Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొదలైన టికెట్ల అమ్మకాలు
ఫిబ్రవరి 11న ప్రధాన రేసు
నవతెలంగాణ-హైదరాబాద్
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైదరాబాద్ గ్రాండ్ ప్రీ (ఫార్ములా ఈ) రేసు దిశగా తొలి అడుగు పడింది. ఫార్ములా ఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భాగంగా మొత్తం 17 రౌండ్ల రేసులు నిర్వహిస్తారు. ఈ ఏడాది చాంపియన్‌షిప్‌లో నాల్గో రేసుకు తొలిసారి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2013 తర్వాత తొలిసారి భారత్ అంతర్జాతీయ రేసింగ్ (ఫార్ములా) ఈవెంట్‌కు వేదిక కానుండగా.. 2026 వరకు ఫార్ములా ఈ రేసు ఆతిథ్య హక్కులు హైదరాబాద్ సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 11న హైదరాబాద్ గ్రాండ్ ప్రీ రేసు జరుగనుండగా.. ఫిబ్రవరి 10న 11 జట్ల నుంచి 22 మంది డ్రైవర్లు ఫుల్ స్పీడ్‌తో ప్రాక్టీస్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఫార్ములా ఈ రేసు ఈవెంట్లను టికెట్లను నిర్వాహకులు బుధవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు.
నాలుగు విభాగాల్లో.. : ఫార్ములా ఈ రేసు టికెట్లను నాలుగు విభాగాల్లో అందుబాటులో ఉంచారు. రూ.1000, రూ.3500, రూ.6000, రూ.10000 ధరకు నాలుగు విభాగాల్లో టికెట్లను అమ్మకానికి ఉంచారు. గతంలో ఆస్ట్రేలియాతో భారత్ టీ20 మ్యాచ్ సందర్భంగా ఆఫ్‌లైన్ టికెట్ల కౌంటర్ల వద్ద తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకుని 22,500 టికెట్లను ఆన్లైన్లోనే ఉంచినట్టు పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ది మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ వెల్లడించారు. బుక్‌మైషో యాప్ నుంచి తొలి టికెట్‌ను అరవింద్ కుమార్ కొనుగోలు చేశారు.
ట్రాక్‌కు గ్రీన్ సిగల్ : హుస్సేన్ సాగర తీరంలో 2.8 కిలోమీటర్ల రేసింగ్ ట్రాక్‌కు అంతర్జాతీయ ఆటోమోబైల్ సమాఖ్య ఆమోదం లభించింది. ఇండియన్ రేసింగ్ లీగ్ ఫైనల్స్ సందర్భంగా ఎఫ్ఐఏ ప్రతినిధి రెండు రోజుల పర్యటనకు హైదరాబాద్‌కు వచ్చారు. ట్రాక్‌పై సంతృప్తి వ్యక్తం చేసినా, పలు మార్పులను సైతం సూచించారు. ఈ మేరకు ఇప్పటికే రేసింగ్ ట్రాక్‌లో మార్పులు చేస్తున్నారు. ప్రపంచ శ్రేణి లెవల్-2 ట్రాక్ సర్టిఫికెట్ ఆశిస్తోన్న హైదరాబాద్..ఐఆర్ఎల్ అనుభవాలను గమనంలో ఉంచుకుని ఫార్ములా ఈ రేసును లోపరహితంగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తోంది. ఫిబ్రవరి 10, 11న జరిగే హైదరాబాద్ గ్రాండ్ ప్రీ కోసం గంటలకు 335 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్లే జనరేషన్ 3 ఎలక్రిక్ కార్లను ప్రత్యేకంగా తయారు చేశారు. ఆలోమోటివ్ దిగ్గజాలు మెక్లారెన్, మసరెటి, పొర్షే, జాగ్వార్, నిసాన్ కార్లతో దేశీయ మహింద్రా కార్లు పోటీపడనున్నాయి. ఫిబ్రవరి 10న మధ్యాహ్నాం 12 నుంచి 4.30 వరకు ప్రాక్టీస్ సెషన్, మళ్లీ ఫిబ్రవరి 11 ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 వరకు ప్రాక్టీస్ సెషన్ ఉండనుంది. ఫిబ్రవరి 11 సాయంత్రం 4.30 గంటలకు ప్రధాన రేసు నిర్వహిస్తారు. ప్రాక్టీస్ సెషన్లను వీక్షించేందుకు టికెట్లు లేకుండానే అభిమానులను అనుమతించనున్నారు.
ఈ మొబిలిటి షో : హైదరాబాద్ ఫార్ములా ఈ రేసుకు తెలంగాణ ప్రభుత్వం సైతం ఓ భాగస్వామి. అంతర్జాతీయ ఫార్ములా ఈ రేసుకు ముందు ఈ మొబిలిటి ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఫిబ్రవరి 6 నుంచి హైదరాబాద్‌లో స్థిరత్వం, ఈ మొబిలిటి షో ఆరంభం కానుంది. పర్యావరణ అనుకూల, కాలుష్య రహిత ఎలక్రిక్ వాహనాల వినియోగాన్ని ఈ ఈవెంట్ ద్వారా ప్రోత్సహించనున్నారు.