Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మిషన్ 2023. స్వదేశంలో జరుగనున్న ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌కు టీమ్ ఇండియా సన్నద్ధత షురూ. అక్టోబర్‌లో మెగా ఈవెంట్‌కు ముందు 15 వన్డేల్లోనే ఆడనున్న భారత్.. అన్ని విభాగాల్లో మ్యాచ్ విన్నర్లను సిద్ధం చేసేందుకు తయారవుతుంది. శ్రీలంకతో వన్డే సిరీస్‌తో భారత్ మిషన్ 2023 పట్టాలెక్కనుంది. భారత్, శ్రీలంక తొలి వన్డే నేడు.
- వన్డే వరల్డ్‌కప్ సన్నద్ధత షురూ
- భారత్, శ్రీలంక తొలి వన్డే నేడు
- మధ్యాహ్నాం 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-గువహటి
వరుసగా మూడు ప్రపంచకప్‌లలో పేలవ ప్రదర్శన చేసిన భారత జట్టు.. ఈ ఏడాది సొంతగడ్డపై జరుగనున్న 2023 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌కు మెరుగైన ప్రణాళికలతో సిద్ధం కానుంది. వన్డే వరల్డ్‌కప్ కోసం 20 మంది ఆటగాళ్లతో రోడ్‌మ్యాప్ సిద్ధం కాగా.. నేడు శ్రీలంకతో వన్డే సిరీస్‌తో మిషన్ 2023 షురూ కానుంది. కాగితంపై శ్రీలంక కంటే ఎంతో బలంగా కనిపిస్తున్న భారత్ నిజానికి అంత బలోపేతంగా లేదు. ఇదే సమయంలో శ్రీలంక సైతం మరీ అంత బలహీనంగా కనిపించటం లేదు. టీ20 సిరీస్ తరహాలో భారత్‌కు గట్టి సవాల్ విసిరేందుకు శ్రీలంక సిద్ధమవుతుండగా.. సీనియర్ ఆటగాళ్లు గాడిలో పడాలనే లక్ష్యంతో భారత్ రెఢ అయ్యింది. నేడు గువహటిలో భారత్, శ్రీలంక తొలి వన్డే పోరు.
ఆ ఇద్దరు మెరవాలని..!
శ్రీలంకపై విరాట్ కోహ్లికి తిరుగులేని రికార్డుంది. లంకేయులపై 17 ఫిఫ్టీ ప్లస్ ఇన్నింగ్స్‌లు నమోదు చేసిన కోహ్లి.. ఆ జట్టుపై 46 ఇన్నింగ్స్‌ల్లో 2220 పరుగులు పిండుకున్నాడు. ఇటీవల బంగ్లాదేశ్‌పై శతకంతో ఈ ఫార్మాట్లో ఫామ్ అందుకున్న విరాట్ స్వదేశీ వైట్‌బాల్ సీజన్‌ను మెగా ఇన్నింగ్స్‌తో మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మధ్య పేలవంగా రాణిస్తున్నాడు. బొటన వేలికి గాయంతో బంగ్లాతో పోరాడిన ఇన్నింగ్స్ మినహా ఇటీవల రోహిత్ పెద్దగా ఆకట్టుకోలేదు. టాప్ ఆర్డర్లో రోహిత్ శర్మ గాడిలో పడితే సమస్యలకు చెక్ పెట్టవచ్చు. బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీ బాదిన ఇషాన్ కిషన్ నేడు బెంచ్‌కు పరిమితం కావాల్సిందే!. రోహిత్ తోడుగా శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. కెఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయనున్నాడు. భీకర ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ తుది జట్టులో చోటు కోసం ఫామ్‌లో శ్రేయస్ అయ్యర్‌తో పోటీపడుతున్నాడు. ఈ ఇద్దరిలో ఎవరు ఆడతారో చూడాలి. బౌలింగ్ విభాగంలో మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమిలకు తోడుగా అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్లో ఒకరు తుది జట్టులో నిలువనున్నారు. స్పిన్నర్ యుజ్వెంద్ర చాహల్ సైతం చైనామన్ కుల్దీప్ యాదవ్ నుంచి పోటీ ఎదుర్కొంటున్నాడు.
పోటీ ఇవ్వగలదా?!
శ్రీలంక గత పది వన్డేల్లో గణనీయంగా మెరుగుపడింది. చివరి 10 వన్డేల్లో ఆరు విజయాలు సాధించింది. స్వదేశంలో ఆస్ట్రేలియాపై సిరీస్ విజయం సాధించిన ఉత్సాహం శ్రీలంక శిబిరంలో కనిపిస్తోంది. కెప్టెన్ శనక బాధ్యతలు అందుకున్న తర్వాత శ్రీలంక ఈ ఫార్మాట్లో మెరుగైన ప్రదర్శన చేస్తోంది. వన్డేల్లో శనకకు చెప్పుకోదగిన రికార్డు లేదు. అయినా, టీ20 ఉత్సాహంతో ఇక్కడా చివర్లో మెరుపుల కోసం ఎదురుచూస్తున్నాడు. కుశాల్ మెండిస్, అసలంక, నిశాంక, ధనంజయ డిసిల్వ, అవిష్క ఫెర్నాండో బ్యాటింగ్ విభాగంలో కీలకం. రజిత, తీక్షణ, హసరంగలు బంతితో భారత్‌కు సవాల్ విసరనున్నారు.
పిచ్, వాతావరణం
గువహటిలో ఇది రెండో వన్డే మ్యాచ్. 2018 వన్డేలో వెస్టిండీస్ 322/8 పరుగులు చేయగా, భారత్ 43వ ఓవర్లోనే ఛేదించింది. ఇది పరుగుల పిచ్ అని చెప్పవచ్చు. మంగళవారం మ్యాచ్‌కు ఎటువంటి వర్షం సూచనలు లేవు. టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది.
తుది జట్లు (అంచనా)
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్/శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, చాహల్/కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమి, అర్షదీప్ సింగ్/ఉమ్రాన్ మాలిక్.
శ్రీలంక : కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), నిశాంక, అవిష్క ఫెర్నాండో, ధనంజయ డిసిల్వ, చరిత్ అసలంక, ధశున్ శనక (కెప్టెన్), వానిందు హసరంగ, చామిక కరుణరత్నె, మహీశ్ తీక్షణ, కసున్ రజిత, లహియ్ కుమార.