Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డెవిడ్ వార్నర్ మైలురాయి ద్విశతకం
- బాక్సింగ్ డే టెస్టులో ఆసీస్ పైచేయి
మెల్బోర్న్ (ఆస్ట్రేలియా) :
విధ్వంసక ఓపెనర్ డెవిడ్ వార్నర్ (200 రిటైర్డ్ హర్ట్, 254 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) కెరీర్ వందో టెస్టులో రెండొందల పరుగులు సాధించాడు. విపరీత ఉష్ణోగ్రతల నడుమ భావోద్వేగ ఇన్నింగ్స్‌తో అలరించిన డెవిడ్ వార్నర్ మైలురాయి టెస్టులో మరుపురాని ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. డెవిడ్ వార్నర్ ద్వి శతకానికి స్టీవ్ స్మిత్ (85, 161 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్), ట్రావిశ్ హెడ్ (48 నాటౌట్, 48 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించటంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో పటిష్ట స్థితిలో నిలిచింది. బాక్సింగ్ డే టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 386/3 పరుగుల భారీ స్కోరు సాధించింది. నాలుగు ఫోర్లతో 72 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన వార్నర్.. ఎనిమిది ఫోర్లతో 144 బంతుల్లో వందో టెస్టులో శతకం బాదాడు. 222 బంతుల్లో 150 పరుగుల మార్క్ చేరుకున్న వార్నర్.. 16 ఫోర్లు, రెండు సిక్సర్లతో 254 బంతుల్లోనే ద్వి శతకం అందుకున్నాడు. అధిక ఉష్ణోగ్రతతో నీరసించిన వార్నర్.. ద్వి శతకం అనంతరం ఎగిరి గంతేస్తూ గాయపడ్డాడు. కండరాలు సైతం పట్టేయటంతో 200 పరుగుల వద్దే రిటైర్డ్ హర్ట్‌గా నిష్క్రమించాడు. కెరీర్ వందో టెస్టులో శతకం సాధించిన రెండో బ్యాటర్‌గా వార్నర్ నిలిచాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ సైతం వందో టెస్టులో సెంచరీ కొట్టాడు. ద్వి శతకంతో వార్నర్ ఈ ఘనతను మరింత ప్రత్యేకం చేసుకున్నాడు. ఫిట్నెస్ సాధిస్తే డెవిడ్ వార్నర్ తొలి ఇన్నింగ్స్‌లో మళ్లీ బ్యాటింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ట్రావిశ్ హెడ్, అలెక్స్ కేరీ (9 నాటౌట్) అజేయంగా ఆడుతున్నారు. కామెరూన్ గ్రీన్ (6) సైతం రిటైర్డ్ హర్ట్‌గా నిష్క్రమించాడు. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులకే కుప్పకూలగా.. ఆస్ట్రేలియా 197 పరుగుల భారీ ముందంజలో కొనసాగుతోంది. నేడు ఉదయం సెషన్లో బ్యాటింగ్ చేసి డిక్లరేషన్ ఇచ్చే ఆలోచనలో ఉన్న ఆస్ట్రేలియా.. మూడో రోజులోనే బాక్సింగ్ డే టెస్టుకు ముగింపు పలికేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది.
ఇక బాక్సింగ్ డే టెస్టులో నిలకడగా వాయు వేగంతో బంతులు సంధించిన సఫారీ పేసర్ ఎన్రిచ్ నోకియా అనూహ్య రీతిలో గాయపడ్డాడు!. మ్యాచ్ సందర్భంగా స్పైడర్ కెమెరా నోకియాకు తగలటంతో మైదానంలో కింద పడ్డాడు. భుజం, మోచేతికి గాయమైంది. విరామం అనంతరం మైదానంలోకి వచ్చిన నొకియా జోరుగా బౌలింగ్ చేయటంతో సఫారీ శిబిరం ఊపిరి పీల్చుకుంది.