Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పచ్చిక పిచ్‌పై పోరు ఉత్కంఠగా సాగుతోంది. హైదరాబాద్, అస్సాం రంజీ మ్యాచ్ రసకందాయంలో పడింది. 250 పరుగుల ఛేదనలో హైదరాబాద్ 100/2తో మెరుగైన స్థితిలో కొనసాగగా.. వరుస వికెట్లతో అస్సాం మ్యాచ్‌ను రసపట్టులో పడేసింది. 9 వికెట్లు చేజార్చుకున్న హైదరాబాద్ విజయానికి 22 పరుగుల దూరంలో నిలువగా.. అస్సాం ఓ వికెట్ దూరంలోనే ఉంది. హైదరాబాద్ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (123 నాటౌట్) అజేయంగా ఆడుతుండటం ఆతిథ్య జట్టుకు ఊరట.
- రసపట్టులో హైదరాబాద్, అస్సాం రంజీ పోరు
- ఛేదనలో తన్మయ్ అగర్వాల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్
నవతెలంగాణ-హైదరాబాద్
కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (123 బ్యాటింగ్, 154 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) అద్భుత శతకం సాధించాడు. 250 పరుగుల ఛేదనలో సహచర బ్యాటర్లు విఫలమైనా.. అసమాన బ్యాటింగ్ ప్రదర్శనతో తన్మరు అగర్వాల్ హైదరాబాద్ ఆశలను సజీవంగా నిలిపాడు. పేసర్లు, స్పిన్నర్లు వికెట్ల వేటలో జోరందుకున్న తరుణంలో తన్మయ్ అగర్వాల్ కెరీర్లోనే ఉత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. రంజీ కెరీర్లో పదో సెంచరీ సాధించిన తన్మయ్ అగర్వాల్‌కు ఈ సీజన్లో ఇది రెండో శతకం కావటం విశేషం. తన్మయ్ అగర్వాల్ కెప్టెన్సీ శతకంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 228/9 వద్ద నిలిచింది. హైదరాబాద్ విజయానికి మరో 22 పరుగులు అవసరం కాగా, అస్సాంకు మరో వికెట్ చాలు. నేడు ఉదయం సెషన్లో ఒత్తిడిని ఛేదిస్తూ తన్మయ్ హైదరాబాద్‌కు తొలి విజయాన్ని అందిస్తాడా? ఒక్క వికెట్లో అస్సాం లాంఛనం ముగిస్తుందా? ఆసక్తికరం.
బ్యాటర్లు విఫలం
250 పరుగుల ఛేదనలో హైదరాబాద్ లంచ్ సెషన్‌ల్లో మెరుగ్గా కనిపించింది. ఓపెనర్ రోహిత్ రాయుడు (20)తో కలిసి తొలి వికెట్‌కు 46 పరుగులు జోడించిన తన్మయ్ అగర్వాల్..టీ విరామ సమయానికి హైదరాబాద్‌ను 100/2తో మెరుగైన స్థితిలో నిలిపాడు. నం.3 బ్యాటర్ సంహిత్ రెడ్డి (0) డకౌట్ కాగా.. వికెట్ కీపర్ భవేశ్ సేత్ (41, 66 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. రాహుల్ బుద్ది (28, 24 బంతుల్లో 3 సిక్స్‌లు) ఆకట్టుకున్నాడు. తన్మయ్ అగర్వాల్‌కు తోడు భవేశ్, రాహుల్‌లు పరిస్థితులకు అనుగుణంగా రాణించినా.. వేగంగా పరుగులు రాబట్టాలనే ఆలోచనతో భారీ షాట్లకు వెళ్లారు. అందుకు భారీ మూల్యం చెల్లించుకున్నారు. 100/2తో లక్ష్యం దిశగా దూసుకెళ్లిన హైదరాబాద్.. ఒక్కసారిగా వికెట్లు చేజార్చుకుంది. 82 పరుగులకే మరో 6 వికెట్లు కోల్పోయింది. స్పిన్నర్ రియాన్ పరాగ్ (3/90), పేసర్ సరుపం (2/49)లకు తోడు గోకుల్ శర్మ (2/23) వికెట్ల వేటలో హైదరాబాద్‌ను వెంబడించారు. ఓ ఎండ్‌లో కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ వీరోచిత సెంచరీతో కదం తొక్కినా..మరో ఎండ్‌లో వికెట్ల జాతర కొనసాగింది. అజయ్ దేవ్ గౌడ్ (9, 33 బంతుల్లో 1 ఫోర్)తో కలిసి 9వ వికెట్‌కు 42 పరుగులు జోడించిన తన్మయ్ అగర్వాల్ హైదరాబాద్ విజయానికి చేరువ చేశాడు. కానీ అజరు సైతం ముఖ్తార్ హుస్సేన్‌కు ఎల్బీగా దొరికిపోవటంతో హైదరాబాద్‌పై ఒత్తిడి పెరిగింది. నం.11 బ్యాటర్ కార్తికేయ కక్ (1 నాటౌట్, 2 బంతుల్లో)తో కలిసి కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ అజేయంగా ఆడుతున్నాడు. చివరి వికెట్‌కు హైదరాబాద్ 22 పరుగులు చేయాల్సి ఉండగా.. అస్సాం ఒక్క వికెట్‌తో విజయానికి చేరువ కానుంది. నేడు ఉదయం సెషన్లో తన్మయ్ అగర్వాల్ ప్రదర్శనపై హైదరాబాద్ ఆశలు పెట్టుకుంది.
అంతకముందు, అస్సాం రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది. ఆకాశ్ సేన్ గుప్త (31, 128 బంతుల్లో 3 ఫోర్లు), సిద్దార్థ్ (26, 104 బంతుల్లో 5 ఫోర్లు) ఆరో వికెట్‌కు 68 పరుగులు జోడించారు. దీంతో అస్సాం రెండో ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్‌కు 250 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. హైదరాబాద్ పేసర్ టి. రవితేజ (5/50) ఐదు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు.
స్కోరు వివరాలు
అస్సాం తొలి ఇన్నింగ్స్ : 205/10
హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ : 208/10
అస్సాం రెండో ఇన్నింగ్స్ : 252/10
హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్ : తన్మయ్ అగర్వాల్ బ్యాటింగ్ 123, రోహిత్ రాయుడు (సి) రాహుల్ (బి) పరాగ్ 20, సంహిత్ రెడ్డి (బి) సిద్దార్థ్ 0, భవేశ్ సేత్ (ఎల్బీ) సరుపం 41, రాహుల్ బుద్ది (సి) ముఖ్తార్ (బి) గోకుల్ 28, మికిల్ జైస్వాల్ (బి) పరాగ్ 1, రవిజేత (సి) కునాల్ (బి) గోకుల్ 1, త్యాగరాజన్ (సి) గోకుల్ (బి) సరుపం 0, భగత్ వర్మ (సి) రిశవ్ (బి) పరాగ్ 3, అజరు (ఎల్బీ) ముఖ్తార్ 9, కార్తికేయ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 1, మొత్తం : (61 ఓవర్లలో 9 వికెట్లకు) 228.
వికెట్ల పతనం : 1-46, 2-47, 3-121, 4-171, 5-172, 6-175, 7-177, 8-182, 9-224.
బౌలింగ్ : ముఖ్తార్ హుస్సేన్ 7-0-26-1, సునీల్ 3-2-5-0, రియాన్ పరాగ్ 25-4-90-3, ఆకాశ్ 3-0-11-0, సిద్దార్థ్ 6-1-24-1, సరుపం 12-1-49-2, గోకుల్ 5-1-23-2.