Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్యాట్‌తో సూర్య ప్రతాపం, బంతితో బౌలర్ల సమిష్టితత్వం భారత్‌కు ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టాయి. సూర్యకుమార్ యాదవ్ (112 నాటౌట్) అజేయ సెంచరీతో విశ్వరూపం చూపించగా రాజ్‌కోట్‌లో టీమ్ ఇండియా రాజసం చూపించింది. నిర్ణయాత్మక మ్యాచ్‌లో శ్రీలంకపై 91 పరుగులతో ఘన విజయం సాధించింది. టీ20 సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. భారత్, శ్రీలంక తొలి వన్డే మంగళవారం గువహటిలో జరుగనుంది.
- మిస్టర్ 360 అజేయ శతకం
- రాణించిన త్రిపాఠి, గిల్, అక్షర్
- నిర్ణయాత్మక టీ20లో భారత్ గెలుపు
- 2-1తో టీ20 సిరీస్ కైవసం
నవతెలంగాణ-రాజ్‌కోట్ : ఉత్కంఠ టీ20 సిరీస్‌కు ఏకపక్ష ముగింపు. చివరి టీ20లో భారత్ 91 పరుగుల తేడాతో గెలుపొందగా శ్రీలంకపై టీ20 సిరీస్ 2-1తో టీమ్ ఇండియా వశమైంది. సూర్యకుమార్ యాదవ్ (112 నాటౌట్, 51 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లు) అజేయ శతక విధ్వసంతో కదం తొక్కాడు. శుభ్‌మన్ గిల్ (46, 36 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), రాహుల్ త్రిపాఠి (35, 16 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), అక్షర్ పటేల్ (21 నాటౌట్, 9 బంతుల్లో 4 ఫోర్లు) ధనాధన్ ఇన్నింగ్స్‌లతో చెలరేగారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 229 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక ఛేదనలో శ్రీలంక చేతులెత్తేసింది. భారత బౌలర్ల మెరుపులతో 16.4 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. మెండిస్ (23), డిసిల్వ (22), శనక (23) మాత్రమే చెప్పుకోదగిన పరుగులు చేశారు.
శ్రీలంక ఢమాల్ : 230 పరుగుల ఛేదనలో శ్రీలంక 137 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు దూకుడగా 44 పరుగులు జోడించినా.. ఆ తర్వాత ఏ బ్యాటర్ క్రీజులో నిలువలేదు. అర్షదీప్ (3/20), పాండ్య (2/30), మాలిక్ (2/31), చాహల్ (2/30) విజృంభించారు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన శ్రీలంక ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. 96/5తో మ్యాచ్‌పై ఆశలు ఆవిరి చేసుకున్న శ్రీలంక.. 16.4 ఓవర్లలోనే పోరాటం ముగించుకుంది.
త్రిపాఠి దూకుడు : టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఓపెనర్ ఇషాన్ కిషన్ (1) తొలి ఓవర్లోనే నిష్క్రమించాడు. రజిత వేసిన రెండో ఓవర్‌ను శుభ్‌మన్ గిల్ (46) మెయిడిన్ ఓవర్‌గా ఆడాడు. దీంతో పవర్‌ప్లేలో విలువైన రెండు ఓవర్లలో భారత్ వెనుకంజ వేసింది. నం.3 బ్యాటర్ రాహుల్ త్రిపాఠి (35) మూడో ఓవర్ నుంచి ఎదురుదాడి మొదలెట్టాడు. మధుశంకపై రెండు ఫోర్లు, ఓ సిక్సర్ బాదటంతో భారత్ ట్రాక్‌పైకి వచ్చింది. రజిత మరో ఓవర్లో బౌండరీ లేకుండా కట్టడి చేశాడు. ఈ సారి తీక్షణపై దండెత్తిన త్రిపాఠి ఏకంగా మూడు ఫోర్లు కొట్టాడు. కరుణరత్నెపై వరుస సిక్సర్లు బాదిన త్రిపాఠి ధనాధన్ జోష్ తీసుకొచ్చాడు. కానీ అదే ఓవర్లో వికెట్ కోల్పోయాడు. పవర్‌ప్లే ముగిసే సరికి భారత్ 53/2తో మెరుగైన స్థితిలో నిలిచింది.
సూర్య షో : పవర్‌ప్లేలో చివరి బంతిని ఎదుర్కొన్న సూర్య కుమార్ (112 నాటౌట్) సునామీ ముంగిట నిశ్శబ్దం తరహాలో తొలి బంతికి పరుగులేమీ చేయలేదు. ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో కరుణరత్నెపై మొదలైన సూర్య సునామీ ఇక ఎక్కడా ఆగలేదు. 4, 6తో ధనాధన్ మొదలెట్టిన సూర్య.. శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 26 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు. అర్థ సెంచరీ అనంతరమే మిస్టర్ 360 షో షురూ చేశాడు. తర్వాతి 50 పరుగులను 19 బంతుల్లోనే పిండుకున్న సూర్య.. సిక్సర్ల సునామీ సృష్టిం చాడు. తీక్షణపై రెండు, మధుశంకపై రెండు, రజితపై మరో సిక్సర్‌తో 45 బంతుల్లోనే కెరీర్ మూడో టీ20 సెంచరీ సాధించాడు. 40 బంతుల్లోనే 95 పరుగులు పిండుకున్న సూర్య.. మూడెంకల స్కోరుకు మరో ఐదు బంతులను తీసుకున్నాడు. ఈ సమయంలో గిల్ మరో ఎండ్‌లో సూర్యకు చక్కగా సహకరించాడు. నెమ్మదిగా ఆడినా వేగం పుంజుకున్న గిల్ అర్థ సెంచరీ ముంగిట వికెట్ కోల్పోయాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్య (4), దీపక్ హుడా (4) వెన్వెంటనే నిష్క్రమించినా.. అక్షర్ పటేల్ (21 నాటౌట్) జతగా భారత్‌కు భారీ స్కోరు అందించాడు. అక్షర్ నాలుగు బౌండరీలతో విశ్వరూపం చూపించాడు. సూర్య, అక్షర్ మెరుపులతో భారత్ 229 పరుగుల భారీ స్కోరు సాధించింది. శ్రీలంక బౌలర్లలో మధుశంక (2/55) రజిత (1/35), కరుణరత్నె (1/52), హసరంగ (1/36) వికెట్లు తీసుకున్నారు.
భారత్ ఇన్నింగ్స్ : ఇషాన్ కిషన్ (సి) డిసిల్వ (బి) మధుశంక 1, శుభ్‌మన్ గిల (బి) హసరంగ 46, రాహుల్ త్రిపాఠి (సి) మధుశంక (బి) కరుణరత్నె 35, సూర్యకుమార్ నాటౌట్ 112, హార్దిక్ పాండ్య (సి) డిసిల్వ (బి) రజిత 4, దీపక్ హుడా (సి) హసరంగ (బి) మధుశంక 4, అక్షర్ పటేల్ నాటౌట్ 21, ఎక్స్‌ట్రాలు : 6, మొత్తం : (20 ఓవర్లలో 5 వికెట్లకు) 229.
వికెట్ల పతనం : 1-3, 2-52, 3-163, 4-174, 5-189.
బౌలింగ్ : మధుశంక 4-0-55-2, రజిత 4-1-35-1, మహీశ్ తీక్షణ 4-0-48-0, కరుణరత్నె 4-0-52-1, హసరంగ 4-0-36-1.
శ్రీలంక ఇన్నింగ్స్ : నిశాంక (సి) మావి (బి) అర్షదీప్ 15, మెండిస్ (సి) మాలిక్ (బి) అక్షర్ 23, ఫెర్నాండో (సి) అర్షదీప్ (బి) పాండ్య 1, డిసిల్వ (సి) గిల్ (బి) చాహల్ 22, అసలంక (సి) మావి (బి) చాహల్ 19, శనక (సి) అక్షర్ (బి) అర్షదీప్ 23, హసరంగ (సి) హుడా (బి) మాలిక్ 9, కరుణరత్నె (ఎల్బీ) పాండ్య 0, తీక్షణ (బి) మాలిక్ 2, రజిత నాటౌట్ 9, మధుశంక (బి) అర్షదీప్ 1, ఎక్స్‌ట్రాలు : 13, మొత్తం :(16.4 ఓవర్లలో ఆలౌట్) 137.
వికెట్ల పతనం : 1-44, 2-44, 3-51, 4-84, 5-96, 6-107, 7-123, 8-127, 9-135, 10-137.
బౌలింగ్ : హార్దిక్ పాండ్య 4-0-30-2, అర్షదీప్ 2.4-0-20-3, శివం మావి 1-0-6-0, అక్షర్ పటేల్ 3-0-19-1, ఉమ్రాన్ మాలిక్ 3-0-31-2, చాహల్ 3-0-30-2.