Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాణించిన రవితేజ, కార్తికేయ
- అస్సాం తొలి ఇన్నింగ్స్ 205 ఆలౌట్
- హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ 78/3
పచ్చిక పిచ్‌పై హైదరాబాద్ సీమర్లు చెలరేగారు. రవితేజ, కార్తికేయ కక్ నిప్పులు చెరిగే బంతులతో విజృంభించటంతో అస్సాం తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకే కుప్పకూలింది. బౌలర్ల మెరుపులతో అస్సాం స్వల్ప స్కోరుకు పరిమితం చేసిన హైదరాబాద్.. నేడు బ్యాట్‌తో కదం తొక్కితే మ్యాచ్‌పై పట్టు చిక్కనుంది.
నవతెలంగాణ-హైదరాబాద్
రవితేజ (4/53) నిప్పులు చెరిగాడు. అస్సాం బ్యాటర్లపై పదునైన పేస్‌తో దండెత్తాడు. యువ పేసర్ కార్తికేయ కక్ (3/43) సైతం విజృంభించటంతో అస్సాంతో రంజీ మ్యాచ్ తొలి రోజు హైదరాబాద్ పైచేయి సాధించింది. రవితేజ నాలుగు వికెట్లు, కార్తికేయ మూడు వికెట్ల ప్రదర్శనతో అస్సాం తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకే కుప్పకూలింది. టెయిలెండర్ సరుపం (83, 88 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీతో అస్సాంకు గౌరవ ప్రద స్కోరు అందించాడు. రవితేజ, కార్తికేయ దూకుడుకు అస్సాం 42 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. లోయర్ ఆర్డర్, టెయిలెండర్ల అండతో అస్సాం 200 పరుగుల మార్క్ దాటింది. తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 78/3తో కొనసాగుతోంది. రాహుల్ బుద్ది (16 నాటౌట్, 32 బంతుల్లో 3 ఫోర్లు), రోహిత్ రాయుడు (22 నాటౌట్, 75 బంతుల్లో 1 ఫోర్) అజేయంగా ఆడుతున్నారు.
పేస్ ప్రతాపం :
అస్సాంతో రంజీ మ్యాచ్‌కు ఊహించని రీతిలో పచ్చికతో కూడిన పిచ్‌ను సిద్ధం చేశారు. గణనీయమైన పచ్చికను పిచ్‌పై ఉంచిన క్యూరేటర్ పేసర్ల వేటకు రంగం సిద్ధం చేశాడు. టాస్ నెగ్గిన ఆతిథ్య హైదరాబాద్ తొలుత బౌలింగ్ ఎంచుకుని.. పిచ్ నుంచి వంద శాతం అనుకూలతను వాడుకుంది. ఉదయం సెషన్లో రవితేజ, కార్తికేయలను ఎదుర్కొనేందుకు అస్సాం టాప్ ఆర్డర్ తంటాలు పడింది. ఓపెనర్లు కునాల్ (1), రాహుల్ (11) సహా సిద్ధార్థ్ సమ్రా (0), రిశావ్ దాస్ (14), రియాన్ పరాగ్ (10)లు పేస్‌కు దాసోహం అయ్యారు. 42 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన అస్సాం.. పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. హైదరాబాద్ బౌలర్ల జోరుతో అస్సాం వంద పరుగులు చేయటం కష్టమే అనిపించింది. కానీ శివశంకర్ రారు (25), గోకుల్ శర్మ (24), ఆకాశ్ సేన్ గుప్త (18)లకు తోడు సరుపం పెరుకయస్థ (83, 88 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) అదిరే అర్థ సెంచరీతో రాణించాడు. టాప్ ఆర్డర్‌ను అలవోకగా కుప్పకూల్చిన హైదరాబాద్.. ఐదో బౌలర్ ఆప్షన్ లేకపోవటంతో లోయర్ ఆర్డర్‌పై ప్రభావం చూపించలేదు. వేగంగా పరుగులు రాబట్టిన అస్సాం లోయర్ ఆర్డర్.. ఆ జట్టుకు పోరాడగలిగే స్కోరు అందించారు. 56.4 ఓవర్లలో అస్సాం తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ బౌలర్లలో అజయ్ దేవ్‌గౌడ్, తనరు త్యాగరాజన్, భగత్ వర్మలు తలా ఓ వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
అస్సాం సైతం..! :
పచ్చిక పిచ్‌పై అస్సాం పేసర్లు సైతం ప్రతాపం చూపించారు. రోహిత్ రాయుడు (22 బ్యాటింగ్)తో కలిసి తొలి వికెట్‌కు 26 పరుగులు జోడించిన కెప్టెన్ తన్మరు అగర్వాల్ (21, 34 బంతుల్లో 4 ఫోర్లు) ఇన్నింగ్స్ 11వ ఓవర్లో వికెట్ కోల్పోయాడు. అస్సాం పేసర్ ముఖ్తర్ హుస్సేన్ ప్రభావశీలంగా బంతులేశాడు. మికిల్ జైస్వాల్ (4), నం.3 బ్యాటర్ సంహిత్ రెడ్డి (11)లు ముఖ్తర్ హుస్సేన్‌కు తలొగ్గారు. తొలి రోజు ఆటలో 27 ఓవర్ల అనంతరం 78/3తో నిలిచిన హైదరాబాద్.. తొలి ఇన్నింగ్స్‌కు మరో 127 పరుగుల వెనుకంజలో ఉంది. అస్సాం 3.62 రన్‌రేట్‌తో పరుగులు చేయగా.. హైదరాబాద్ గత మ్యాచుల తరహాలోనే 2.89 రన్‌రేట్‌తో ఆత్మరక్షణ వైఖరిలో పడి పరుగులు సాధిస్తుంది. రవితేజ, భవేశ్ సేత్, భగత్ వర్మ, అజరు దేవ్గౌడ్లు బ్యాటింగ్‌కు రావాల్సి ఉండటంతో హైదరాబాద్ 150 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంపై కన్నేసి నేడు బ్యాటింగ్‌కు రానుంది.
స్కోరు వివరాలు :
అస్సాం తొలి ఇన్నింగ్స్ : కునాల్ (బి) రవితేజ 1, రాహుల్ (సి) తనయ్ (బి) కార్తికేయ 11, సిద్దార్థ్ (సి) తన్మయ్ (బి) కార్తికేయ 0, దాస్ (సి) మికిల్ (బి) రవితేజ 14, పరాగ్ (ఎల్బీ) రవితేజ 10, రారు (సి) మికిల్ (బి) తనయ్ 25, గోకుల్ (ఎల్బీ) కార్తికేయ 24, సరుపం (సి) భవేశ్ (బి) అజయ్ 83, ఆకాశ్ (బి) భగత్ 18, ముఖ్తర్ (బి) రవితేజ 2, సునీల్ నాటౌట్ 4, ఎక్స్‌ట్రాలు : 13, మొత్తం : (56.4 ఓవర్లలో ఆలౌట్) 205.
వికెట్ల పతనం : 1-2, 2-3, 3-12, 4-32, 5-42, 6-85, 7-119, 8-161, 9-166, 10-205.
బౌలింగ్ : రవితేజ 16-4-53-4, కార్తికేయ 13-3-43-3, అజరు 10-0-17-1, తనరు 13-0-55-1, భగత్ 4-0-27-1.
హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ : తన్మయ్ అగర్వాల్ (సి) రాహుల్ (బి) ఆకాశ్ 21, రోహిత్ రాయుడు నాటౌట్ 22, సంహిత్ రెడ్డి (సి) ఆకాశ్ (బి) ముఖ్తర్ 11, మికిల్ జైస్వాల్ (బి) ముఖ్తర్ 4, రాహుల్ నాటౌట్ 16, ఎక్స్టాలు : 4, మొత్తం : (27 ఓవర్లలో 3 వికెట్లకు) 78.
వికెట్ల పతనం : 1-26, 2-46, 3-50.
బౌలింగ్ : ముఖ్తర్ హుస్సేన్ 9-1-25-2, సునీల్ 3-1-11-0, రియాన్ 9-3-14-0, ఆకాశ్ 3-0-16-1, సరుపం 3-0-8-0.