబెట్టింది. తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డిలు నిఖత్ జరీన్‌కు అభినందలు తెలిపారు.