Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్త ఏడాదిని భారత్ విజయంతో మొదలుపెట్టింది. వాంఖడెలో శ్రీలంకతో తొలి టీ20లో భారత్ సాధికారిక విజయం నమోదు చేసింది. దీపక్ హుడా (41 నాటౌట్), అక్షర్ పటేల్ (31 నాటౌట్), ఇషాన్ కిషన్ (37) బ్యాట్‌తో మెరువగా.. అరంగేట్ర పేసర్ శివం మావి (4/22) బంతితో నిప్పులు చెరిగాడు. 162 పరుగులు చేసిన భారత్.. ఛేదనలో శ్రీలంకను 160 పరుగులకు కట్టడి చేసింది. 2 పరుగుల తేడాతో తొలి టీ20లో గెలుపొందింది.
- తొలి టీ20లో భారత్ గెలుపు
- రాణించిన దీపక్ హుడా, శివం మావి
నవతెలంగాణ-ముంబయి
ఉత్కంఠ మ్యాచ్‌లో భారత్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. 163 పరుగుల ఛేదనలో శ్రీలంక 160 పరుగులకే పరిమితమైంది. చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా.. ఆ జట్టు 10 పరుగులే చేసింది. కెప్టెన్ శనక (45, 27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), కరుణరత్నె (23 నాటౌట్, 16 బంతుల్లో 2 సిక్స్‌లు) మెరిసినా శ్రీలంకకు పరాజయం తప్పలేదు. భారత యువ పేసర్ శివం మావి (4/22) నాలుగు వికెట్లతో మెరిశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 162 పరుగులు చేసింది. దీపక్ హుడా (41 నాటౌట్, 23 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు), అక్షర్ పటేల్ (31 నాటౌట్, 20 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), ఇషాన్ కిషన్ (37, 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. భారత్ 1-0 ఆధిక్యంలో నిలువగా, దీపక్ హుడా 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అందుకున్నాడు. రెండో టీ20 గురువారం పుణెలో జరుగనుంది.
మావి మెరుపుల్ : 163 పరుగుల ఛేదనలో శ్రీలంకకు ఆశించిన ఆరంభం దక్కలేదు. అరంగేట్ర పేసర్ శివం మావి వరుస బౌండరీల అనంతరం నిశాంక (1)ను క్లీన్‌బౌల్డ్ చేయగా.. తర్వాతి ఓవర్లో డిసిల్వ (8) సైతం రెండు ఫోర్లు బాది మావికి వికెట్ కోల్పోయాడు. పవర్‌ప్లేలో రెండు వికెట్లు కోల్పోయిన శ్రీలంక 35 పరుగులు చేసింది. ఓపెనర్ కుశాల్ మెండిస్ (28) ఫర్వాలేదనిపించాడు. ఉమ్రాన్, హర్షల్ సైతం మెరువటంతో అసలంక (12), రాజపక్స (10), మెండిస్‌లు డగౌట్‌కు చేరారు. 68 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన శ్రీలంక కష్టాల్లో కూరుకుంది. ఈ సమయంలో హసరంగ (21) దూకుడుగా ఆడాడు. కెప్టెన్ శనకతో కలిసి 40 పరుగులు జోడించాడు. ఈ జోడీ క్రీజులో ఉండగా శ్రీలంక మళ్లీ రేసులోకి వచ్చింది. మావి మరోసారి బ్రేక్ ఇవ్వగా.. హసరంగ వెనుదిరిగాడు. అప్పటికి శ్రీలంక స్కోరు 108/6. కెప్టెన్ శనక మూడేసి ఫోర్లు, సిక్సర్లతో భారత్‌ను భయపెట్టాడు. మాలిక్ ఓవర్లో సిక్సర్ బాదినా.. చాహల్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. శనక వికెట్‌తో లంకేయుల ఆశలు ఆవిరయ్యాయి!.
తడబడినా.. నిలబడ్డారు : టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌కు ధనాధన్ ఆరంభం లభించింది. కానీ శ్రీలంక బౌలర్లు వేగంగా పుంజుకున్నారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే 6, 4, 4తో 17 పరుగులు పిండుకున్న ఇషాన్ కిషన్ (37) ధనాధన్‌తో మొదలెట్టాడు. అరంగేట్ర బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (7) తొలి బంతినే బౌండరీగా బాదాడు. కానీ వరుస ఓవర్లలో గిల్, సూర్య, శాంసన్ వికెట్లతో భారత్ ఒత్తిడిలో పడింది. తీక్షణకు గిల్ దొరికిపోగా.. సూర్య స్కూప్ షాట్ తిప్పికొట్టింది!. శాంసన్ (5) సులువైన క్యాచ్ ఇచ్చేశాడు. 46/3తో భారత్ కష్టాల్లో పడింది. కెప్టెన్ హార్దిక్ పాండ్య (29)తో కలిసి ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. హార్దిక్ పాండ్య వరుస బౌండరీలతో అలరించాడు. కిషన్ సైతం దూకుడు పెంచాడు. అయినా, ఈ ఇద్దరి నిష్క్రమణతో భారత్ 94/5తో గడ్డు పరిస్థితుల్లోనే నిలిచింది. స్వల్ప స్కోరుతో సరిపెట్టుకునే తరుణంలో దీపక్ హుడా (41 నాటౌట్), అక్షర్ పటేల్ (31 నాటౌట్) భాగస్వామ్యం భారత్‌ను రేసులో నిలిపింది. ఇన్నింగ్స్ చివరి 36 బంతుల్లో 68 పరుగులు జోడించిన ఈ జోడీ భారత్‌కు మెరుగైన స్కోరు అందించింది. నాలుగు సిక్సర్లతో దీపక్ హుడా దండెత్తగా.. అక్షర్ పటేల్ మూడు ఫోర్లతో మెరిశాడు. శ్రీలంక బౌలర్లు హసరంగ, తీక్షణ మాయ చేసినా.. ఈ జోడీ ఎదురుదాడి ఆపలేదు. భారత్ 162/5 పరుగుల మంచి స్కోరు నమోదు చేసింది.
స్కోరు వివరాలు :
భారత్ ఇన్నింగ్స్ : కిషన్ (సి) డిసిల్వ (బి) హసరంగ 37, గిల్ (ఎల్బీ) తీక్షణ 7, సూర్య (సి) రాజపక్స (బి) కరుణరత్నె 7, శాంసన్ (సి) మధుశంక (బి) డిసిల్వ 5, పాండ్య (సి) కుశాల్ (బి) మధుశంక 29, దీపక్ నాటౌట్ 41, అక్షర్ నాటౌట్ 31, ఎక్స్‌ట్రాలు : 5, మొత్తం :(20 ఓవర్లలో 5 వికెట్లకు) 162.
వికెట్ల పతనం : 1-27, 2-38, 3-46, 4-77, 5-94.
బౌలింగ్ : రజిత 4-0-47-0, మధుశంక 4-0-35-1, తీక్షణ 4-0-29-1, కరుణరత్నె 3-0-22-1, డిసిల్వ 1-0-6-1, హసరంగ 4-0-22-1.
శ్రీలంక ఇన్నింగ్స్ : నిశాంక (బి) మావి 1, కుశాల్ (సి) శాంసన్ (బి) హర్షల్ 28, డిసిల్వ (సి) శాంసన్ (బి) మావి 8, అసలంక (సి) కిషన్ (బి) మాలిక్ 12, రాజపక్స (సి) పాండ్య (బి) హర్షల్ 7, శనక (సి) చాహల్ (బి) మాలిక్ 45, హసరంగ (సి) పాండ్య (బి) మావి 21, కరుణరత్నె నాటౌట్ 23, తీక్షణ (సి) సూర్య (బి) మావి 1, రజిత (రనౌట్) 5, మధుశంక రనౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 6, మొత్తం : (20 ఓవర్లలో 10 వికెట్లకు) 160.
వికెట్ల పతనం : 1-12, 2-24, 3-47, 4-51, 5-68, 6-108, 7-129, 8-132, 9-159, 10-160.
బౌలింగ్ : హార్దిక్ 3-0-12-0, మావి 4-0-22-4, మాలిక్ 4-0-27-2, చాహల్ 2-0-26-0, హర్షల్ 4-0-41-2, అక్షర్ 3-0-21-0.