Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సొంతగడ్డపై భారత్ గర్జించే పులి. ఇది టెస్టు క్రికెట్‌కు మాత్రమే పరిమితం కాదు. వన్డే ఫార్మాట్లోనూ టీమ్ ఇండియా అదే దూకుడు చూపిస్తుంది. 2010 ఆరంభం నుంచి భారత్ స్వదేశంలో 25 ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడగా, ఏకంగా 22 సిరీస్‌లు సొంతం చేసుకుంది. 2023 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ ఏడాదిలో ఈ రికార్డుకు మరింత ప్రత్యేకత సంతరించుకుంది. మిషన్ వరల్డ్‌కప్ దిశగా సాగుతున్న టీమ్ ఇండియా కొత్త ఏడాదిని 3-0 క్లీన్‌స్వీప్‌తో మొదలెట్టింది. వన్డే క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద విజయంతో ఊపుమీదున్న రోహిత్‌సేన.. నేడు న్యూజిలాండ్ సవాల్‌కు సిద్ధం కానుంది. హైదరాబాద్ వేదికగా భారత్, న్యూజిలాండ్ తొలి వన్డే నేడు.
- సొంతగడ్డపై భారత్‌కు మరో పరీక్ష
- హైదరాబాద్‌లో తొలి వన్డే నేడు
- మధ్యాహ్నాం 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-హైదరాబాద్
ఐసీసీ 2023 వన్డే వరల్డ్‌కప్ ఏడాదిలో భారత్ మరో పరీక్ష ఎదుర్కొనుంది. శ్రీలంకను చిత్తుగా ఓడించి సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన భారత్‌కు హైదరాబాద్ కాస్త కఠిన సవాల్ ఎదురు కానుంది. స్వదేశంలో ఎదురులేని రికార్డులున్న భారత్‌పై 2016, 2017 వన్డే సిరీస్‌లను నిర్ణయాత్మక మ్యాచ్ వరకూ తీసుకెళ్లిన న్యూజిలాండ్.. ఇటీవల పాకిస్థాన్‌పై 2-1 వన్డే సిరీస్ విజయంతో భారత్‌లో అడుగుపెట్టింది. ఇటు భారత్, అటు న్యూజిలాండ్ తాజా విజయాల జోరు మీదున్నాయి. ఐసీసీ వరల్డ్ నం.1 వన్డే జట్టు న్యూజిలాండ్‌ను ఎదుర్కొనేందుకు ఐసీసీ వరల్డ్ నం.2 వన్డే జట్టు భారత్ రంగం సిద్ధం చేసుకుంది. సొంతగడ్డపై భారత్ విసిరే పంజాను న్యూజిలాండ్ తట్టుకోగలదా? చూడాలి.
మెరిసేందుకు ఓ అవకాశం! :
భారత్ ఇటీవల రెండు భారీ విజయాలు సాధించింది. శ్రీలంకపై తొలుత బ్యాటింగ్ చేసిన రెండు మ్యాచుల్లోనూ వరుసగా 373, 390 పరుగుల భారీ స్కోర్లు నమోదు చేసింది. ఈ రెండు సందర్భాల్లానూ సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి శతక మోత మోగించాడు. వ్యక్తిగత కారణాల రీత్యా కెఎల్ రాహుల్, అక్షర్ పటేల్ న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్నారు. దీంతో ఈ ఇద్దరి స్థానంలో తుది జట్టులోకి రానున్న క్రికెటర్లు అవకాశం సద్వినియోగం చేసుకునే పనిలో ఉన్నారు. 2023 వరల్డ్‌కప్‌కు రోహిత్ శర్మకు తోడుగా శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేస్తాడని జట్టు మేనేజ్మెంట్ ఓ స్పష్టతతో ఉంది. దీంతో ఆడిన చివరి వన్డేల్లో ద్వి శతకం సాధించిన ఇషాన్ కిషన్ బెంచ్‌పై కూర్చున్నాడు. కెఎల్ రాహుల్ స్థానంలో కిషన్ నేడు తుది జట్టులోకి రానున్నాడు. వికెట్ కీపింగ్‌తో పాటు మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ అవకాశం దక్కించుకోనున్నాడు. వన్డే తుది జట్టులో చోటు కోసం మెగా ట్రయల్‌తో పాటు ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ప్రథమ ప్రాధాన్య వికెట్ కీపర్‌గా నిలిచేందుకు కిషన్ ఆట సాగనుంది. అక్షర్ పటేల్ స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి రానున్నాడు. బెంచ్‌కు పరిమితమైన వాషింగ్టన్ సుందర్ కివీస్‌పై సత్తా చాటేందుకు ఎదురు చూస్తున్నాడు. ఇక శ్రేయస్ అయ్యర్‌కు గాయం కావటంతో అనూహ్యంగా వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో టీ20 మొనగాడు సూర్యకుమార్ యాదవ్ తుది జట్టులోకి రావటం లాంఛనమే. 50 ఓవర్ల ఫార్మాట్లో తనదైన శైలి చూపించేందుకు సూర్యకుమార్ సిద్ధంగానే ఉన్నాడు. టాప్ ఆర్డర్లో విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్ ఫామ్‌లోకి రాగా.. కెప్టెన్ రోహిత్ శర్మ తనదైన ఇన్నింగ్స్ బాకీ పడ్డాడు. కివీస్‌పై వన్డేల్లో నాయకుడు ఫామ్‌లోకి వస్తే భారత్‌కు ఇక పరుగుల పండగే. బౌలింగ్ విభాగంలో భారత్ ముగ్గురు పేసర్లకు తోడు హార్దిక్ పాండ్యను బరిలోకి దింపనుంది. స్పిన్ పిచ్‌పై వాషింగ్టన్ సుందర్‌కు తోడు కుల్దీప్ యాదవ్, యుజ్వెంద్ర చాహల్‌లలో ఒకరు లేదా ఇద్దరూ బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమిలతో కలిసి యువ స్పీడ్‌గన్ ఉమ్రాన్ మాలిక్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. లోకల్ హీరో మహ్మద్ సిరాజ్‌పై తొలి వన్డేలో ప్రత్యేక ఫోకస్ ఉండనుంది.
కివీస్ నిలిచేనా?! : వైట్‌బాల్ ఫార్మాట్లో న్యూజిలాండ్ ఎప్పుడూ బలమైన జట్టే. కానీ కెప్టెన్ కేన్ విలియమ్సన్, స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీలు లేకుండానే ఆ జట్టు భారత్‌లో అడుగుపెట్టింది. గాయంతో ఇశ్ సోధి తొలి వన్డేకు దూరమయ్యాడు. గ్లెన్ ఫిలిప్స్ తీవ్ర జ్వరం నుంచి కోలుకోవటం పర్యాటక జట్టు శిబిరంలో కాస్త ఊరట. బ్యాటింగ్ విభాగంలో కేన్ విలియమ్సన్, బౌలింగ్ విభాగంలో బౌల్ట్, సౌథీ స్థానాలు భర్తీ చేయటమే కివీస్‌కు అసలు సమస్య. భారత్‌ను సొంతగడ్డపై ఇరకాటంలో పడేయటం కివీస్‌కు బాగా తెలుసు. ఉపఖండ పరిస్థితుల్లోనూ భారత్‌పై విజయం సాధించవచ్చని ఇటీవల బంగ్లాదేశ్ నిరూపించింది. ఎటాకింగ్ స్పిన్ దళంతో భారత్‌పై పైచేయి సాధించవచ్చని న్యూజిలాండ్‌కు తెలుసు. కానీ హైదరాబాద్ వన్డేలో ఆ జట్టు ముగ్గురు స్పిన్నర్లను బరిలోకి దింపలేని స్థితి. ఇశ్ సోధి మోకాలి గాయానికి గురవటంతో ఇద్దరు స్పిన్నర్లతోనే ఆడనుంది.
ఇక కెప్టెన్ టామ్ లేథమ్ న్యూజిలాండ్‌కు అతిపెద్ద బలం. భారత్‌పై టామ్ లేథమ్‌కు మంచి రికార్డుంది. భారత్‌పై 17 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 65.07 సగటుతో, 98.93 స్ట్రయిక్‌రేట్‌తో లేథమ్ పరుగులు పిండుకున్నాడు. భారత్‌పై చివరగా ఆడిన వన్డేలోనూ 104 బంతుల్లో అజేయంగా 145 పరుగులు సాధించాడు. ఆ ఫామ్‌ను కొనసాగించాలని లేథమ్ భావిస్తున్నాడు. విలియమ్సన్ లేని వేళ లేథమ్ బ్యాటింగ్ విభాగంలో మరింత బాధ్యత తీసుకోవాల్సి ఉంది. ఇతర బ్యాటర్లకు భారత్‌లో ఆడిన అనుభవం లేదు. ఇది ఆ జట్టుకు ప్రతికూలం. కానీ ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, మార్క్ చాప్మన్, డార్లీ మిచెల్ ప్రతిభావంతులు. గ్లెన్ ఫిలిప్స్ ప్రమాదకర ఆటగాడు. పాకిస్థాన్‌పై ఆడిన అనుభవంతో భారత్‌లోనూ మెరిసేందుకు ఎదురుచూస్తున్నారు. బౌలింగ్ విభాగంలో లాకీ ఫెర్గుసన్ కివీస్‌ను నడిపించనున్నాడు. 2023 వన్డే వరల్డ్‌కప్ ముంగిట భారత్‌తో సిరీస్‌లో ఫలితంతో సంబంధం లేకుండా విలువైన అనుభవం గడించటంపైనే న్యూజిలాండ్ ఎక్కువగా దృష్టి సారించినట్టు కనిపిస్తోంది!.
పిచ్, వాతావరణం : రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇప్పటివరకు ఆరు వన్డేలు జరిగాయి. గణాంకాల ప్రకారం ఆ ఆరు వన్డేల్లోనూ స్పిన్నర్లు చక్రం తిప్పారు. చివరగా 2019లో ఆస్ట్రేలియాతో వన్డేలోనూ భారత స్పిన్నర్లు కుల్దీప్, జడేజా, కేదార్లు మెరవటంతో కంగారూలు స్పల్ప స్కోరుకే పరిమితం అయ్యారు. ఇక్కడ స్పిన్నర్ల సగటు 38.70, ఎకానమీ 4.96. పేసర్ల సగటు 40.84 కాగా ఎకానమీ 5.74గా ఉంది. నేడు భారత్, న్యూజిలాండ్ వన్డేలోనూ స్పిన్ కీలక పాత్ర పోషించనుంది. తొలి వన్డేకు వాతావరణం అనుకూలంగా ఉంది. మధ్యాహ్నాం ఉష్ణోగ్రతలు 31 డిగ్రీల సెల్సియస్ ఉండనుంగా.. రెండో ఇన్నింగ్స్ సమయానికి ఆహ్లాదకరంగా ఉండనుంది. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునేందుకు మొగ్గుచూపవచ్చు.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్/ యుజ్వెంద్ర చాహల్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.
న్యూజిలాండ్ : ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, మార్క్ చాప్మాన్/హెన్రీ నికోల్స్, డార్లీ మిచెల్, టామ్ లేథమ్ (కెప్టెన్, వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైకల్ బ్రాస్‌వెల్, మిచెల్ శాంట్నర్, హెన్రీ సిప్లే, జాకబ్ డఫ్పీ, లాకీ ఫెర్గుసన్.
వన్డేల్లో వేగంగా వెయ్యి పరుగులు సాధించిన భారత బ్యాటర్లుగా కోహ్లి, ధావన్ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. 1000 పరుగులకు ఆ ఇద్దరు 24 ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆ రికార్డును తిరగరాసేందుకు శుభ్‌మన్ గిల్‌కు అవకాశం ఉంది. 18 ఇన్నింగ్స్‌ల్లో గిల్ 894 పరుగులు చేశాడు. మరో 106 పరుగులు సాధిస్తే గిల్ ఈ ఘనత దక్కించుకోనున్నాడు.
2022 ఆరంభం నుంచి ఐసీసీ శాశ్వత సభ్య దేశాల బౌలర్లలో అత్యధిక వికెట్లు కూల్చిన బౌలర్‌గా హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ కొనసాగుతున్నాడు. ఈ సమయంలో సిరాజ్ 19.87 సగటుతో 33 వికెట్లు పడగొట్టాడు. నేడు సొంతగడ్డపై సిరాజ్ మరో మెరుపు ప్రదర్శనపై కన్నేశాడు.