Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోర్డుకు స్టార్ ఇండియా వినతి
నవతెలంగాణ-ముంబయి :
భారత క్రికెట్ స్పాన్సర్షిప్ సమస్యలు ఎదుర్కొంటుంది. ఐపీఎల్ మీడియా హక్కుల రూపంలో కనివినీ ఎరుగని మొత్తాన్ని ఖాతాలో వేసుకున్న బీసీసీఐ.. జాతీయ జట్టు స్పాన్సర్షిప్లను చవిచూడటం కాస్త విడ్డూరమే. జాతీయ జట్టు జెర్సీ భాగస్వామి, కిట్ స్పాన్సర్‌గా ఎంపీఎల్ సంస్థ తన హక్కులను కెకెపీఎల్ (కిల్లర్)కు బదలాయించిన సంగతి తెలిసిందే. ప్రసారదారు స్టార్ ఇండియా, జెర్సీ స్పాన్సర్ బైజూస్‌లు ఇప్పుడు బోర్డుకు తలనొప్పిగా మారాయి!.
రూ.130 కోట్లు తగ్గించండి : 2018-23 ఐదేండ్ల కాలానికి భారత అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ సీజన్‌కు స్టార్ ఇండియా రూ.6138.1 కోట్లు వెచ్చించింది. ఈ ఏడాది మార్చితో ఐదేండ్ల ఒప్పందానికి తెరపడనుంది. ఈ సమయంలో కోవిడ్-19 మహమ్మారి దెబ్బకు పలు మ్యాచులు, సిరీస్‌లు రీ షెడ్యూల్ చేయాల్సి వచ్చింది. దీంతో ఐదేండ్ల ఒప్పంద మొత్తం నుంచి రూ.130 కోట్లు తగ్గించాలని బీసీసీఐకి స్టార్ ఇండియా లేఖ రాసింది. ఐపీఎల్ మీడియా హక్కులు రూ.48,390 కోట్లకు అమ్ముడుపోవటంతో రానున్న ఐదేండ్లకు జాతీయ జట్టు మీడియా హక్కులకు సైతం బోర్డు కాసుల వర్షం ఆశిస్తోంది.
ఆ సొమ్ము తీసేసుకోండి! : ఇక జాతీయ జట్టు జెర్సీ పార్ట్నర్గా బైజూస్ ఒప్పందం 2022 నవంబర్లోనే ముగిసింది. అరునా, 2023 నవంబర్‌కు రూ. 300 కోట్లకు బైజూస్ ఒప్పందం పొడగించుకుంది. రూ.140 కోట్లను బ్యాంక్ గ్యారంటీ రూపంలో చెల్లించగా, రూ.160 కోట్లను వాయిదాలు చెల్లించాల్సి ఉంది. ఆన్లైన్ ఎడ్యుటెక్ కంపెనీగా కోవిడ్-19 సమయంలో లాభాలు గడించిన బైజూస్.. ఇప్పుడు ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌తో బంధానికి ముగింపు పలకాలని భావిస్తోంది. ఒప్పంద సమయానికి ముందే తప్పుకోవాల్సి వచ్చినందుకు బ్యాంకు గ్యారంటీగా చెల్లించిన రూ.140 కోట్లను తీసుకోవాల్సిందిగా బోర్డుకు లేఖ రాసింది.
అపెక్స్ కౌన్సిల్లో చర్చ : సోమవారం వర్చువల్ సమావేశంలో అపెక్స్ కౌన్సిల్ ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించింది. సుమారు రెండు గంటల పాటు భేటీ అయిన అపెక్స్ కౌన్సిల్ స్టార్ ఇండియా, బైజూస్ అంశాలపై ఎలా ముందుకు సాగాలని చర్చించారు. ఆర్థిక సంబంధ అంశాలు కావటంతో అన్ని కోణాల్లో బోర్డు ఈ సమస్యను చర్చించింది. త్వరలోనే స్టార్ ఇండియా, బైజూస్లతో స్నేహపూర్వకంగా ఒప్పందాలు ముగించే దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.