Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2023. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ ఏడాది. అగ్ర జట్లు టైటిల్ ప్రణాళికలు మొదలు పెట్టేశాయి. కానీ 2023 మరో మెగా ఈవెంట్‌కు సైతం రంగం సిద్ధం చేసింది. అదే, ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్. ఈ ఏడాది జూన్‌లో జరుగనున్న ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు రసవత్తరంగా మారింది. రెండు ఫైనల్ బెర్తుల కోసం నాలుగు జట్లు పోటీపడుతున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు ఐదు రోజుల ఆటకు సరికొత్త ఉత్కంఠను తీసుకొచ్చింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకునే అవకాశాలు ఏ జట్టకు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దామా!.
- రెండు బెర్తులు, నాలుగు జట్లు
- ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్
నవతెలంగాణ క్రీడావిభాగం
ఆసీస్ అడుగేసిందా?!
దక్షిణాఫ్రికాపై 2-0తో టెస్టు సిరీస్ గెలుపొందిన ఆస్ట్రేలియా.. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో దాదాపుగా అడుగుపెట్టేసింది. 10 టెస్టుల్లో విజయాలు సాధించిన కంగారూ జట్టు 75.56 గెలుపు శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. 2023 ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఆడటం దాదాపుగా ఖాయం. కానీ ఆస్ట్రేలియా సైతం ఫైనల్ బెర్త్ చేజార్చుకునే అవకాశాలు లేకపోలేదు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్‌కు నాలుగు టెస్టులనూ కోల్పోయి, అదే సమయంలో న్యూజిలాండ్‌పై శ్రీలంక సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే ఆస్ట్రేలియా అవకాశాలు గల్లంతు అవుతాయి.
భారత్ చేతిలో 0-4 సిరీస్ పరాజయం ఆస్ట్రేలియా పాయింట్ల/గెలుపు శాతాన్ని 59.65కు తగ్గిస్తుంది. ఇదే సమయంలో న్యూజిలాండ్ పర్యటనలో శ్రీలంక 2-0తో టెస్టు సిరీస్ నెగ్గితే లంకేయుల శాతం 61.11కు గణనీయంగా పెరుగుతుంది. అయితే, శ్రీలంక ఒక్క టెస్టులో నెగ్గి 1-0తో సిరీస్ నెగ్గినా ఆసీస్ ఫైనల్‌కు చేరుకుంటుంది. 1-0 విజయంతో శ్రీలంక శాతం 55.66కు రానుండగా.. ఆస్ట్రేలియా 0-4తో ఓడినా ఆ జట్టు శాతం శ్రీలంక కంటే మెరుగ్గా ఉంటుంది. ఇతర జట్లు, సమీకరణాలతో సంబంధం లేకుండా ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆసీస్ చేరుకోవాలంటే.. భారత్‌పై ఆ జట్టు కనీసం ఒక్క టెస్టునైనా డ్రా చేసుకోవాలి. ఇదే సమయంలో స్లో ఓవర్‌రేట్ కారణంగా పెనాల్టీ పాయింట్లకు గురి కావద్దు. ఓ టెస్టును డ్రా చేసుకుని 0-3తో భారత్‌కు సిరీస్‌ను కోల్పోయినా.. ఆస్ట్రేలియా శాతం 61.40గా ఉండనుంది. అప్పుడు శ్రీలంక 2-0తో కివీస్‌పై క్లీన్‌స్వీప్ చేసినా ప్రయోజనం ఉండదు. భారత్, ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడతాయి.
భారత్ ఏం చేయాలి?!
ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకునే క్రమంలో భారత్ కఠిన సవాల్ ఎదుర్కొంటుంది. భారత్ ఇంకో నాలుగు టెస్టులు ఆడాల్సి ఉంది. ఈ నాలుగు టెస్టుల్లో కేవలం ఒక్క టెస్టులోనే భారత్ ఓడినా.. ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. రెండు మ్యాచుల్లో ఓడితే అప్పుడు ఇతర సమీకరణాలు తెరపైకి రానున్నాయి. ఆస్ట్రేలియాపై 3-1తో సిరీస్ విజయం సాధిస్తే.. ఇతర జట్లు, సిరీస్ ఫలితాల ప్రభావం లేకుండా నేరుగా ఫైనల్‌కు చేరుకోగలదు. బంగ్లాదేశ్‌పై 2-0 టెస్టు సిరీస్ విజయంతో భారత్ పాయింట్ల/గెలుపు శాతం 58.93కి చేరుకుంది. ఐసీసీ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ ప్రస్తుతం రెండో స్థానంలో కొనసా గుతోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై భారత్ సిరీస్ ఫలితం ఆధారంగా టీమ్ ఇండియా పాయింట్ల శాతం ఇలా ఉండనుంది. 4-0 విజయంతో 68.06, 3-1 విజయంతో 62.5, 2-2 డ్రాతో 56.94 శాతంగా ఉండనున్నాయి. భారత్, ఆస్ట్రేలియా సిరీస్ 2-2 డ్రాగా ముగిసి, న్యూజిలాండ్‌పై శ్రీలంక 2-0తో నెగ్గితే భారత్ ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు దూరం కావాల్సి ఉంటుంది.
ఇక ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భారత్ 21 పాయింట్ల కంటే తక్కువ సాధిస్తే దక్షిణాఫ్రికా కంటే వెనుకంజలో పడే ప్రమాదం ఉంది. దక్షిణాఫ్రికా సొంతగడ్డపై వెస్టిండీస్‌ను 2-0తో ఓడిస్తే.. భారత్ కష్టాల్లో పడనుంది. ఆస్ట్రేలియాతో సిరీస్‌ను భారత్ 1-0తో నెగ్గినా రోహిత్‌సేన 21 కంటే ఎక్కువ పాయింట్లు సాధించగలదు. దీంతో దక్షిణాఫ్రికా కంటే ముందంజలోనే నిలుస్తుంది. ఐసీసీ డబ్ల్యూటీసీలో ప్రతి టెస్టుకు 12 పాయింట్లు ఉంటాయి. విజయం సాధిస్తే 12, టై 6, డ్రా 4 పాయింట్లు లభిస్తాయి. ఆసీస్‌తో నాలుగు టెస్టులు డ్రాగా ముగిసినా భారత్‌కు ఎటువంటి ప్రయోజనం ఉండబోదు.
సఫారీ రేసులోనే ఉందా?!
ఆస్ట్రేలియా చేతిలో 0-2 సిరీస్ పరాజయం దక్షిణాఫ్రికా అవకాశాలను దారుణంగా దెబ్బకొట్టింది. సిడ్నీ టెస్టు వాతావరణ పరిస్థితులు అనుకూలించక డ్రాగా ముగిసింది. లేదంటే, సిడ్నీ టెస్టులో ఓటమితో దక్షిణాఫ్రికా ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించేది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పాయింట్ల శాతం 48.72. స్వదేశంలో ఆ జట్టు వెస్టిండీస్‌తో రెండు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. కరీబియన్లపై 2-0 విజయం సాధిస్తే దక్షిణాఫ్రికా గెలుపు శాతం 55.56కు చేరుకుంటుంది. ఇదే సమయంలో న్యూజిలాండ్‌పై శ్రీలంక ఒక్క మ్యాచ్‌లోనే నెగ్గాలి, లేదంటే శ్రీలంక సిరీస్‌ను వదులుకోవాలి. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భారత్ పరాజయం లేదా 21 పాయింట్ల కంటే తక్కువ సాధించాలి. అప్పుడు దక్షిణాఫ్రికా ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకోగలదు. సఫారీ జట్టు అవకాశాలు ఇతర సమీకరణాలపైనే పూర్తిగా ఆధారపడ్డాయి. వెస్టిండీస్‌పై క్లీన్‌స్వీప్ చేసిన ఇతర సిరీస్ ఫలితాల కోసం ఎదురుచూడాలి.
శ్రీలంక ఫైనల్‌కు వెళ్లగలదా?
ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు ఐసీసీ డబ్లూటీసీ ఫైనల్ రేసులో శ్రీలంక లేదు. కానీ ఆసీస్, సఫారీ సిరీస్ ఫలితంతో శ్రీలంక అవకాశాలు మెరుగయ్యాయి. ప్రస్తుతం ఆ జట్టు మూడో స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్‌తో సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేస్తే శ్రీలంక పాయింట్ల శాతం 61.11గా ఉంటుంది. ఇప్పుడు ఆ జట్టు ఇతర సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా, భారత్ సిరీస్‌లో ఫలితం లంకకు అనుకూలంగా రావాలి. ఆసీస్‌పై భారత్ 4-0 విజయం సాధించినా, లేదా భారత్‌పై ఆసీస్ సిరీస్ విజయం సాధించినా శ్రీలంక జట్టుకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ సిరీస్‌లో సైతం కరీబియన్ జట్టు విజయం సాధిస్తే శ్రీలంక అవకాశాలు మరింత మెరుగవుతాయి.
ఓవరాల్‌గా 2023 ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో రెండు జట్లకు మాత్రమే నేరుగా ప్రవేశం లభించే అవకాశం కనిపిస్తోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్, ఆస్ట్రేలియాలు ఇతర సమీకరణాలతో నిమిత్తం లేకుండా ఫైనల్‌కు చేరుకునే మార్గం ఉంది. దక్షిణాఫ్రికా, శ్రీలంకకు సైతం అవకాశాలు ఉన్నప్పటికీ.. పూర్తిగా వారి చేతుల్లోనే వంద శాతం చాన్స్ లేదు. అంతిమంగా ఐసీసీ 2023 డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తులను మార్చిలో జరుగనున్న బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ సమరం తేల్చనుంది.