Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డు ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన కారు
న్యూఢిల్లీ: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తున్న పంత్ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢ కొట్టడంతో పూర్తిగా మంటల్లో కాలిపోయింది. మంటల్లో అంటుకున్న కారులోంచి పంత్‌ను ఓ బస్ డ్రైవర్ బయటకు లాగడంతో పంత్.. గాయాలబారినపడి ప్రాణాపాయంనుంచి బయటపడ్డారు. మంటల్లో కాలుతున్న కారును తొలుత చూసింది బస్ డ్రైవర్ సుశీల్ మన్. ''నేను హరిద్వార్ వైపు నుంచి వస్తున్నా. ఢిల్లీ వైపు నుంచి వేగంగా వస్తున్న ఒక కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢకొట్టింది. అది చూసిన వెంటనే బస్సు ఆపాను. ఆ కారు బారికేడ్‌ను ఢకొీట్టి 200 మీటర్లు దూసుకెళ్లింది. అయితే కారులో ఎవరున్నది తెలిసేలోపే మంటలు అంటుకున్నాయి. ఈ లోగా కారులో నుంచి ఓ వ్యక్తి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను వెళ్లి అతడ్ని బయటికి లాగాను. ఆ తర్వాత అతను ''నాపేరు రిషబ్ పంత్ అని.. టీమిండియా క్రికెటర్‌నని.. మా అమ్మకు ఫోన్ చేయండి'' అని చెప్పాడు. వాస్తవానికి నేను క్రికెట్ చూడను. పంత్ ఎవరో కూడా నాకు తెలియదు. ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడడం బాధ్యతగా భావించి చేశాను. ఇంతలో బస్‌లో మిగతావారు వచ్చి అతను క్రికెటర్ పంత్ అని చెప్పుకున్నారు. కారులో ఇంకా ఎవరైనా ఉన్నారా అని తొంగి చూశాను. ఎవరు కనిపించలేదు. అయితే ఒక బ్లూ బ్యాగ్ మాత్రం కనిపించింది. ఓపెన్ చేసి చూస్తే అందులో ఎనిమిది వేల రూపాయలు ఉన్నాయి. పంత్‌ను ఆంబులెన్స్ ఎక్కించి ఆ తర్వాత బ్యాగ్‌ను అతనికి అందజేశాను'' చెప్పుకొచ్చాడు. తీవ్రంగా గాయపడ్డ పంత్ డెహ్రాడూన్‌లోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పంత్ ఆరోగ్యంపై బిసిసిఐ ఓ ప్రకటన విడుదల చేసింది. పంత్‌కు చికిత్స జరుగుతోందని.. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు పేర్కొంది. పంత్ నుదురు చిట్లిందని, వీపుపై కాలిన గాయాలు, కుడి మోకాలి ఎముక చిట్లినట్లు ఎక్స్‌రేల్లో తేలినట్లు బిసిసిఐ వెల్లడించింది.