Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో టీ20లో భారత్ ఓటమి
- అక్షర్, సూర్య, మావి పోరాటం వృథా
- టీ20 సిరీస్ 1-1తో సమం
లక్ష్యం 207. 57 పరుగులే 5 వికెట్లు పడ్డాయి. ఇక మ్యాచ్‌పై ఆశలు వదులుకున్న పరిస్థితి. అక్షర్ (51), అక్షర్ (65) అర్థ సెంచరీలతో భారత్‌ను రేసులోకి తీసుకొచ్చారు. చివర్లో శివం మావి (26) వీరోచిత బ్యాటింగ్‌తో ఛేదన ఉత్కంఠగా మారింది. ఆఖరు 6 బంతుల్లో 21 పరుగులు అవసరం కాగా పోరాడినా భారత్‌కు పరాభవం తప్పలేదు. పుణె టీ20లో గెలుపొందిన శ్రీలంక సిరీస్‌ను 1-1తో సమం చేసింది. నిర్ణయాత్మక మూడో టీ20 ఆదివారం రాజ్‌కోట్‌లో జరుగనుంది.
నవతెలంగాణ-పుణె
శ్రీలంక సిరీస్ సమం చేసింది. పరుగుల వరద పారిన పుణె టీ20లో శ్రీలంక 16 పరుగుల తేడాతో భారత్‌పై గెలుపొందింది. 207 పరుగుల ఛేదనలో భారత్ 20 ఓవర్లలో 190 పరుగులే చేసింది. ఓ దశలో 57/5తో పీకల్లోతు కష్టాల్లో కూరుకున్న భారత్.. సూర్య కుమార్ (51, 36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), అక్షర్ పటేల్ (65, 31 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో రేసులోకి వచ్చింది. శివం మావి (26, 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) సైతం రెచ్చిపోయాడు. అయినా, భారత్ విజయానికి దూరంగానే నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 206 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (52, 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), శనక (56 నాటౌట్, 22 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో చెలరేగారు. ఇన్నింగ్స్‌లో ఏడు నో బాల్స్ వేసిన భారత బౌలర్లు.. శ్రీలంక బ్యాటర్లు భారీ స్కోరు చేసేందుకు అవకాశం కల్పించారు.
సూర్య, అక్షర్ మెరిసినా.. : ఓటమి ఖాయమని భావించిన తరుణంలో జతకట్టిన సూర్య, అక్షర్ పటేల్ ఆరో వికెట్‌కు 91 పరుగులు జోడించారు. రనౌట్ ప్రమాదం నుంచి బయటపడ్డ అక్షర్ అక్కడ్నుంచి ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. హసరంగ ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన అక్షర్.. అదే ఊపులో 20 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. సూర్య సైతం సిక్సర్లు బాదటంతో భారత్ లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. సూర్య, అక్షర్ అర్థ సెంచరీలతో భారత్ ఆశలు చిగురించాయి. భారీ షాట్‌కు వెళ్లి సూర్య (51) వికెట్ కోల్పోవటంతో మ్యాచ్ మళ్లీ శ్రీలంక చేతుల్లోకి వెళ్లిపోయింది. కానీ శివం మావి సంచలన హిట్టింగ్తో ఛేదన ఉత్కంఠగా మారింది. చివరి 12 బంతుల్లో 33 పరుగులు చేయాల్సిన తరుణంలో భారత్ మ్యాచ్‌ను చేజార్చుకుంది. 20 ఓవర్లలో 190 పరుగులకే పరిమితమైంది.
టాప్ విఫలం : లక్ష్యం 207 పరుగులు. దూకుడుగా ఆడేందుకు చూసిన భారత్ కొత్త వ్యూహంలో బోల్తా కొట్టింది. ఓపెనర్లు కిషన్ (2), గిల్ (5), అరంగేట్ర రాహుల్ త్రిపాఠి (5) సహా కెప్టెన్ హార్దిక్ పాండ్య (12), దీపక్ హుడా (9) విఫలమయ్యారు. పిచ్ నుంచి స్వింగ్, సీమ్ రాబట్టిన శ్రీలంక పేసర్లు భారత బ్యాటర్లను గొప్పగా కట్టడి చేశారు. శ్రీలంక బౌలర్ల మెరుపులతో భారత్ 57 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఓటమి కోరల్లో చిక్కుకుంది.
శనక, మెండిస్ మెరిసే : టాస్ నెగ్గి తొలుత బౌలింగ్ ఎంచుకున్న భారత్‌కు శ్రీలంక ధనాధన్ షాకిచ్చింది. తొలి ఓవర్ నుంచే ఎదురుదాడి చేసిన ఓపెనర్లు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. పవర్‌ప్లేలో 55 పరుగులు పిండుకున్న ఓపెనర్లు.. భారీ స్కోరుకు గట్టి పునాది వేశారు. కుశాల్ మెండిస్ (52), నిశాంక (33) తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించారు. నాలుగు సిక్సర్లు, మూడు ఫోర్లతో 27 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదాడు మెండిస్. భారత పేసర్లు, స్పిన్నర్లు నో బాల్స్ వేయటం శ్రీలంకకు బాగా కలిసొచ్చింది. ఓపెనర్ల మెరుపుల అనంతరం భారత బౌలర్లు పుంజుకున్నారు. వరుస వికెట్లతో శ్రీలంకను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. కానీ కెప్టెన్ శనక (56 నాటౌట్) విధ్వంసక ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. 138/6 వద్ద క్రీజులోకి వచ్చిన శనక.. అర్షదీప్ నో బాల్‌కు క్యాచౌట్ అయినా జీవనదానం పొందాడు. ఆ తర్వాత అతడిని ఆపటం సాధ్యపడలేదు. ఐదు సిక్సర్లు, రెండు ఫోర్లతో దండెత్తిన శనక 20 బంతుల్లోనే అర్థ సెంచరీ కొట్టాడు. శ్రీలంక తరఫున ఇదే వేగవంతమైన అర్థ శతకం. చివరి రెండు ఓవర్లలో అర్షదీప్, శివం మావిలపై చెలరేగిన శనక శ్రీలంకకు 200 ప్లస్ స్కోరు అందించాడు. 2010 తర్వాత భారత్‌పై 200 మార్క్ దాటడం శ్రీలంకకు ఇదే ప్రథమం. ఓవరాల్‌గా 64 టీ20ల అనంతరం శ్రీలంక 200 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో మాలిక్ (3/48), అక్షర్ పటేల్ (2/24) వికెట్లు పడగొట్టారు. అర్షదీప్, మావి, మాలిక్ ధారాళంగా పరుగులు ఇచ్చారు.
శ్రీలంక ఇన్నింగ్స్ : నిశాంక (సి) త్రిపాఠి (బి) అక్షర్ 33, మెండిస్ (ఎల్బీ) చాహల్ 52, భానుక (బి) మాలిక్ 2, అసలంక (సి) గిల్ (బి) మాలిక్ 37, డిసిల్వ (సి) దీపక్ (బి) అక్షర్ 3, శనక నాటౌట్ 56, హసరంగ (బి) మాలిక్ 0, కరుణరత్నె నాటౌట్ 11, ఎక్స్‌ట్రాలు : 12, మొత్తం : (20 ఓవర్లలో 6 వికెట్లకు) 206.
బౌలింగ్ : పాండ్య 2-0-13-0, అర్షదీప్ సింగ్ 2-0-37-0, శివం మావి 4-0-53-0, అక్షర్ పటేల్ 4-0-24-2, చాహల్ 4-0-30-1, ఉమ్రాన్ మాలిక్ 4-0-48-3.
భారత్ ఇన్నింగ్స్ : ఇషాన్ (బి) రజిత 2, గిల్ (సి) మహీశ్ (బి) రజిత 5, త్రిపాఠి (సి) మెండిస్ (బి) మధుశంక 5, సూర్య (సి) హసరంగ (బి) మధుశంక 51, పాండ్య (సి) మెండిస్ (బి) కరుణరత్నె 12, దీపక్ (సి) డిసిల్వ (బి) హసరంగ 9, అక్షర్ (సి) కరుణరత్నె (బి) శనక 65, మావి (సి) మహీశ్ (బి) శనక 26, మాలిక్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 14, మొత్తం : (20 ఓవర్లలో 8 వికెట్లకు) 190.
బౌలింగ్ : మధుశంక 4-0-45-2, రజిత 4-0-22-2, కరుణరత్నె 4-0-41-1, హసరంగ 3-0-41-1, మహీశ్ 4-0-33-0, శనక 1-0-4-0.