Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిషబ్ మెరుపులతో ఆసక్తికర చర్చ
- దిగ్గజాల సరసన నిలిచిన చిన్నోడు
25 ఏండ్ల కుర్రాడు. 33 టెస్టుల కెరీర్. 55 ఇన్నింగ్స్‌ల అనుభవం. అప్పుడే ఆల్‌టైమ్ గ్రేట్ చర్చలో అతడి పేరు వినిపించటమా?!. దిగ్గజ స్థాయి అందుకునేందుకు జీవితకాలం ఆడాల్సిన పనిలేదు, అతి తక్కువ కాలంలోనే అత్యుత్తమ ప్రదర్శనతో ఆ స్థాయికి చేరుకోవచ్చని నిరూపించాడు భారత క్రికెటర్ రిషబ్ పంత్. టెస్టు క్రికెట్లో అసమాన ఇన్నింగ్స్‌లు నమోదు చేసిన రిషబ్ పంత్ 'ఆల్‌టైమ్ గ్రేట్ వికెట్ కీపర్' చర్చకు తెరతీశాడు.
నవతెలంగాణ క్రీడావిభాగం
మహి వారసుడు
భారత క్రికెట్‌కు రిషబ్ పంత్.. మహేంద్ర సింగ్ ధోని నిజమైన వారసుడు. అనతికాలంలోనే భారత దిగ్గజ వికెట్ కీపర్ బ్యాటర్ మహి రికార్డులను పంత్ అధిగమించాడు. బంగ్లాదేశ్‌తో మీర్పూర్ టెస్టులో 93 పరుగులు చేసిన పంత్.. 90 ప్లస్‌లో ఆరోసారి అవుటై ధోని (5)ని దాటేశాడు. 90 ప్లస్ పరుగులతో అవుట్ కావటం బాధాకరమే. కానీ 33 టెస్టుల్లో ఐదు శతకాలు సహా 11 అర్థ సెంచరీలు రిషబ్ పంత్ బాదాడు. అందులో ఏకంగా 11 సార్లు 90 ప్లస్ ఇన్నింగ్స్‌లు నమోదు చేశాడు. ప్రతి ఐదు ఇన్నింగ్స్‌లకు ఒకసారి పంత్ అసమాన ప్రదర్శన చేస్తూనే ఉన్నాడు. ఇది అద్భుత రికార్డు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సెంచరీలతో భారత అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాటర్‌గా రిషబ్ పంత్ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. వికెట్ కీపింగ్ నైపుణ్యం, అభిమానం పక్కనపెడితే.. పంత్ ఇప్పటికే భారత ఆల్‌టైమ్ గ్రేట్ వికెట్ కీపర్‌గా నిలిచాడు.
తిరుగులేని రికార్డులు
అత్యుత్తమ వికెట్ కీపర్ చర్చలో రిషబ్ పంత్ భారత క్రికెట్ పరిధిని ఎప్పుడే దాటేశాడు. ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో ఆల్‌టైమ్ గ్రేట్ వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ చర్చకు దారితీశాడు. దిగ్గజాలతో పంత్ పోటీపడేందుకు సహేతుక కారణాలు లేకపోలేదు. పరుగుల పరంగా వికెట్ కీపర్ల జాబితాలో 2262 పరుగులు, 44.35 సగటుతో పంత్ 30వ స్థానంలో ఉన్నాడు. దీర్ఘకాలంలో పంత్ నిలకడ అతడి స్థానాన్ని తేల్చుతుంది. కానీ, 2000 పైచిలుకు పరుగులు సాధించిన వికెట్ కీపర్లలో ఏబీ డివిలియర్స్, ఆండీ ఫ్లవర్, ఆడం గిల్‌క్రిస్ట్ మాత్రమే బ్యాటింగ్ సగటు పరంగా పంత్ కంటే ముందున్నారు. పంత్ ఇతర వికెట్ కీపర్ల మాదిరి కాదు. ఆసీస్‌కు ఆడం గిల్‌క్రిస్ట్ అత్యధికంగా ఏడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. సుదీర్ఘ కెరీర్లో ఎన్నడూ స్పెషలిస్ట్ బ్యాటర్ బాధ్యతలు తీసుకోలేదు. టాప్-6లో బ్యాటింగ్ చేసిన వికెట్ కీపర్లలో 49.67 సగటుతో 1540 పరుగులతో పంత్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. డివిలియర్స్, దోని, ఆండీ ఫ్లవర్, గిల్‌క్రిస్ట్, లెస్ ఆమెస్లు పంత్ కంటే ఎక్కువ సగటు సాధించారు. ఇక్కడ టాప్-10లో దిగ్గజాల సరసన నిలిచాడు పంత్. ఇక పంత్ బ్యాటింగ్ బాధ్యతలు పూర్తిగా భిన్నం. కెరీర్లో 33 టెస్టులను బౌలింగ్ స్వర్గధామంలో ఆడాడు. సహజంగా టాప్-6 తర్వాతి బ్యాటర్లకు పదునైన బౌలింగ్ ఎదురుకాదు. బౌలర్లు బాగా అలసిపోతారు, సులువుగా పరుగులు చేసేందుకు వీలు చిక్కుతుంది. టాప్-6లో పరిస్థితి అలా ఉండదు. ప్రతి పరుగు కోసం బౌలర్ చెత్త బంతి వేసే వరకు ఎదురుచూడాలి. చిన్న తప్పు చేసినా.. పెవిలియన్ బాట పట్టాల్సి ఉంటుంది. జట్టులో తరం మార్పిడి సమయంలో ఆడిన పంత్.. ఆ తర్వాత ఎన్నో సార్లు జట్టు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడే బ్యాటింగ్‌కు వచ్చాడు. ఈ కొలమానంతో గత తరం దిగ్గజాలతో పంత్‌ను పోల్చటం తగదు అనవచ్చు. సమకాలీన అత్యుత్తమ బ్యాటర్లతో పోల్చినా పంత్ గత కొంతకాలంగా అద్వితీయంగా రాణిస్తున్నాడు.
కఠిన పరిస్థితుల్లో మేటి
కఠిన పరిస్థితులు పంత్‌లో మేటి ఆటగాడిని బయటకు తీశాయి. 2021 ఆరంభం నుంచీ ప్రపంచ క్రికెట్లో గణాంకాలు పరిశీస్తే పంత్ ఘనత అవగతం కాగలదు. జట్టు 100/2 లేదా అంతకంటే దారుణ పరిస్థితుల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు వచ్చి ధనాధన్ మోత మోగించిన బ్యాటర్లలో పంత్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇటువంటి స్థితిలో పంత్ 13 ఇన్నింగ్స్‌ల్లో 66 సగటుతో 726 పరుగులు నమోదు చేశాడు. స్ట్రయిక్ రేట్ 84.5 కాగా, మూడు శతకాలు, మూడు అర్థ సెంచరీలు ఉన్నాయి. ఇదే సమయంలో ఆధునిక క్రికెట్ ఉత్తమ బ్యాటర్ల రేసులో పోటీపడుతున్న బాబర్ ఆజాం, జో రూట్లు పంత్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బాబర్ 15 ఇన్నింగ్స్‌ల్లో 58.5 సగటుతో 878 పరుగులు చేయగా.. జో రూట్ 44 ఇన్నింగ్స్‌ల్లో 49 సగటుతో 2011 పరుగులు చేశాడు. టాప్ ఆర్డర్లో భాగమైన బాబర్, రూట్లు 58.5, 49 సగటుతో రాణిస్తే.. పంత్ టాప్-6 బ్యాటర్‌గా 66 సగటుతో అసమానంగా రాణించాడు. ఈ ఇన్నింగ్స్‌ల్లో జట్టు స్కోరులో పంత్ వాటా 30.3 శాతం. సమకాలీన బ్యాటర్లలో పంత్ దరిదాపుల్లో ఎవరూ లేరు. పరుగులే కాదు, అవి ఎలా వచ్యాయనేది ముఖ్యమే. పంత్ క్రీజులో ఉండగా జట్టు 100 బంతులకు 84.5 పరుగులు చేసింది. పంత్ క్రీజులోకి రావడానికి ముందు జట్టు పరుగుల రేటు 100 బంతుల్లో 42 మాత్రమే. ఈ కాలంలో మరే బ్యాటర్‌కు ఇది సాధ్యపడలేదు.
కాలమే సమాధానం!
బలహీనత, లోపం లేని ఆటగాడు ఉండరు. బలహీనతలను అధిగమిస్తూ బలమైన ప్రభావం చూపించటమే ఉత్తమ ఆటగాడి లక్షణం. ఈ విషయంలో పంత్ ముందున్నాడు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో భారత్ 48/3, 72/3తో కష్టాల్లో ఉన్నప్పుడే పంత్ క్రీజులోకి వచ్చాడు. రెండు సందర్భాల్లో స్పిన్నర్ తైజుల్ ఇస్లాం బౌలర్. భారత్ ఒత్తిడిలో పడినా.. పంత్ రాకతో బంగ్లాదేశ్ లాంగ్ ఆన్, డీప్ మిడ్ వికెట్ వద్ద ఫీల్డర్లను ఉంచింది. ఈ వ్యూహంతో గతంలో మోయిన్ అలీ సక్సెస్ అయ్యాడు. కానీ పంత్ ఇప్పుడు చాకచక్యంగా ఆడుతున్నాడు. ఎదురుదాడికి అనుకూలమైన ఫీల్డింగ్ కోసం సింగిల్స్‌తో తికమక పెడుతున్నాడు. పంత్ పవర్ హిట్టింగ్ జోన్లో బంతి పడితే అత్యంత బలంగా బాదుతున్నాడు. అత్యధిక సిక్సర్లు కొట్టిన వికెట్ కీపర్ల జాబితాలో ధోని, గిల్‌క్రిస్ట్ తర్వాత పంత్ ఉన్నాడు. గుడ్ లెంగ్త్ బాల్‌తో పంత్‌ను ఇరకాటంలో పడేందుకు నాణ్యమైన పేసర్లందరూ ప్రయత్నించారు. కానీ ఆ లెంగ్త్ ఏమాత్రం తప్పినా పంత్ దారుణంగా శిక్షిస్తాడు. జేమ్స్ అండర్సన్‌పై సైతం రివర్స్ స్వీప్ షాట్లతో దండెత్తాడు. కెరీర్ ఆరంభ దశలోనే దిగ్గజాల సరసన నిలువటమే కాదు, ఏకంగా ఆల్‌టైమ్ గ్రేట్ రేసులో నిలిచిన రిషబ్ పంత్.. వికెట్ కీపింగ్ ఆల్‌టైమ్ గ్రేట్ అవునా? కాదా? అనేది కాలమే నిర్ణయిస్తుంది.