Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాత కమిటీ చీఫ్‌నే కొనసాగించిన సీఏసీ
- నూతన సెలక్షన్ కమిటీ నియామకం
ముంబయి : బీసీసీఐ ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా చేతన్ శర్మ పున నియమితులయ్యారు. శివ సుందర్ దాస్, సలిల్ అంకోల, సుబ్రతో బెనర్జీ, శరత్‌లు సెలక్షన్ కమిటీ సభ్యులుగా ఎంపికయ్యారు. ఈ మేరకు బీసీసీఐ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. ముగ్గురు సభ్యులతో కూడిన బీసీసీఐ క్రికెట్ సలహా సంఘం (సీఏసీ) సిఫారసుల మేరకు బోర్డు నూతన సెలక్షన్ కమిటీని నియమించింది.
600 మంది : నిరుడు నవంబర్‌లో సీనియర్ సెలక్షన్ కమిటీపై బీసీసీఐ వేటు వేసింది. ఆ వెంటనే సెలక్షన్ కమిటీని నియమించేందుకు అశోక్ మల్హోత్రా, సులక్షణ నాయక్, జతిన్ పరంజిపెలతో క్రికెట్ సలహా సంఘాన్ని ఏర్పాటు చేసింది. సీనియర్ సెలక్షన్ కమిటీలో పని చేసేందుకు 600 మంది నుంచి దరఖాస్తులు వచ్చాయి. బీసీసీఐ సూచించిన అర్హత ప్రకారం 600 మంది రేసులో నిలిచినా.. క్రికెట్ సలహా సంఘం 11 మందితో కూడిన జాబితాను సిద్ధం చేసింది. డిసెంబర్ 30న బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో 11 మందిని సీఏసీ ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూ చేసిన 11 మంది నుంచి సీఏసీ ఐదుగురు సభ్యులను ఎంపిక చేసింది. నూతన సెలక్షన్ కమిటీ రానున్న భారత్, న్యూజిలాండ్ వైట్‌బాల్ సిరీస్‌ను జట్లను ఎంపిక చేయనుంది.
ముందే సంకేతం! : 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ పరాజయం అనంతరం సీనియర్ సెలక్షన్ కమిటీపై బీసీసీఐ వేటు వేసింది. 2021, 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లు సహా 2022 ఆసియా కప్‌కు జట్లను ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీని చేతన్ శర్మ సారథ్యం వహించారు. పాత సెలక్షన్ కమిటీని రద్దు చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకున్నప్పటికీ.. చేతన్ శర్మను కొనసాగించేందుకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. నవంబర్‌లో సెలక్షన్ కమిటీపై వేటు పడినా.. ఆ తర్వాత రంజీ సీజన్‌ను పాత సెలక్షన్ కమిటీ సభ్యులే పర్యవేక్షించారు. భారత క్రికెట్ సమీక్షా సమావేశంలో సైతం జట్టు మేనేజ్మెంట్తో పాటు చేతన్ శర్మ పాల్గొన్నారు. ఆ సమావేశంలో భారత క్రికెట్ రోడ్‌మ్యాప్‌ను సైతం చర్చించారు. కీలక సమావేశానికి చేతన్ శర్మ హాజరు కావటంతో నూతన సెలక్షన్ కమిటీకి సైతం అతడే చైర్మెన్‌గా కొనసాగుతాడనే సంకేతాలు బోర్డు ఇచ్చింది.
నూతన సెలక్షన్ కమిటీ : చేతన్ శర్మ (చైర్మెన్), శివ సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలిల్ అంకోలా, శ్రీధరన్ శరత్.