Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూర్య,ఇషాన్‌లకు చోటు!
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా జట్టు వచ్చే నెలలో భారత్‌లో పర్యటించనుంది. ఇందులో భాగంగా నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌లో తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తొలి రెండు టెస్టుల కోసం ఎంపిక చేసిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. టీ20ల్లో అద్భుత ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌లకు టెస్టు జట్టులో చోటు లభించింది.
ఈ నెల 1న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషభ్ పంత్ ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. పంత్ మరో ఆరు నెలలపాటు జట్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అతడి స్థానాన్ని ఇషాన్ కిషన్‌తో భర్తీ చేశారు. అలాగే, గాయంతో గతేడాది జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు తిరిగి జట్టులో స్థానం లభించింది. గాయం నుంచి పూర్తిస్థాయిలో కోలుకోని స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టులో చోటు కోసం మరికొంత కాలం ఆగక తప్పకపోవచ్చు. ఇక, బ్యాకప్ కీపర్‌గా కేఎస్ భరత్‌కు చోటు కల్పించారు. సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ టెస్టు జట్టులో తన స్థానం నిలుపుకున్నాడు. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ చోటు నిలుపుకున్నారు.
ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, సూర్యకుమార్ యాదవ్.