Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు నిలకడగా రిషబ్ పంత్ ఆరోగ్యం
డెహ్రాడూన్ : భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్‌ను ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యూనిట్) నుంచి సాధారణ వార్డుకు మార్చారు. డిసెంబర్ 30న రిషబ్ పంత్‌కు ఎంఆర్ఐ స్కాన్ చేశారు. మెదడు, వెన్నుపూసకు సంబంధిత పరీక్షలు నిర్వహించి ఎటువంటి అపాయం లేదని నిర్ధారించారు. అయితే, రిషబ్ పంత్ ఇప్పటికీ నడువలేని స్థితిలో ఉన్నాడు. దీంతో వైద్యులు పంత్‌కు చేయాల్సిన మరిన్ని స్కానింగ్స్ చేయలేదు. రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్ మోకాలు, చీలమండ, కాలు బొటనవేలుకు గాయమైందని ప్రాథమికంగా వైద్యులు వెల్లడించారు. గాయం తీవ్రత తెలుసుకునేందుకు ఎంఆర్ఐ స్కానింగ్ చేయాల్సి ఉంది. ఇందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. రిషబ్ పంత్ ఆరోగ్య పర్యవేక్షణకు బీసీసీఐ వైద్య కమిటీని నియమించింది. డెహ్రాడూన్‌లోని మాక్స్ హాస్పిటల్ వైద్యబృందంతో కలిసి బీసీసీఐ మెడికల్ టీమ్ పంత్ చికిత్సను పర్యవేక్షిస్తోంది. ముఖంపై గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేసినా.. పంత్ పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు ఎంత సమయం పట్టనుందని ఎంఆర్ఐ స్కాన్ నివేదికల అనంతరమే తేలనుంది. భారత క్రికెట్ ఈ ఏడాది బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్, వన్డే వరల్డ్‌కప్ సహా ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ కోసం సిద్ధమవుతోంది. ఈ మూడు ప్రణాళికల్లోనూ రిషబ్ పంత్ కీలకం. ఇక, ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్సీ వహిస్తున్న రిషబ్ పంత్ ఈ ఏడాది సీజన్‌కు అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది తేలాల్సి ఉంది.