Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోకాలి గాయాలకు తక్షణ శస్త్రచికిత్స
ముంబయి : భారత క్రికెటర్ రిషబ్ పంత్‌ను ఎయిర్ అంబులెన్స్‌లో డెహ్రాడూన్ నుంచి ముంబయికి తీసుకొచ్చారు. డిసెంబర్ 30న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్ బుధవారం వరకు డెహ్రాడూన్‌లోని మాక్స్ హాస్పిటల్లో చికిత్స అందించారు. తల, వెన్నెముక ఎంఆర్ఐ స్కానింగ్‌లు సాధారణంగా రావటంతో మాక్స్ హాస్పిటల్లోనే పంత్‌కు చికిత్స కొనసాగించారు. కానీ రిషబ్ పంత్ మోకాలి గాయాలకు (లిగమెంట్ టియర్) తక్షణ శస్త్రచికిత్స అవసరమని వైద్య బృందం భావించింది. వైద్యుల సూచనల మేరకు రిషబ్ పంత్ విమాన అంబులెన్స్‌లో ముంబయికి చేర్చారు. ముంబయిలోని కోకిలాబెన్ ధీరూబారు అంబాని హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో రిషబ్ పంత్‌కు శస్త్రచికిత్స చేయనున్నారు. గతంలో సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా, జశ్‌ప్రీత్ బుమ్రా సహా ఒలింపిక్ అథ్లెట్లకు వైద్య చికిత్స అందించిన డాక్టర్. దిన్షా పర్దవాలా పర్యవేక్షణలో పంత్‌కు సర్జరీ చేయనున్నారు.
బీసీసీఐ కీలక నిర్ణయం : డెహ్రాడూన్‌లోని మాక్స్ హాస్పిటల్ వైద్యులతో కలిసి బీసీసీఐ వైద్యుల ప్యానల్ పంత్‌కు చికిత్స అందించింది. రిషబ్ పంత్ మోకాలి గాయాలకు ఇప్పటికీ ఎంఆర్ఐ స్కానింగ్ తీయాల్సి ఉంది. పలుమార్లు రిషబ్ పంత్‌ను పరిశీలించిన వైద్య బృందం అతడి మోకాలి గాయాలకు తక్షణ చికిత్స అవసరమని భావించారు. ఈ విషయాన్ని బీసీసీఐ వైద్య బృందం బీసీసీఐ ఆఫీస్ బేరర్లకు తెలియజేసింది. దీంతో బీసీసీఐ సొంత ఖర్చుతో రిషబ్ పంత్ కోసం విమాన అంబులెన్స్‌ను సిద్ధం చేసింది. రిషబ్ పంత్ వైద్య చికిత్సకు అయ్యే ఖర్చులు వైద్య బీమా కిందకు రానుండగా.. ఎయిర్ అంబులెన్స్ ఖర్చు బీసీసీఐ భరించనుంది. యువ క్రికెటర్ కోసం బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ క్రికెటర్లు, అభిమానులు స్వాగతించారు.
ఇక బోర్డు పర్యవేక్షణ : రిషబ్ పంత్‌ను ఎయిర్ అంబులెన్స్‌లో ముంబయికి తీసుకొచ్చిన బీసీసీఐ.. ఇక నుంచి అతడి వైద్య చికిత్స, రిహాబిలిటేషన్ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించనుంది. ముంబయిలోని కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రిలో శస్త్రచికిత్స అనంతరం రిహాబిలిటేషన్ బాధ్యతను సైతం బోర్డు తీసుకోనుంది. 'రిషబ్ పంత్ లిగమెంట్ టియర్ గాయాలకు శస్త్రచికిత్స అవసరం. పంత్ రికవరీ, రిహాబిలిటేషన్ ప్రక్రియను బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తుంది. రిషబ్ పంత్ కోలుకునేందుకు అవసరమైన వైద్యం అందించేందుకు బోర్డు అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఈ సమయంలో రిషబ్ పంత్‌కు అన్ని విధాలుగా బోర్డు అండగా నిలుస్తుంది' అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
రిషబ్ పంత్ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టే సమయంపై వైద్యులు కచ్చితంగా ఏమీ చెప్పటం లేదు. తీవ్ర ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న రిషబ్ పంత్ కనీసం 3-6 నెలలు క్రికెట్‌కు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పంత్ మోకాలి గాయలకు సర్జరీల అనంతరం పూర్తి సమాచారం వెల్లడించే అవకాశం ఉంది. ఈ ఏడాది భారత్ మూడు ప్రధాన ఈవెంట్లకు సిద్ధమవుతోంది. అక్టోబర్-నవంబర్‌లో వన్డే వరల్డ్‌కప్ ఉండగా, జూన్‌లో ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఆడాల్సి ఉంది. మార్చిలో ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్, ఆ వెంటనే ఐపీఎల్ 2023 సీజన్. ఆసీస్‌తో టెస్టులు, ఐపీఎల్‌కు రిషబ్ పంత్ అందుబాటులో ఉండేది, లేనిది మరో వారం రోజుల్లో తేలనుంది.