Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసియా కప్ 2023
దుబాయ్ : ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు అత్యంత క్షీణ దశకు చేరుకోవటంతో ఐసీసీ, ఏసీసీ ఈవెంట్లలోనే ముఖాముఖి పోటీపడుతున్న దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్. 2021, 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లలో సహా 2022 ఆసియా కప్‌లో సైతం భారత్, పాకిస్థాన్‌లు ముఖాముఖి తలపడ్డాయి. తాజాగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) వార్షిక క్యాలెండర్లు ఆవిష్కరించగా.. 2023 మెన్స్ ఆసియా కప్‌లో సైతం భారత్, పాకిస్థాన్ గ్రూప్ దశలో ధనాధన్‌కు సిద్ధం కానున్నాయి. గ్రూప్-1లో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంకతో పాటు భారత్, పాకిస్థాన్ పోటీపడనున్నాయి. మరో గ్రూప్‌లో అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్, ఓ క్వాలిఫయర్ జట్టు ఆడనుంది. 2023 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌కు సన్నాహాక టోర్నీగా 2023 ఏసీసీ ఆసియా కప్‌ను నిర్వహించనున్నారు. గ్రూప్ దశలో ఆరు జట్లు రెండు గ్రూపులుగా ఆడనున్నాయి. రెండు గ్రూప్‌ల నుంచి టాప్-2 జట్లు సూపర్4 దశకు చేరుకుంటాయి. సూపర్4లో ప్రతి జట్టు ఇతర మూడు జట్లతో ఆడుతుంది. టాప్-2లో నిలిచిన జట్లు నేరుగా ఫైనల్లో తలపడతాయి. గ్రూప్ దశలో ఆరు, సూపర్4లో ఆరు మ్యాచులు, ఫైనల్ సహా మొత్తం 13 మ్యాచులతో టోర్నీ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ గురువారం క్రికెట్ క్యాలెండర్ విడుదల చేసింది.