Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళల ఐపీఎల్ ప్రాంఛైజీలకు బీసీసీఐ ఆఫర్
- జనవరి 16న మీడియా హక్కుల వేలం
నవతెలంగాణ-ముంబయి
మహిళల ఐపీఎల్‌ను లాభదాయకం గా తీర్చిదిద్దేందుకు, జట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కలిగిన సంస్థలను ఆకర్షించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆసక్తికర ఫార్ములాను తీసుకొచ్చింది. మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను ఈ ఏడాది నుంచి ఆరంభం కానుంది. జట్ల కొనుగోలుకు సంబంధించి ఐటీటీ కొనుగోలుకు జనవరి 21 వరకు గడువు ఉండగా.. ఆదాయ పంపిణీ ఫార్ములా వెల్లడించి వేలం ప్రక్రియలో పోటీ వాతావరణం తీసుకొచ్చేందుకు బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
ఐదేండ్లు 80శాతం : మహిళల ఐపీఎల్ ఐదు జట్లతో ఆరంభం కానుంది. మూడేండ్ల తర్వాత ఆరు జట్లతో లీగ్‌ను నిర్వహిస్తారు. తొలి ఐదేండ్ల పాటు 2023-27 వరకు లీగ్ ఆదాయంలో 80 శాతం వాటాను ప్రాంఛైజీలకు పంచుతారు. కేవలం 20 శాతం ఆదాయం వాటానే బోర్డు తీసుకుంటుంది. 2028-32 ఐదేండ్ల కాలంలో ఆదాయం పంపిణీ 60-40 శాతంగా ఉండనుంది. ప్రాంఛైజీలకు 60 శాతం ఆదాయం, బోర్డుకు 40 శాతం ఆదాయం దక్కనుంది. 2033 నుంచి ప్రాంఛైజీలు, బీసీసీఐ 50-50 ఆదాయం సమానంగా పంచుకోనున్నాయి. ఐపీఎల్ ఆరంభంలో సైతం బీసీసీఐ ఇటువంటి నిర్ణయాలే తీసుకుని విజయవంతమైంది.
ఆటగాళ్ల వేలం : మార్చి తొలి వారంలో మహిళల ఐపీఎల్ ఆరంభం కానుందని చెప్పవచ్చు. ఇందుకోసం ఓ వైపు ప్రాంఛైజీల వేలం ప్రక్రియ నడుస్తుండగా, మరో వైపు ఆటగాళ్ల వేలం ప్రక్రియను బోర్డు మొదలుపెట్టింది. క్యాప్డ్, అన్క్యాప్డ్ విభాగాల్లో దేశవాళీ క్రికెటర్లను రెండు కేటగిరీలుగా విభజించింది. క్యాప్డ్ విభాగం క్రికెటర్ల కనీస ధరను మూడు విభాగాలుగా చేసింది. రూ. 50 లక్షలు, రూ.40 లక్షలు, రూ.30 లక్షలు కనీస ధరగా ఉండనున్నాయి. ఇక అన్క్యాప్డ్ క్రికెటర్లకు రెండు విభాగాల్లో కనీస ధర నిర్ణయించారు. రూ. 20 లక్షలు, రూ.10 లక్షలుగా కనీస ధర తేల్చారు. మహిళల ఐపీఎల్ ఆటగాళ్ల వేలం రూ.10 లక్షల కనీస ధర నుంచి ఆరంభం కానుంది. ఇక వేలంలో ప్రాంఛైజీలకు అందుబాటులో ఉన్న మొత్తంపై బోర్డు నుంచి స్పష్టత రావాల్సి ఉంది. వేలంలోకి రావాలనుకునే క్రికెటర్లు జనవరి 26 లోగా బీసీసీఐ వద్ద పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు క్రికెటర్లకు బోర్డు నుంచి సమాచారం వెళ్లింది. క్రికెటర్ల పేరు నమోదు అంశంలో రాష్ట్ర క్రికెట్ సంఘాలతోనే బోర్డు సంప్రదింపులు జరుపుతుందని.. క్రికెటర్ల ఏజెంట్లు, మేనేజర్లతో సమాచారం పంచుకోదని బీసీసీఐ స్పష్టం చేసింది.
జనవరి 16న..! : మహిళల ఐపీఎల్ మార్కెట్ స్థాయిని, ప్రాంఛైజీల వేలంలో జట్ల ధరను ప్రభావితం చేసే అంశం మీడియా హక్కుల వేలం. జనవరి 12న మహిళల ఐపీఎల్ మీడియా హక్కుల వేలం నిర్వహించాల్సి ఉంది. కానీ బోర్డు దీన్ని ఓ నాలుగు రోజులు వాయిదా వేసింది. జనవరి 16న మీడియా హక్కులకు వేలం నిర్వహించనున్నారు. ఐదు జట్లు గ్రూప్ దశలో డబుల్ రౌండ్ రాబిన్ పద్దతిలో ఆడనున్న లీగ్‌ను ప్రసారదారులు ఎంత మొత్తానికి బిడ్ చేస్తారనే ఆసక్తి సర్వత్రా కనిపిస్తోంది. ప్రాంఛైజీల ఆదాయ పంపిణీలో కీలక వాటా మీడియా హక్కుల నుంచే రానుండటంతో.. ఇది ఐపీఎల్ జట్ల కొనుగోలుపై ప్రభావం చూపనుంది.