Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు ప్రపంచకప్ విజయాల్లో భాగస్వామ్యం
బ్రెసిలియా: బ్రెజిల్ వెటరన్ ఫుట్‌భాల్ ఆటగాడు పీలే(82) కన్నుమూతతో క్రీడా ప్రపంచం ఓ దిగ్గజ ఆటగాడ్ని కోల్పోయింది. సావోపాలోలోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆసుపత్రిలో క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న పీలే గురువారం అర్ధరాత్రి దాటిన అనంతరం కన్నుమూశాడు. పీలే కొంతకాలంలో క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటుండగా.. ఇటీవల ఆరోగ్యం విషమించడంతో అవయవాలన్నీ పని చేయడం పూర్తిగా మానేశాయి. ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న పీలే నాలుగు ప్రపంచకప్‌ల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించిన పీలే.. 1958, 1962, 1970 బ్రెజిల్‌కు ప్రపంచకప్ టైటిళ్లను సంపాదించి పెట్టాడు. ఫార్వర్డ్‌గా, అటాకింగ్ మిడ్‌ఫీల్డర్‌గా మైదానంలో అతని విన్యాసాలు అసాధారణం. మెరుపు వేగంతో బంతిని గోల్‌పోస్టులోకి నెట్టడంలో అతనికి అతనే సాటి. రెండు కాళ్లతోనూ బంతిని నియంత్రించే అతను.. ప్రత్యర్థి వ్యూహాలను పసిగట్టడంలో దిట్ట. ఎదురుగా ఎంతమంది ప్రత్యర్థి ఆటగాళ్లు ఉన్నా బంతిని డ్రిబ్లింగ్ చేయడంలో అతని శైలే వేరు. గాల్లో వేగంగా వచ్చే బంతిని ఛాతీతో నియంత్రించి.. అది కిందపడి పైకి లేవగానే కాలుతో సూటిగా తన్ని గోల్‌పోస్టులోకి పంపించడంలో అతని ప్రత్యేకతే వేరు. 1970 ప్రపంచకప్‌లో రొమేనియాతో పోరులో దాదాపు 25 గజాల దూరం నుంచి ఫ్రీకిక్‌ను.. డిఫెండర్ల మధ్యలో నుంచి గోల్‌పోస్టులోకి అతను పంపించిన తీరు అమోఘం. 1958 ప్రపంచకప్ ఫైనల్లో స్వీడన్‌పై పెనాల్టీ ప్రదేశంలో సహచర ఆటగాడి నుంచి బంతి అందుకున్న అతను.. ఇద్దరు ప్రత్యర్థి ఆటగాళ్లను తప్పించి, గోల్కీపర్ను బోల్తా కొట్టించిన వైనం అసాధారణం. గోల్‌కీపర్ డైవ్ చేసినా ఆ బంతిని ఆపలేకపోయాడు. ఇలాంటి గోల్స్ మరెన్నో. ప్రపంచ ఫుట్‌బాల్‌లో తిరుగులేని శక్తిగా బ్రెజిల్ ఓ వెలుగు వెలిగిందంటే అందుకు ప్రధాన కారణం పీలే. 1958 ప్రపంచకప్‌లో మోకాలి గాయాన్ని సైతం లెక్కచేయకుండా రాణించి ఉత్తమ యువ ఆటగాడి అవార్డు అందుకున్నాడు. 1962, 1966 ప్రపంచకప్‌లో గాయం కారణంగా ప్రభావం చూపలేకపోయాడు. 1966లో జట్టు నిరాశాజనక ప్రదర్శనతో అతను ఆటకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడు. కానీ మళ్లీ జట్టులోకి వచ్చి 1970 ప్రపంచకప్‌లో ఉత్తమ ఆటగాడిగా గోల్డెన్ బంతిని సొంతం చేసుకున్నాడు. 1971 జులైలో యుగోస్లేవియాతో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ప్రపంచకప్‌ల్లో 14 మ్యాచ్‌ల్లో 12 గోల్స్ సాధించాడు.
భారత్‌తోనూ పీలేకు అనుబంధం
పీలేకు భారత్‌తోనూ మంచి అనుబంధం ఉంది. 2015 అక్టోబరు 11న కోల్‌కతాకు మూడు రోజుల పర్యటనకు పీలే విచ్చేశారు. ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియన్ సూపర్‌లీగ్(ఐఎస్ఎల్) ప్రారంభ సీజన్‌కు ముఖ్య అతిథిగా విచ్చేశారు. కోల్‌కతా చేరుకున్న పీలే టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ, ఫ్రాంచైజీల యజమానులు సాదరంగా ఆహ్వానించారు. భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఆదరణ పెంపుకు, పిల్లల్లో ఫుట్‌బాల్ పట్ల ఆసక్తి పెంచేందుకు పలు సూచనలు చేశారు. ప్రతిభ గల ఆటగాళ్లకు విదేశీ కోచ్‌ల వద్ద శిక్షణ అందిస్తే.. మరింతగా రాటుదేలుతారని సలహాలిచ్చారు.