Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కుల్దీప్ మాయజాలం, రాహుల్ అజేయ అర్థ సెంచరీతో ఈడెన్‌గార్డెన్స్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. పేసర్లు, స్పిన్నర్లు వికెట్ల వేటలో కదం తొక్కగా తొలుత శ్రీలంక 215 పరుగులకు కుప్పకూలింది. భారత టాప్ ఆర్డర్ విఫలమైనా పాండ్య, అక్షర్ జతగా రాహుల్ నిలబడ్డాడు. మరో మ్యాచ్ ఉండగానే 2-0తో వన్డే సిరీస్ భారత్ వశమైంది.
- కుల్దీప్ మాయ, మెరిసిన రాహుల్
- రెండో వన్డేలో భారత్ గెలుపు
- 2-0తో వన్డే సిరీస్ కైవసం
నవతెలంగాణ-కోల్‌కత
ఈడెన్‌గార్డెన్స్‌లో భారత్ జోరు కొనసాగుతుంది. శ్రీలంకపై రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో నెగ్గిన భారత్ వన్డే సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. కుల్దీప్ (3/51), సిరాజ్ (3/30) మూడు వికెట్ల ప్రదర్శనతో విజృంభించగా తొలుత శ్రీలంక 215 పరుగులకే కుప్పకూలింది. ఛేదనలో భారత టాప్ ఆర్డర్ విఫలమైనా.. కెఎల్ రాహుల్ (64 నాటౌట్, 103 బంతుల్లో 6 ఫోర్లు) అజేయ అర్థ సెంచరీతో భారత్‌ను విజయాన్ని అందించాడు. హార్దిక్ (36), అక్షర్ (21), శ్రేయస్ (28) విలువైన పరుగులు జోడించారు. కుల్దీప్ యాదవ్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. నామమాత్రపు మూడో వన్డే ఆదివారం తిరువనంతపురంలో జరుగనుంది.
టాప్ తడబాటు : 216 పరుగుల ఛేదనలో భారత తడబాటుకు గురైంది. టాప్-3 బ్యాటర్లు పవర్‌ప్లేలోనే వికెట్లు చేజార్చుకున్నారు. రోహిత్ (17), గిల్ (21), కోహ్లి (4) నిరాశపరిచారు. పది ఓవర్ల ఆట ముగిసే సరికి భారత్ 67/3 వద్ద నిలిచింది. ఫామ్‌లో ఉన్న బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (28) మంచి ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేదు. 86 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ ఒత్తిడిలో పడింది.
నిలబడిన రాహుల్ : క్లిష్ట పరిస్థితుల్లో కెఎల్ రాహుల్ (64 నాటౌట్) అజేయ అర్థ సెంచరీతో నిలబడ్డాడు. హార్దిక్ పాండ్య (36)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన రాహుల్.. భారత్‌ను విజయానికి చేరువ చేశాడు. రిస్క్ లేకుండా పరుగులు చేసిన ఈ జోడీ శ్రీలంకను వెనక్కి నెట్టింది. పాండ్య నిష్క్రమించినా అక్షర్ పటేల్ (21) ఓ ఫోర్, సిక్సర్‌తో ఉత్కంఠకు తెరదించాడు. కుల్దీప్ (10 నాటౌట్) సాయంతో రాహుల్ లాంఛనం ముగించాడు. ఆరు ఫోర్లు కొట్టిన రాహుల్ అజేయ అర్థ సెంచరీతో భారత్‌ను గెలుపు తీరాలకు చేర్చాడు.
సిరాజ్, కుల్దీప్ కుమ్ముడు : టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (20) త్వరగా నిష్క్రమించినా.. నువనిండు ఫెర్నాండో (50), కుశాల్ మెండిస్ (34) కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. పవర్‌ప్లేలో 51/1తో మెరుగ్గా రాణించిన శ్రీలంక.. మంచి స్కోరు దిశగా సాగింది. ఫెర్నాండో ఆరు ఫోర్లతో అర్థ సెంచరీ బాదగా, మెండిస్ మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో దూకుడు చూపించాడు. ఈ ఇద్దరు క్రీజులో ఉండగా 102/1తో శ్రీలంక పటిష్ట స్థితిలో నిలిచింది. ఇక్కడే భారత బౌలర్లు మామ చేశారు. పవర్‌ప్లే వికెట్‌తో బ్రేక్ ఇచ్చిన మహ్మద్ సిరాజ్, చైనామన్ కుల్దీప్ యాదవ్ కుమ్మేశారు. చెరో మూడు వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించారు. మెండిస్, అసలంక (15), శనక (2)ను కుల్దీప్ అవుట్ చేయగా.. ధనంజయ (0)ను అక్షర్ సాగనంపాడు. ఫెర్నాండో రనౌట్‌గా నిష్క్రమించాడు. వరుసగా వికెట్లు కోల్పోయిన శ్రీలంక కష్టాల్లో కూరుకుంది. ఉమాన్ర్ మాలిక్ సైతం జత కలవటంతో లోయర్ ఆర్డర్ బ్యాటర్లు పరుగులు చేసినా.. 39.4 ఓవర్లలోనే శ్రీలంక కథ ముగిసింది. 215 పరుగులకే శ్రీలంక కుప్పకూలింది. కుల్దీప్, సిరాజ్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. మాలిక్ రెండు వికెట్లతో మెరిశాడు.
స్కోరు వివరాలు :
శ్రీలంక ఇన్నింగ్స్ : అవిష్క (బి) సిరాజ్ 20, నువానిండు (రనౌట్) 50, మెండిస్ (ఎల్బీ) కుల్దీప్ 34, ధనంజయ (బి) అక్షర్ 0, అసలంక (సి,బి) కుల్దీప్ 15, శనక (బి) కుల్దీప్ 2, హసరంగ (సి) అక్షర్ (బి) మాలిక్ 21, డునిత్ (సి) అక్షర్ (బి) సిరాజ్ 32, కరుణతర్నె (సి) అక్షర్ (బి) మాలిక్ 17, రజిత నాటౌట్ 17, కుమార (బి) సిరాజ్ 0, ఎక్స్‌ట్రాలు : 7, మొత్తం : (39.4 ఓవర్లలో ఆలౌట్) 215.
వికెట్ల పతనం : 1-29, 2-102, 3-103, 4-118, 5-125, 6-126, 7-152, 8-177, 9-215, 10-215.
బౌలింగ్ : షమి 7-0-43-0, సిరాజ్ 5.4-0-30-3, పాండ్య 5-0-26-0, మాలిక్ 7-0-48-2, కుల్దీప్ 10-51-3, అక్షర్ 5-0-16-1.
భారత్ ఇన్నింగ్స్ : రోహిత్ (సి) మెండిస్ (బి) కరుణరత్నె 17, గిల్ (సి) అవిష్క (బి) కుమార 21, కోహ్లి (బి) కుమార 4, శ్రేయస్ (ఎల్బీ) రజిత 28, రాహుల్ నాటౌట్ 64, పాండ్య (సి) మెండిస్ (బి) కరుణరత్నె 36, అక్షర్ (సి) కరుణరత్నె (బి) ధనంజయ 21, కుల్దీప్ నాటౌట్ 10, ఎక్స్‌ట్రాలు : 18, మొత్తం : (43.2 ఓవర్లలో 6 వికెట్లకు) 219.
వికెట్ల పతనం : 1-33, 2-41, 3-62, 4-86, 5-161, 6-191.
బౌలింగ్ : రజిత 9-0-46-1, కుమార 9.2-0-64-2, కరుణరత్నె 8-0-51-2, హసరంగ 10-0-28-0, డునిత్ 2-0-12-0, శనక 2-0-6-0, ధనంజయ 3-0-9-1.